కోటా యూనివర్సిటీలో కర్మకాండల కోర్సు..! పట్టభద్ర పంతుళ్లు..!!

రాజస్థాన్ నుంచి ఓ ఆసక్తికరమైన వార్త. చదువు అంటే కేవలం కంప్యూటర్లో కోడింగ్ రాయడమే కాదు, మన పురాణాల్లోని ‘కోడ్’ను డీకోడ్ చేయడం కూడా అని కోటా వర్సిటీ నిరూపిస్తోంది.

ఏమిటీ కోర్సు? ఎందుకీ ఉత్సాహం?

సాధారణంగా డిగ్రీ అంటే బీఏ, బీకాం అనుకుంటాం. కానీ రాజస్థాన్‌లోని వర్ధమాన్ మహావీర్ ఓపెన్ యూనివర్సిటీ (VMOU) మాత్రం ‘కర్మకాండ’ కోర్సు అంటోంది. 12వ తరగతి పాసైతే చాలు.. చేతిలో నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటే చాలు.. మీరు కూడా శాస్త్రీయంగా ‘కర్మకాండ’ నేర్చుకోవచ్చు. అడ్డంకులు లేవు, వయసు పరిమితులు లేవు. అసలు విషయం ఏమిటంటే.. సీట్లు అపరిమితం! అంటే నేర్చుకోవాలన్న తపన ఉండాలే కానీ, వర్సిటీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి.

షోడశ సంస్కారాలు…సిలబస్ అంశాలు

మన హిందూ ధర్మంలో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 16 రకాల సంస్కారాలు (షోడశ సంస్కారాలు) ఉన్నాయి. నామకరణం నుంచి వివాహం వరకు అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఈ రోజుల్లో చాలామందికి మంత్రం అర్థం కాదు, తంత్రం తెలియదు. పంతులు గారు ఏదో చెబుతారు, మనం ఏదో చేస్తాం. కానీ ఈ ఆరు నెలల కోర్సు పూర్తి చేస్తే, ఆ మంత్రాల వెనుక ఉన్న పరమార్థం ఏమిటో బోధపడుతుంది. పెళ్లిలో ఏడు అడుగుల ప్రాముఖ్యం ఏమిటో, హోమంలో వేసే సమిధల విశిష్టత ఏమిటో శాస్త్రీయంగా తెలుస్తుంది.

కుల మతాలకతీతంగా సంప్రదాయ విజ్ఞానం

ఈ కోర్సులో ఉన్న మరో గొప్ప విషయం ఏమిటంటే.. ఇక్కడ కుల ప్రస్తావన లేదు. మత నిబంధన లేదు. సంప్రదాయం మీద గౌరవం ఉండి, నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉన్న ఎవరైనా ఇందులో చేరవచ్చు. డిజిటల్ యుగంలో సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయన్న ఆందోళన ఉన్న తరుణంలో, యూనివర్సిటీ స్థాయిలోనే ఇలాంటి కోర్సులు రావడం విశేషం.

Advertisement

‘సంస్కారాల’ చదువు

చదువు అంటే కేవలం ఉద్యోగం కోసం చదివేదే కాదు… మన ఆచారాలు, అందులో దాగిన మనవైన సంస్కారాలు నేర్చుకోవడం, నేర్పడం కూడా చదువేనని ఈ కోర్సు గుర్తు చేస్తోంది. సంప్రదాయం అంటే చాదస్తం కాదు, అది మన జీవన విధానం. కోటా వర్సిటీ వేసిన ఈ అడుగు రేపు మరిన్ని యూనివర్సిటీలకు మార్గదర్శకం కావచ్చు. రేప్పొద్దున మన ఇంటి వేడుకలో ఈ కర్మకాండ కోర్స్ పూర్తి చేసిన ఒక యువ గ్రాడ్యుయేట్ మంత్రాలు చదువుతూ, వాటి అర్థాలు వివరించవచ్చు…

తరచుగా అడిగే ప్రశ్నలు

కర్మకాండ కోర్సును ఏ యూనివర్సిటీ అందిస్తోంది?

రాజస్థాన్‌లోని కోటాలో ఉన్న వర్ధమాన్ మహావీర్ ఓపెన్ యూనివర్సిటీ (VMOU) ఈ కర్మకాండ కోర్సును అందిస్తోంది.

కర్మకాండ కోర్సులో చేరడానికి అర్హత మరియు ఫీజు ఎంత?

12వ తరగతి పాసైతే చాలు, ఫీజు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు. వయసు పరిమితులు లేవు, సీట్లు అపరిమితం.

కర్మకాండ కోర్సు వ్యవధి ఎంత, సిలబస్‌లో ఏముంటుంది?

ఇది ఆరు నెలల కోర్సు. నామకరణం నుంచి వివాహం వరకు 16 షోడశ సంస్కారాలు, మంత్రాల పరమార్థం, పెళ్లిలో ఏడు అడుగులు, హోమంలో సమిధల విశిష్టత శాస్త్రీయంగా నేర్పుతారు.

కర్మకాండ కోర్సులో ఎవరైనా చేరవచ్చా?

అవును. కుల ప్రస్తావన గానీ, మత నిబంధన గానీ లేదు. సంప్రదాయం మీద గౌరవం, నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉన్న ఎవరైనా చేరవచ్చు.

యూనివర్సిటీ స్థాయిలో కర్మకాండ కోర్సు ఎందుకు ప్రత్యేకం?

డిజిటల్ యుగంలో సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయన్న ఆందోళన ఉన్న సమయంలో, ఆచారాలు, సంస్కారాలు నేర్చుకోవడం కూడా చదువేనని ఈ కోర్సు గుర్తు చేస్తోంది. ఇది మరిన్ని యూనివర్సిటీలకు మార్గదర్శకం కావచ్చు.