మన మార్గాలలో ఉండి రక్షించే దేవుడు పరమేశ్వరుడు.
ప్రతివారూ ప్రతిరోజూ ఉదయం లేస్తూనే శివస్మరణ చేసుకుంటే —
వారి ఆలోచన అనే దారి, నడవడిక అనే దారి సరియైన గమ్యానికి చేర్చుతుంది.
ఆధ్యాత్మిక రంగం కావొచ్చు, భౌతిక జీవితం కావొచ్చు — బ్రతకడమే ప్రయాణం, నడతే ధర్మం.

జీవనయానంలో ప్రతి అడుగులోను పరమేశ్వరుడు తోడుగా ఉంటే ఇంకేమి కావాలి!
ఇలా చూస్తే, మార్గరక్షకుడైన పరమాత్మకు సంబంధించిన ఒక విశిష్ట క్షేత్రం మనకు ఉంది —
అది మార్గబంధు క్షేత్రం, చిత్తూరుకు సమీపంలో, ప్రస్తుతం తమిళనాడులో ఉన్న విరించిపురం.
అది అత్యంత ప్రసిద్ధ క్షేత్రం.
అక్కడ అమ్మవారు కూడా అద్భుత కళలతో దర్శనమిస్తారు.
పరమేశ్వరుని పేరు అక్కడ మార్గసహాయేశ్వరుడు.

Advertisement

దీనికి సంబంధించిన స్థలపురాణం ప్రసిద్ధి గాంచింది.
అక్కడి శిలాఫలకం మీద కొన్ని సంస్కృత శ్లోకాలు వ్రాయబడి ఉన్నాయి — వేల సంవత్సరాల నాటి శిలాశాసనం అది.
ఆ శ్లోకాలు నేటికీ ఉపయోగపడే విధంగా అక్కడి బోర్డుపై కూడా లిఖించబడ్డాయి.

మన తెలుగువారికి వీటి పరిచయం తక్కువ,
కానీ తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో ఈ శ్లోకాలు ఎంతో ప్రసిద్ధి.
కొంతమంది ఆ శ్లోకాలు ప్రతిరోజూ చదువుకుంటారు;
చదవలేకపోతే కనీసం వాటి ప్రింట్ కాపీని కారులో ఉంచుతారు —
కారులో ఆ శ్లోకం ఉన్నప్పటికీ ప్రయాణాలు సురక్షితంగా ఉంటాయని వారి గాఢ విశ్వాసం.

Advertisement

అనేక పెద్ద వ్యాపారవేత్తలు ఈ విశ్వాసంతో నడుస్తున్నారు.
ఇది మార్గసహాయేశ్వరుడి మహిమ.
మార్గబంధు స్తోత్రం రచించిన వారు మహానుభావుడు అప్పయ్య దీక్షితులు.

శివుడు ఎప్పుడూ మార్గబంధువే
ప్రతీ భౌతిక ప్రయాణంలోనూ, ఆలోచనల్లోనూ, జీవిత నడతలోనూ ఆయనే మార్గదర్శి.
అందుకే ప్రతి క్షణం శివస్మరణ ద్వారా
“మన బ్రతుకుతెరువులో భగవంతుడు నాతోనే ఉన్నాడు” అనే భావాన్ని మనం పొందగలగాలి.

━━━━━━━━━━━━━━━━━━━

Advertisement

🕉️ మార్గబంధు స్తోత్రం

━━━━━━━━━━━━━━━━━━━

శంభో మహాదేవ దేవ | శివ శంభో మహాదేవ దేవేశ శంభో ||
శంభో మహాదేవ దేవ | శివ శంభో మహాదేవ దేవేశ శంభో ||
శంభో మహాదేవ దేవ ||


ఫాలావనమ్రత్కిరీటమ్ | ఫాలనేత్రార్చిషాదగ్ధ పంచేశు కీటం ||
శూలాహతారాతి కూటం | శుద్ధ మర్థేన్దుచూడం భజే మార్గబంధుం || 1 || శంభో ||

Advertisement

అన్గే విరాజద్భుజంగం | అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం ||
ఓంకారవాటీ కురంగం | సిద్ధ సంసేవితాన్ఘ్రిం భజే మార్గబంధుం || 2 || శంభో ||


నిత్యం చిదానంద రూపం | నిహ్నుతాశేష లోకేశవైరి ప్రతాపం ||
కార్తస్వరాగేంద్రచాపం | కృత్తి వాసం భజే దివ్య సన్మార్గబంధుం || 3 || శంభో ||


కందర్పదర్పఘ్నమీశం - కాలకంఠం మహేశం మహావ్యోమకేశం |
కుందాభదంతం సురేశం - కోటి సూర్య ప్రకాశం భజే మార్గబంధుం || 4 || శంభో ||


మందారభూతేరుదారం - మందరాగేంద్రసారం మహాగౌర్యదూరం |
సిందూరదూరప్రచారం - సింధురాజాతిధీరం భజే మార్గబంధుం || 5 || శంభో ||


అప్పయ్యయజ్వేంద్రగీతం | స్తోత్రరాజం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే ||
తస్యార్థ సిద్ధిం విధత్తే | మార్గమధ్యే భయంచాశుతోశో మహేశః || 6 || శంభో ||


శంభో శంకర శివ!