మాఘ పురాణం: శూద్రదంపతుల కథ & మాఘమాస స్నాన మహిమ

మాఘ పురాణం
శూద్రదంపతుల కథ
వశిష్ఠమహర్షి దిలీపునితో, “మహారాజా మరియొక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడుండెడి వాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై, మిక్కిలి యిష్టము కలవాడు, వ్యవసాయము చేయును. పశువులవ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యపారమును గూడ చేయును. ఎంత సంపాదించుచున్నను, యింకను సంపాదించ లేకపోవు చున్నానని, విచారించెడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు, వాని యింటికి వచ్చెను. “అమ్మా నేను బాటసారిని, అలసినవాడను, చలి, చీకటి, మిక్కుటములుగ నున్నవి. ఈ రాత్రికి నీ యింట పండుకొను అవకాశమిమ్ము. ఉదయముననే వెళ్లిపోదునని” యింట నున్న కుముదను అడిగెను. ఆమెయు, వానిస్థితికి జాలిపడి యంగీకరించెను. ఆమె యదృష్టమో, ఆ బ్రాహ్మణుని యదృష్టమో, యజమానియగు సుమనందుడు! వడ్డీని తీసికొనుటకై గ్రామాంతరము పోయియుండెను. కుముద! ఆ బ్రాహ్మణునకు, గొడ్లసావిడిలో, ఒక చోట బాగుచేసి, కంబళిమున్నగు వానినిచ్చి, పాలను కూడ కాచియిచ్చెను. ఆ బ్రాహ్మణుడు, ఉదయముననే లేచి, హరి నామస్మరణ చేయుచు, శ్రీహరి కీర్తనలపాడుచుండెను.
కుముద “ఓయీ నీవెచటినుండి వచ్చుచున్నావు? యెచటికి పోవుచున్నావని, యడిగెను. అప్పుడా విప్రుడు, “తుంగభద్రాతీరము నుండి శ్రీ రంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున, నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును, అందులకై యిట్లు వచ్చితిని” సమాధానమునిచ్చెను. ఆమె అడుగగా, మాఘమాస స్నాన మహిమను చెప్పెను, కుముదయు మాఘస్నానము చేయుటకైన, నదికి పోవలయునని యనుకొనెను. తానును వానితో నదికి పోయి, స్నానము చేసిరావలెననుకొనెను. తన యభిప్రాయమును చెప్పగ, బ్రాహ్మణుడును సంతోషముతో నంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీస్నానమునకు పోవుచుంటినని, భర్తకు చెప్పెను. సుమందుడు “నదీస్నానము వలదు అనారోగ్యము కలుగును. పూజకు, అనారోగ్యమునకు, ధనవ్యయమగును. వలదు”. అని యడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండ, బ్రాహ్మణునితో, నదీ స్నానమునకు పోయెను. సుమందుడు, భార్యను వెంబడించి, నదికి పోయి, నదిలోస్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి, నదిలో పడి, శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా, నా దంపతులకు, మాఘమాస నదీ స్నానమైనది. పుణ్యము కూడ కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచు కొట్టుచు యింటికి తీసికొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడును, స్నానము చేసి, దేవతార్చన చేసికొని, తన దారిన పోయెను. కొంతకాలమునకు, సుమందుడు, వాని భార్యయు మరణించిరి. యమభటులు, వారిని6 యమలోకమునకు గొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతలు, విమానముపై వచ్చి, కుముదను విమానమెక్కించి, ఆమె భర్తను, యమభటులకు విడిచిరి.
అప్పుడామె,” విష్ణుదూతలారా! నామాటలను వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా, యమ లోకమునకు తీసికొనిపోబడుచున్నాడు. అతని భార్యనగు నేనును, వానికి భయపడి, ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన, నేనును నా భర్తతో బాటు, యమలోకమునకు పోవలసియున్నది మరి నన్ను, విష్ణులోకమునకు, ఏల గొనిపోవుచున్నారని” యడిగెను. అప్పుడు విష్ణుదూతలు, “అమ్మా నీవు దుష్టుని భార్యవై, వాని సహధర్మచారిణిగ, నరకమునకు పోవలసియున్నను, నీ భర్త దుష్కార్యములతో, నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడుపనులు, నీ కిష్టము కాకున్నను, భయమువలన గాని, పతిభక్తి వలన గాని, నీ భర్తకు యెదురు చెప్పలేదు. కాని మనసులో, వాని పనులకు, నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివికావు. ఇంతే గాక, మాఘమాస స్నానమును కూడ, మనః పూర్వకముగ భక్తితో చేసితివి. కావున నీవు, పుణ్యము నందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త, తన దుష్కర్మలకు తగినట్లుగా, యమలోకమునకు పోవునని పలికిరి.అప్పుడామే, నన్ను లాగుచు, “నా భర్తయు నీటిలో మునిగెను కదా! మా పెనుగులాటలో, మూడుసార్లు, ఆయనయు నీటమునిగి లేచెను కదా! బలవంతముగ చేసినను, యిష్టము లేక చేసినను, మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా! ఆవిధముగా జూచినచో, నాపై కోపమున, నన్ను పట్టుకొని, నీటిలో ముమ్మారు మునిగిలేచిన నా భర్తకు, మాఘస్నాన పుణ్యము రావలెను. ఆయనయు, నాతోబాటు, విష్ణులోకమునకు, రావలెను కదా యని, విష్ణుదూతలు, ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో, యమలోకమునకు పోయి, ప్రాణుల పుణ్యపాపముల పద్దును, వ్రాయు, చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమునడిగిరి.
అప్పుడు చిత్రగుప్తుడును, సుమందుని, పుణ్యపాపముల పట్టికను జూచెను. సుమందుడుని, పట్టికలో నన్నియును పాపములే కాని, మాఘమాసమున, నదిలో స్నానము చేయుచున్న భార్యను, కోపముతో కొట్టబోయిన, నదీజలమున పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని, తీరమునకు తీసికొని రావలయునను ప్రయత్నమున, నీటిలో పలుమార్లు మునిగి తేలుటవలన, నితడు యిష్టములేకున్నను. బలవంతముగ మాఘమాసమున, నదిలో పలుమార్లు మునుగుటచే, వీని పాపములు పోయి ,,విష్ణు లోక ప్రాప్తిని పొందవలసియున్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి.
కుముదను, ఆమె భర్తను, విష్ణులోకమును గొనిపోయిరి.” రాజా! బలవంతముగ, నొక్కమారు చేసిన, మాఘమాస స్నానమునకు ఫలముగ, పూర్వము చేసిన పాపములుపోయి, విష్ణులోకమును పొందుదురు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
