కుల వ్యవస్థను ఎవరు సృష్టించారు?

గమనిక: క్రింద ఇవ్వబడిన విషయం రచయిత వ్యక్తిగత అభిప్రాయాల రూపంలో ఉంది.

మీరు ఎప్పుడైనా ఇడ్లీలు దోసలు వేయడం చూసారా?

ఇడ్లీలు వాయిలు వాయిలుగా పొయ్యి మీద నుండి పోగలు కక్కుతూ దించుతారు. అలాగే బాగా కాలుతున్న పెనం మీద నీళ్ళు జల్లి చీపురుతో రాసి ఆయిల్ జల్లి మల్లి చీపురుతో రాసి దోసలు టకా టకా వేస్తుంటారు.

Advertisement

పైన చెప్పిన మాదిరిగా ఒక పది మంది బ్రాహ్మలు కూర్చుని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదారు వేల కులాలు తయారు చేసారు. ఇది ప్రచారంలో ఉన్న ప్రముఖమైన పిట్ట కధ. ఈ కధకి తిరుగులేదు. దీనిని ఎవరు వ్యతిరేకించ కూడదు.

ఈ అయిదారు వేల కులాల మధ్యన ఎక్కడ గొడవ జరిగినా బ్రాహ్మలే కారణ మంటారు. మాల మాదిగలు రిజర్వేషన్ లో వాటాల కోసం వారిలో వారు ముష్టి యుద్ధాలు చేసుకున్నా, కారంచేడులో, చుండూరులో రెండు కులాల మధ్యన ఘర్షణ జరిగినా బ్రాహ్మలే కారణమంటారు. చివరికి మతం మార్చుకున్న మాల మాదిగలకి రిజర్వేషన్ వర్తించదని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే కూడా బ్రాహ్మలే కారణమంటున్నారు.

'చాతుర్వర్ణం మయా సృష్టం' అన్నాడు యాదవ కులస్తుడు శ్రీకృష్ణుడు. అవన్నీ మాకు తెలియవండి. ఆ అన్నది యాదవ కులస్తుడైనా కులాలు బ్రాహ్మలే సృష్టించారండి, మీరెన్ని చెప్పినా వినమండి అంటారు. ఈ విధంగా అన్ని కులాల్లో ఉన్న పండితులు, రచయితలు, సోషల్ ఇంజినీర్లు, సంఘ సంస్కర్తలు, రాజకీయ నాయకులు, సినీ నిర్మాతలు, సినీ కధా రచయితలూ, పారిశ్రామిక వేత్తలు అందరు ముక్త కంఠంతో పలుకుతారు.

పోనీ శ్రీకృష్ణుడు నాలుగు వర్ణాలు అన్నాడు కదా ఆయనేమీ ఆరు వేల కులాలు అనలేదు కదా అని అన్నామనుకోండి. ఇలాటి లాజిక్కులు మా దగ్గర చెప్పకండి అంటారు. ఆరు వేల కులాలు బ్రాహ్మలు తయారు చేయడమేమిటి అని అడగకూడదు. అది అంతే. ప్రచారంలో ఉన్న పిట్టకధ ప్రభావం అలాంటిది.

ఎక్కడ కుల పరంగా గొడవలు జరిగినా ఫైనల్ గా కంక్లూజన్ ఏమంటే బ్రాహ్మలు కుల వ్యవస్థను రద్దు చేయాలని ప్రతీ కులం వారు మీటింగు పెట్టుకుని తీర్మానం చేస్తారు. ఇటుపైన మిగత కులాలతో సఖ్యతగా ఉందామని మాత్రం తీర్మానం చేయరు.

Advertisement

అసలు బ్రాహ్మలకి మాత్రమే కుల వ్యవస్థని రద్దు చేసే అధికారం అర్హత వున్నాయని మిగతా అన్ని కులాలు ఎందుకనుకుంటాయి? మిగతా కులాలకి ఆ అర్హత అధికారం లేవా?

కులాల వారీగా మీటింగులు పెట్టుకుని కుల వ్యవస్థ రద్దు చేయాలని అడగడమేమిటో ఎవరికి అర్ధం కాదు. తక్కువగా పొదుపుగా మాట్లాడ్డం అనే సబ్జక్టు గురించి నాలుగు ముక్కలు చెప్పమంటే, ఒకడు మూడుగంటలు పాటు చేతి లోంచి మైకు లాక్కునే దాకా వదలలేదట. బూతు మాటలు మాట్లాడుతున్నారని కోపం వచ్చి, అలా మాట్లాడకూడదంటు ఒకాయన పచ్చి బూతులు తిట్టాడుట.

ప్రస్తుతం కుల వ్యవస్థ పోవాలని ఉపన్యాసాలిస్తూ పోరాటం చేసే వారందరి పరిస్థితి ఇలాగే వుంది.