వివాహ విషయంలో తల్లితండ్రులు తెలియక కొన్ని తప్పులు చేయుచున్నారు! ఏమిటీ అనగా ఏదైనా అమ్మాయికి, కాని అబ్బాయికి కాని సంబంధం రాగానే ముందు నక్షత్రం ఏమిటని అడిగి, నక్షత్రం చెప్పగానే వెంటనే మా అమ్మాయికి సరిపోదు అండి ఈ నక్షత్రం అని చెప్తున్నారు! కాని అది శుద్ధ తప్పు. రెండు జాతకాల్లో వివాహ పొంతన నిర్ణయించడానికి సుమారు 23 విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అందులో చివరిలో ఉండే విషయము తారావలము. కాబట్టి ఒక్క నక్షత్రంతోనే జాతకాన్ని నిర్ణయించి కుదరలేదని నిర్ణయించకూడదు.

అందుకని ముందు మీ అబ్బాయికి వేరే అమ్మాయికి సరిపోయే నక్షత్రాలు అన్న లిస్టు రాసుకున్న కాగితాన్ని పక్కన పడేయండి. అసలు ఈ లిస్టు అబ్బాయిల తల్లిదండ్రులకి అవసరం లేదు, ఎందుకంటే వివాహ పొంతన విషయములో నక్షత్రాల పొంతన అన్ని అమ్మాయి నుండే చూడాలి అని శాస్త్ర వచనము. అందుచేత వివాహ పొంతన చేసే సమయంలో వధూ వరుల ఇద్దరి వ్యక్తిగత జాతకాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. కానీ కేవలం నక్షత్ర ఆధారంగా వద్దు అని నిర్ణయం తీసుకోకండి.

Advertisement

జాతకంలో కుజదోషమని భయపడి, ప్రక్కవారిని కూడ భయపెట్టకూడదు! ఎందుకంటే కుజదోషమునకు జాతకంలో చాలా పరిహారలు ఉన్నవి! అనేక సందర్భాలలో మిగిలిన గ్రహముల PAC వలన కుజదోషం వర్తించదు లేదా పూర్తిగా రద్దు కావిస్తుంది. ఈ విషయం తెలియకుండా సప్తంలో కుజుడు అష్టమంలో కుజుడు అని చెప్పి, తెలిసీ తెలియని శాస్త్ర పరిజ్ఞానంతో, ముఖ్యంగా మిమ్మల్ని అనేక రకాలుగా భయభ్రాంతులను చేసే యూట్యూబ్ వీడియోలు లేదా టీవీలో హోమాలు, జపాలు చేయిస్తాము అని వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్లతో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు చూసి కంగారుపడి మోసపోకండి. వేలకు మించిన ధనముతో ఎవర్నో నమ్మి ఆన్లైన్లో పరిహారాలు చేయించుకోకండి.

చాలా సందర్భాలలో కుజదోషము రద్దు అవుతుంది అని చెప్పడానికి అనేక శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. దీనిపై పూర్తి అవగాహన కలగడానికి కేవలము పూర్తి శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉన్న నిపుణులను సంప్రదించండి.

Advertisement

ఇంకొక గుర్తు పెట్టుకోవాల్సిన విషయము: వివాహ పొంతనలో అమ్మాయి జాతకమే ముఖ్యం. అమ్మాయి నక్షత్రాన్ని బట్టే తారాబలం చూడాలి! అబ్బాయి నక్షత్రానికి నైధన తార, మరియు కొన్ని నవకములలో మాత్రమే విపత్ మరియు ప్రత్యక్ తార కాకూడదు.

జాతకంలో కూడ పూర్తి 100% కుదిరే జాతకాలు ఏవి ఉండవు! మనకు ప్రధానంగా చెప్పబడిన కొన్ని దోషములు లేకుండా ఉంటూ, కుటుంబ, సంతాన, మాంగల్య, ఆరోగ్య స్థానములు బలంగా ఉంటే, మిగిలిన జాతకం ఎలా ఉన్నా తప్పనిసరిగా ముందుకు వెళ్లొచ్చు.

వివాహ పొంతన ఇప్పుడు కనీసం 50% కుదిరితే చాలు. అదికూడా నక్షత్రం కుదిరిన, కుదరకపోయిన, ఇంపార్టెంట్ కాదు. ముఖ్యంగా సౌభాగ్య స్థానం, సంతాన స్థానం, కుటుంబ స్థానం బలంగా ఉండాలి. అబ్బాయి అభివృద్ధి ఉందా? గృహ యోగం ఉందా? ఇవన్నీ బాగుంటే చాలు.

Advertisement

కాబట్టి తల్లితండ్రులు కొంచెం విజ్ఞతతో వ్యవహరించాలి. వివాహాల విషయంలో తగు నిర్ణయం తీసుకుని పిల్లల వివాహాలు తొందరగా కుదిర్చేలా చూడండి. అలాగే వివాహానంతరం చిన్న సమస్యలు వచ్చినా, అవి పెద్దవి కాకుండా పరిష్కరించే బాధ్యత పెద్దల మీద కూడా ఉంది.

త్వరలోనే మీ అందరికీ శుభం కలగాలని, మీ ఇంటిలో మంగళ తోరణాలు కట్టుకోవాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం!

Dr. రవి సుందర్ వడ్లమాని