పవిత్రమైన భావములకు ప్రశాంతమైన వాతావరణము కొరకు దైవదర్శన నిమిత్తము దేవాలయములకు వెళ్ళాలి. సకలశుభములను కలుగాలని కోరుకొనుచు దేవాలయ సింహద్వారమునకు నమస్కరించి మనలోని ఆధ్యాత్మికశక్తి మహోన్నతంగా ఎదగాలని ధ్వజస్తంభముగల గంటలను గణగణ మ్రోగించాలి. దేవాలయ ప్రాంగణము చుట్టూ దైవనామ స్మరణతో మూడుసార్లు ప్రదక్షిణం చేయాలి. పవిత్ర భావముతో ఫలములు, పుష్పములు దైవమునకు సమర్పించాలి. ఫలములు జ్ఞానోదయ ప్రాప్తికి, పుష్పములు జ్ఞాన పరిమళములను కల్గించుటకు ఉపయోగపడును. ఫలపుష్పములతోపాటు పసుపు, కుంకుమలను కూడా దైవమునకు సమర్పించి, శుభప్రదమైన జీవితాన్ని ప్రసాదించుమని కోరాలి. కొబ్బరికాయను కొట్టి దానిలోగల స్వచ్ఛమైన నీరును దైవమునకు సమర్పించాలి. అది మనసులోగల అహంకారశక్తిని వదలి పవిత్రముగా దైవధ్యానమునకు సూచికగా నిలుస్తుంది. దేహాభిమానమును కర్పూర నీరాజనములతో కాల్చి మనలోగల పాపములను ధూపముగా వేసి ఆత్మానుభూతితో దైవాన్ని స్మరించాలి.

జ్ఞానులకు దేహమే దేవాలయము. దేహము, దేవాలయము కూడా సప్తసంఖ్యతో ప్రారంభము అవుతాయి. శరీరము సప్తధాతువులతో కూడినది. దేవాలయము సప్తప్రాకారములతో విలసితము. దేవుడు ఉండేచోటు దేవాలయము. జీవుడు ఉండేది దేహము.

Advertisement

"నిర్వేరస్సర్వభూతేషు యస్స మామేతి పాండవ" అని గీతలో చెప్పినట్లుగా ఈ సృష్టిలో అన్ని జీవములయందు ప్రేమను, కరుణను చూపేవారు దైవసమానులు. శుభకార్యములు జయప్రదముగా జరుగుటకు దేవాలయములోనికి వెళ్ళి దైవదర్శనము చేసుకొని ప్రారంభించుట ఆచారమైనది . కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములను తొలగించుకొనుటకు ఏకాగ్రత, చిత్తశుద్ధిని పొందుటకు దేవాలయసందర్శనము ముఖ్యమైనది. ఇహపరసాధనకు దేవాలయ సందర్శనము అత్యంత ఉపయోగకరము. నిత్యకృత్యములలో ఉదయమే దైవ దర్శనము చేసుకొని తమ యాంత్రికజీవనమును సాగిస్తారు. ఇది అనుభవజ్ఞలసాధనఫలమని తెలుసుకోవాలి. "అనన్యాశ్చింతయన్తో మాం యే జనాః పర్యుపాసతే" అన్నట్లుగా దైవసాన్నిధ్యము కోసము దేవాలయ సందర్శనము అతి ముఖ్యమైన దినచర్యగా భావించాలి . 'దేవుని సందర్శనమువల్ల ఆత్మజ్ఞానము పెరుగుతుంది' అను సంకల్పముతో దేవాలయమునకు వెళ్ళుట మంచిలక్షణము.