విష్ణు పార్షదలు, యమ దూతల వివాదము

విష్ణు దూతలు: 'ఓ యమ దూతలారా! మేము విష్ణు దూతలము. వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువైన యమ ధర్మరాజు ఏటు వంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను?' అని ప్రశ్నించిరి.

Advertisement

యమ దూతల జవాబు: 'విష్ణు దూతలారా! మానవుడు చేయు పాపపుణ్యాంశాలను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనంజయాది వాయువులు, రాత్రి-ఇంబవల్లు, సంధ్యకాలము—ఇవి సాక్షులుగా ఉండి ప్రతి దినము మా ప్రభువు యమధర్మరాజు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తుని చేత చూపించి, ఆ మనిషిని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులు ఏటు వంటి వారో—వినుడు:

  • వేదోక్త సదాచారములు విడిచి, వేదశాస్త్రములు నిందించు వారు;
  • గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు;
  • పరస్త్రీలను కామించిన వారు;
  • పరాన్నభుక్కులు;
  • తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించు వారు;
  • జీవహింస చేయు వారు;
  • దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారు;
  • జారత్వము, చొరత్వముచేయు భ్రష్టులైన వారు;
  • ఇతరుల ఆస్తిని స్వాహా చేయు వారు;
  • చేసిన మేలు మరచిన కృతఘ్నులు;
  • పెండ్లు, శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగలే వారు—ఇట్లు పాపాత్ములు!

వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి, నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి యాజ్ఞ. అది అట్లుండగా, ఈ అజామీళుడు బ్రాహ్మణుడై పుట్టి, దురాచారములకు లోనై, కులభ్రష్టుడై, జీవహింసలు చేసి, కామాంధుడై వావివరసలు లేక, సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు?' అని యడగగా...

Advertisement


విష్ణు దూతల సమాధానము: 'ఓ యమకింకరులారా! మీరు ఎంత అవివేకులు? మీకు ధర్మసూక్ష్మములు తెలియవు. ధర్మసూక్ష్మములు ఏట్లో చెప్పెదము—వినుడు:

  • సజ్జనులతో సహవాసము చేయువారు;
  • జపదానధర్మములు చేయువారు;
  • అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామదానము చేయువారు;
  • అనాధప్రేతసంస్కారములు చేయువారు;
  • తులసివనము పెంచువారు;
  • తడాకములు త్రవ్వించువారు;
  • శివకేశవులను పూజించు వారు;
  • సదా హరినామస్మరణ చేయువారు;
  • మరణకాలమందు "నారాయణా" అని శ్రీహరిని గాని, "శివ" అని శివుని గాని స్మరించు వారు;
  • తెలిసిగాని తెలియకగాని మరే రూపమున గాని హరినామస్మరణ చేసినవారు—ఇట్లు పుణ్యాత్ములు!

కాబట్టి అజామీళుడు ఎంత పాపాత్ముడైనాను, మరణకాలమున "నారాయణా" అని పలికిరి.'

Advertisement


అజామీళుడు విష్ణు దూతల సంభాషణ ఆలకించి ఆశ్చర్యమొంది: 'ఓ విష్ణు దూతలారా! పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజగాని, వ్రతములు గాని, ధర్మములు గాని చేసి యెరుగను. నవ మాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణమిసలేదు. వర్ణాశ్రమధర్మములు విడిచి కులభ్రష్టుడనై, నీచకులకాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమతో "నారాయణా" అని నంత మాత్రమున నన్ను ఘోరనరకభాదలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా! నేను ఎంత అదృష్టవంతుడు! నా పూర్వజన్మసుకృతము, నా తల్లితండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది' అని పలుకుచు, సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు కెగెను.

కావున ఓ జనక చక్రవర్తీ! తెలిసిగాని, తెలియకగాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలేక్కి భాదకలిగించేనో, అట్లే శ్రీహరి స్మరించిన యెడల సకలపాపములు నశించి మోక్షము ప్రాప్తిస్తారు. ఇది ముమ్మాటికీ నిజము.


ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తికమహాత్మ్యమందలి నవమ అధ్యాయము—తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము