జ్యేష్ఠ శుద్ధ దశమి – దశపాపహర దశమి గంగావతరణం మహిమ
జ్యేష్ఠ శుద్ధ దశమి – దశపాపహర దశమి గంగావతరణం శివునితో సంబంధించిన అత్యంత పవిత్రమైన ఘట్టాలలో గంగావతరణం ఒకటి. భగవంతుని అపారమైన కరుణకు ఇది గొప్ప నిదర్శనం.
జ్యేష్ఠ శుద్ధ దశమి – దశపాపహర దశమి గంగావతరణం
శివునితో సంబంధించిన అత్యంత పవిత్రమైన ఘట్టాలలో గంగావతరణం ఒకటి. భగవంతుని అపారమైన కరుణకు ఇది గొప్ప నిదర్శనం.
సగర చక్రవర్తి కుమారులు తమ యాగాశ్వాన్ని వెతుకుతూ కపిల మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ గుర్రం కనిపించడంతో మహర్షినే దొంగగా భావించి అవమానించారు. వారి దురహంకారానికి కోపించిన కపిల మహర్షి హుంకారంతో వారంతా భస్మరాశులుగా మారిపోయారు.
అంశుమంతుడు వారికి జలతర్పణం చేయాలని ప్రయత్నించగా, గరుత్మంతుడు సాధారణ జలాలతో వారికి సద్గతి కలగదని, స్వర్గగంగా భూమికి వచ్చి వారి భస్మాన్ని తాకినప్పుడే విముక్తి లభిస్తుందని తెలిపాడు.
ఆ మహత్తర కార్యం కోసం సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరకు భగీరథుడు కఠోర తపస్సు ప్రారంభించాడు. ముందుగా బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకుని గంగను భూమికి తీసుకురావడానికి అనుమతి పొందాడు. అయితే గంగ ప్రవాహ వేగాన్ని భూమి తట్టుకోలేదని, ఆమెను ధరించగల శక్తి శివునికే ఉందని బ్రహ్మ సూచించాడు.
దాంతో భగీరథుడు పరమేశ్వరుని ఆరాధించాడు. ఆయన తపస్సుకు సంతోషించిన శివుడు తన జటాజూటంలో గంగను ధరించేందుకు అంగీకరించాడు. గంగాదేవి తన ఉధృత ప్రవాహంతో శివుని కూడా తీసుకుపోతానని భావించినా, శివుడు ఆమెను తన జటలలో బంధించి, అనంతరం కరుణతో భూమిపైకి విడుదల చేశాడు.
భగీరథుని వెంట గంగ ప్రవహిస్తూ వస్తూ జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది. కోపించిన మహర్షి గంగను గ్రహించాడు. భగీరథుని ప్రార్థనతో తిరిగి తన చెవి ద్వారా గంగను విడుదల చేశాడు. అప్పటి నుండి గంగకు జాహ్నవి అనే నామం కూడా ప్రసిద్ధి చెందింది.
చివరకు గంగ పాతాళానికి చేరి సగరపుత్రుల భస్మరాశులను తాకింది. వెంటనే వారికి సద్గతి కలిగి, ఉన్నత లోకాలను పొందారు.
భగీరథుడు చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా బ్రహ్మదేవుడు, గొప్ప లక్ష్య సాధన కోసం చేసే మహాప్రయత్నాన్ని ఇకముందు భగీరథ ప్రయత్నం అని పిలుస్తారని వరమిచ్చాడు. అలాగే గంగ యొక్క ఆ ప్రవాహానికి భాగీరథి అనే పేరు ప్రసిద్ధి చెందింది.
గంగావతరణ కథను భక్తిశ్రద్ధలతో వినడం, చదవడం వల్ల పాపక్షయం కలిగి, సత్ప్రేరణలు పెరిగి, భగవంతునిపై భక్తి, సద్బుద్ధి, సత్కర్మానుష్ఠానం కలుగుతాయని మహర్షులు పేర్కొన్నారు.
గంగాధరుడైన పరమేశ్వరునికి, గంగామాతకు నమస్సుమాంజలి.
శుభమస్తు
✍️ శ్రీ సద్గురు పీఠం ద్వారా
సమస్త లోకాః సుఖినో భవంతు 🙏



