ధనం కాదు, గుణం చాలు! | దానం అంటే ఏమిటి? నిస్వార్థ దానం గురించి చింతన
భమిడిపాటి గౌరీశంకర్ గారి చింతన: ప్రతిఫలం ఆశించకుండా అవసరంలో ఉన్నవారికి సాయం చేయడమే దానం; దానానికి ధనం కాదు, గుణం కావాలి. కర్ణుడు, శిబి, దధీచి, బలి చక్రవర్తుల సంప్రదాయ కథలు, భగవద్గీత 17.20–22 ప్రకారం మూడు రకాల దానాలు, రోజువారీ జీవితంలో దానంపై సులభమైన జవాబులతో.

ఓం శ్రీ మాత్రే నమః
సంక్షిప్తంగా: ప్రతిఫలం ఆశించకుండా అవసరంలో ఉన్నవారికి సాయం చేయడమే నిజమైన దానమని, దానానికి ధనం కాదు, గుణం కావాలని భమిడిపాటి గౌరీశంకర్ గారి ఈ చింతన చెబుతుంది. ఇది కర్ణుడు, శిబి, దధీచి, బలి చక్రవర్తులను స్మరించి, ఒక చిన్న బస్సు కథతో ముగుస్తుంది. ఈ నలుగురి ఉదాహరణలపై సంక్షిప్త నేపథ్యాన్ని, మూడు రకాల దానాలపై భగవద్గీత 17.20–22 శ్లోకాలను, సాధారణ ప్రశ్నలకు జవాబులను మేము చేర్చాము.
భమిడిపాటి గౌరీశంకర్ గారి చింతన
దానం అంటే ఏమిటి? ప్రతిఫలం ఆశించని ఇవ్వడం
దానమంటే ఏమిటి అనే ప్రశ్నకు అనేక ఆధ్యాత్మిక నిర్వచనాలున్నాయి. ప్రధానంగా చెప్పాలంటే అవసరంలో ఉన్నవారికి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయడం, చేసిన వెంటనే మరచిపోవడం. దానం అందరూ చేయరు. చేయలేరని భారత, భాగవతాల్లో ఎన్నో గొప్ప నిదర్శనాలున్నాయి. రారాజని పిలిపించుకున్న దుర్యోధనుడు సైతం ఒకానొక సందర్భంలో దానం చేయలేక నిస్సహాయతను ప్రకటించాడు. కానీ.. అంగరాజైన కర్ణుడు దానం చేశాడు. యుద్దసమయంలో రథం భూమిలో కూరుకుపోయిన సందర్భంలో కూడా శ్రీకృష్ణుడు పెట్టిన పరీక్షలో నెగ్గి దానకర్ణుడు అనిపించుకున్నాడు. తన శరీరాన్ని ముక్కలుగా చేసి పావురాన్ని రక్షించడానికి సిద్ధపడ్డాడు శిబి. ఏకంగా వెన్నెముకను దానం చేసి గొప్ప దాతగా నిలిచాడు దధీచి. ధరణీధరుడైన విష్ణువుకే మూడడుగుల నేల దానమిచ్చాడు బలి చక్రవర్తి. వీరంతా ప్రతిఫలం ఆశించకుండా అర్థించినవారికి అభయమిచ్చి యశోభూషణులయ్యారు. నేటి సమాజంలో జరుగుతున్నట్లు పావలా దానమిచ్చి పాతిక రూపాయల ప్రచారం కోరుకోవడం దానమనిపించుకోదు.
కర్ణుడు, శిబి, దధీచి, బలి: ఈ పేర్ల వెనుక ఉన్న సంప్రదాయ కథలు
(కింది నాలుగు ఉదాహరణలు తరతరాలుగా చెప్పుకునే ఇతిహాస, పురాణ సంప్రదాయ కథలు; చెప్పే విధానాన్ని బట్టి వివరాలు మారుతాయి, ఇవి చారిత్రక ఆధారాలు కావు.)
- కర్ణుడు: మహాభారత సంప్రదాయంలో అంగరాజైన కర్ణుడు తన దగ్గర అర్థించినవారిని ఎవరినీ వెనక్కి పంపలేదని చెబుతారు, అందుకే దానకర్ణుడిగా గుర్తుండిపోయాడు. ఇంద్రుడు యాచకుని వేషంలో వచ్చినప్పుడు తన సహజ కవచకుండలాలను ఇచ్చాడనే కథ ప్రసిద్ధం.
- శిబి: తన శరణు కోరిన పావురాన్ని రక్షించడానికి తన శరీరమాంసాన్నే సమర్పించిన రాజుగా సంప్రదాయ కథలో శిబి గుర్తుండిపోయాడు.
- దధీచి: పురాణ కథనం ప్రకారం, దేవతలకు ఆయుధం (వజ్రాయుధం) తయారుచేసుకోవడానికి తన ఎముకలను ఇచ్చిన మహర్షి దధీచి.
- బలి: వామనుడిగా వచ్చిన విష్ణువు అడిగిన మూడడుగుల నేలను ఇచ్చిన చక్రవర్తి బలి. ఈ కథను వామనావతారంపై మా పేజీలో (కింద లింక్) పూర్తిగా చదవవచ్చు.
నిస్వార్థం, సరైన సమయం, సరైన వ్యక్తి
దానంలో నిస్వార్థం అవసరం. సరైన సమయంలో అవసరమైన వారికి చేయాలి. కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియనంత రహస్యం పాటించాలి. గొప్పలకోసం చేయకూడదు. దానం వల్ల ప్రయోజనాలున్నాయి. కానీ, కేవలం ప్రయోజనం ఆశించి దానం చేయకూడదు. దానం సత్కర్మ, సానుకూల శక్తిని తెలియజేస్తుంది. జీవితంలో మంచి మార్పులకు నాంది పలుకుతుంది. దాతకు, గ్రహీతకు, సమాజానికి మేలు చేస్తుంది. రాజయోగమంటే సాధారణంగా ధనమో అదృష్టమో కలిసిరావడం అనుకుంటారు. కానీ, వేమన ఈ మాటకు మరో విశేషార్ధం చెబుతాడు. దానధర్మాలు, దయ, సత్యం, నీతి, వినయం, ధైర్య శౌర్యాలు, త్యాగం... ఈ గుణాలు కలిగి ఉండటమే నిజమైన రాజయోగమంటాడు.
ఒక కథ: బస్సులో పెద్దావిడ
ఓ పెద్దాయన బస్సులో ప్రయాణిస్తున్నాడు. పక్క సీటులో మరొక పెద్దావిడ కూర్చుంది. ఇంతలో ఒక గర్భిణి బస్సు ఎక్కింది. పెద్దావిడ లేచి తన సీటిచ్చింది. గర్భవతి దిగిపోగానే మళ్లీ కూర్చుంది. కొంత సేపటికి ఓ వృద్ధుడు కర్ర ఊతంతో బస్సెక్కాడు. ఈవిడ మళ్లీ లేచి సీటిచ్చింది. వృద్దుడు దిగడానికి సాయం చేసింది. తర్వాత ఇంకో వృద్ధురాలు. యథాప్రకారం పెద్దావిడ లేచింది. పక్కసీటు పెద్దాయన విసుగ్గా 'అమ్మా.. నీ సీటులో నువ్వు ప్రశాంతంగా కూర్చోవచ్చుగా. ప్రతిసారీ ఎవరో రావడం, నువ్వు లేవడం... ఎందుకిదంతా' అని అడిగాడు. అందుకామె 'అయ్యా నా దగ్గర డబ్బు లేదు, కానీ.. భగవంతుడు నన్ను మనిషిగా పుట్టించి గొప్ప వరమిచ్చాడు. ఇతరులకు నేనేవిధంగా సాయం చేయగలనా అని ఆలోచించాను. అవసరమైన వారికి నిస్వార్థంగా చేసే సాయం భగవంతుడికి చెప్పుకొనే కృతజ్ఞత అని ఓ స్వామీజీ చెప్పారు. ఆదొక్కటే నేను చేయగల దానం. ఇంతకు మించి భగవంతుణ్ని సేవించుకునే దారి నాకు కనిపించలేదు' అంది. దానం చేయడానికి ధనం అవసరం లేదు. 'గుణం' ఉంటే చాలు.
ఈ చింతన: — భమిడిపాటి గౌరీశంకర్
మూడు రకాల దానాల గురించి భగవద్గీత చెప్పేది
భగవద్గీత 17వ అధ్యాయం, దానం ఏ భావంతో ఇవ్వబడుతుందనే దానిని బట్టి దాని రకం నిర్ణయమవుతుందని వివరిస్తుంది. 17.20 నుంచి 17.22 వరకు ఉన్న శ్లోకాలు సాత్త్విక, రాజస, తామస అనే మూడు రకాల దానాలను చెబుతాయి. ఇవి దానం ఏ విధంగా, ఏ భావంతో ఇవ్వబడుతుందో వివరిస్తాయి; ఏ ప్రత్యేక ఫలితాన్నీ హామీ ఇవ్వవు.
భగవద్గీత 17.20: సాత్త్విక దానం
दातव्यमिति यद्दानं दीयतेऽनुपकारिणे ।
देशे काले च पात्रे च तद्दानं सात्त्विकं स्मृतम् ॥
dātavyamiti yaddānaṃ dīyate'nupakāriṇe |
deśe kāle ca pātre ca taddānaṃ sāttvikaṃ smṛtam ||
అర్థం: ఇవ్వడం తన కర్తవ్యమని భావించి, తిరిగి ఏమీ చేయలేనివారికి, తగిన చోట, తగిన సమయంలో, తగిన వ్యక్తికి ఇచ్చే దానాన్ని సాత్త్వికమని అంటారు.
భగవద్గీత 17.21: రాజస దానం
यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः ।
दीयते च परिक्लिष्टं तद्दानं राजसं स्मृतम् ॥
yattu pratyupakārārthaṃ phalamuddiśya vā punaḥ |
dīyate ca parikliṣṭaṃ taddānaṃ rājasaṃ smṛtam ||
అర్థం: ప్రతిఫలం ఆశించి, లేదా ఫలాన్ని ఉద్దేశించి, లేదా అయిష్టంగా ఇచ్చే దానాన్ని రాజసమని అంటారు.
భగవద్గీత 17.22: తామస దానం
अदेशकाले यद्दानमपात्रेभ्यश्च दीयते ।
असत्कृतमवज्ञातं तत्तामसमुदाहृतम् ॥
adeśakāle yaddānamapātrebhyaśca dīyate |
asatkṛtamavajñātaṃ tattāmasamudāhṛtam ||
అర్థం: తగని చోట, తగని సమయంలో, అపాత్రులకు, గౌరవం లేకుండా లేదా అవమానిస్తూ ఇచ్చే దానాన్ని తామసమని అంటారు.
సంస్కృత పాఠం: శ్రీమద్భగవద్గీత, 17వ అధ్యాయం, 20 నుంచి 22 శ్లోకాలు (sanskritdocuments.org పాఠం ప్రకారం). సరైన సమయంలో, అవసరమైనవారికి, ప్రచారం లేకుండా ఇవ్వాలనే చింతనలోని సలహా ఈ శ్లోకాలను ప్రతిధ్వనిస్తుంది; ఈ పోలిక మాది, రచయితది కాదు.
తరచుగా అడిగే ప్రశ్నలు
దానం అంటే ఏమిటి?
దానం అంటే ఇవ్వడం. చింతనలోని మాటల్లో చెప్పాలంటే, అవసరంలో ఉన్నవారికి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయడం, చేసిన వెంటనే మరచిపోవడం. భగవద్గీత (17.20) ప్రకారం, ఇవ్వడం తన కర్తవ్యమని భావించి, తిరిగి ఇవ్వలేనివారికి, తగిన చోట, తగిన సమయంలో, తగిన వ్యక్తికి ఇచ్చే దానం సాత్త్వికమైనది.
ధనం లేకుండా దానం చేయవచ్చా?
చేయవచ్చు. చింతన చివర బస్సులో ఉన్న పెద్దావిడ గురించి చెబుతుంది; ఆమె దగ్గర డబ్బు లేదు, అయినా గర్భిణికి, వృద్ధులకు మళ్లీ మళ్లీ తన సీటు ఇస్తుంది. అవసరమైనవారికి నిస్వార్థంగా చేసే సాయమే భగవంతునికి చెప్పుకొనే కృతజ్ఞత అని ఆమె అంటుంది; దానానికి ధనం అవసరం లేదు, “గుణం” ఉంటే చాలు అని రచయిత ముగిస్తారు. సమయం, శ్రమ, సీటు ఇవ్వడం, చేయూత, మంచి మాట ఇవన్నీ ఇవ్వడానికి మార్గాలే.
దానం ప్రచారం లేకుండా రహస్యంగా ఎందుకు చేయాలి?
కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియనంత రహస్యం పాటించాలని, గొప్పలకోసం చేయకూడదని చింతన చెబుతుంది; ఇచ్చినదానికి మించిన ప్రచారం కోరుకోవడం దానమనిపించుకోదని అంటుంది. భగవద్గీత (17.21) కూడా ప్రతిఫలాన్ని ఆశించి, ఫలాన్ని ఉద్దేశించి ఇచ్చే దానాన్ని రాజసమైనదిగా చెబుతుంది; అది సాత్త్విక దానం కంటే తక్కువ స్థాయిది.
భగవద్గీత దాన భేదాల గురించి ఏం చెబుతుంది?
17వ అధ్యాయం మూడు రకాల దానాలను వివరిస్తుంది. సాత్త్విక దానం (17.20): కర్తవ్యమని భావించి, తిరిగి ఇవ్వలేనివారికి, తగిన చోట, తగిన సమయంలో, తగిన వ్యక్తికి ఇచ్చేది. రాజస దానం (17.21): ప్రతిఫలం ఆశించి, ఫలాన్ని ఉద్దేశించి లేదా అయిష్టంగా ఇచ్చేది. తామస దానం (17.22): తగని చోట, తగని సమయంలో, అపాత్రులకు, గౌరవం లేకుండా లేదా అవమానిస్తూ ఇచ్చేది.
రోజువారీ జీవితంలో దానానికి ఉదాహరణలు ఏమిటి?
బస్సు కథలోలాగా అవసరమైనవారికి సీటు ఇవ్వడం; ఆకలితో ఉన్నవారితో భోజనం పంచుకోవడం; వృద్ధులైన పొరుగువారికి పనుల్లో సాయం చేయడం; నేర్చుకోవాలనుకునేవారికి మీకు తెలిసినది చెప్పడం; ఆలయం లేదా సమాజ సేవకు సమయం ఇవ్వడం; లేదా మీరు పరిశీలించి నమ్మిన సంస్థకు ధనసాయం చేయడం. సాయం నిజమైనదై, సమయానికి అందేదై, పేరు ఆశించకుండా చేసేదై ఉండటమే వీటన్నింటిలో ఉన్న సూత్రం.
కర్ణుడు, శిబి, దధీచి, బలి చక్రవర్తులు దానానికి ఎందుకు గుర్తుండిపోయారు?
ఇతిహాస, పురాణ సంప్రదాయంలో వీరంతా వెనుకాడకుండా ఇచ్చినవారిగా గుర్తుండిపోయారు: కర్ణుడు (దానకర్ణుడు) అర్థించినవారిని ఎవరినీ వెనక్కి పంపనివాడిగా; శిబి ఒక పావురాన్ని కాపాడటానికి తన శరీరాన్ని సమర్పించినవాడిగా; దధీచి తన ఎముకలను ఇచ్చినవాడిగా; బలి వామనుడిగా వచ్చిన విష్ణువుకు మూడడుగుల నేల ఇచ్చినవాడిగా. ఇవి సంప్రదాయ కథలు; చెప్పే విధానాన్ని బట్టి వివరాలు మారుతాయి.
సంపాదకుని గమనిక
ఈ చింతన HinduToneకు తెలుగులో అందింది; దీని రచయిత భమిడిపాటి గౌరీశంకర్. తెలుగు పాఠమే మూలం; ఆంగ్ల, హిందీ పేజీలు దాని యథాతథ అనువాదాలు. కర్ణుడు, శిబి, దధీచి, బలి, వేమన ప్రస్తావనలు, బస్సు కథతో సహా చింతన అంతా రచయితదే. తెలుగు పాఠంలో ముద్రణలో పదాలు వరుసల మధ్య విడిపోయిన కొన్ని చోట్ల మాత్రమే, అలాగే శీర్షికలోని అనవసరమైన కొటేషన్ గుర్తును సరిచేశాము. సంక్షిప్త సారాంశం, ఈ నాలుగు ఉదాహరణలు సంప్రదాయ కథలనే గమనిక, భగవద్గీత 17.20–22 శ్లోకాలు (సంస్కృత పాఠం, అర్థం, మూలంతో), ప్రశ్నలు-జవాబులు, సంబంధిత లింకులు HinduTone చేర్చినవి. వేమన పద్యాన్ని మేము ఉటంకించలేదు; ఆయన అభిప్రాయం ప్రస్తావన రచయిత చెప్పినట్లే ఉంది. ఇది ఒక ఆధ్యాత్మిక చింతన మాత్రమే, వృత్తిపరమైన సలహా కాదు.
చివరిగా నవీకరించినది: 31 అక్టోబర్ 2026
ఇవి కూడా చదవండి
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
ఆధ్యాత్మికత నుంచి మరిన్ని
- అహం బ్రహ్మాస్మి అర్థం: ఇది అహంకారం ఎందుకు కాదు
- తత్ త్వం అసి అర్థం: ఛాందోగ్య ఉపనిషత్తు 6.8.7 వివరణ
- ఆత్మ అంటే ఏమిటి? ఉపనిషత్తులలో ఆత్మ తత్త్వం వివరణ
- లక్ష్మీదేవి కోసం శుక్రవార వ్రతం (శుక్రవారం ఉపవాసం): నియమాలు, సామగ్రి, పూజా విధి, మంత్రాలు మరియు 2026 శుక్రవారాలు
- ఆత్మజ్ఞానానికి అడ్డుగోడ అహంకారం | అహం తొలగితేనే నిజమైన జ్ఞానం




