తీర్థం యొక్క అర్థం, పరమార్థం — శ్రీమన్నారాయణ
తీర్థం అంటే ఏమిటి? ఉదకం, తులసి, శంఖం, సాలగ్రామం మొదలైన తొమ్మిదింటి కలయిక; తీర్థాన్ని శంఖాకారంలో స్వీకరించే విధానం, బొటనవేలు-చూపుడువేలు వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం.

తీర్థం అంటే ఏమిటి? ఉదకం, తులసి, శంఖం, సాలగ్రామం మొదలైన తొమ్మిదింటి కలయిక; తీర్థాన్ని శంఖాకారంలో స్వీకరించే విధానం, బొటనవేలు-చూపుడువేలు వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం.
శ్రీ మన్నారాయణ. తీర్థం యొక్క అర్థం, దాని పరమార్థం తెలుసుకుందాం.
ఉదకం, చందనం, చక్రం, శంఖం, తులసీదళం, ఘంట, పురుషసూక్తం, తామ్రపాత్ర, సాలగ్రామం — ఈ తొమ్మిదింటి కలయిక వల్ల ఏర్పడే ఉదకాన్నే తీర్థం అంటారు.
తులసితో కూడిన భగవంతుడిని అభిషేకించిన లేదా నైవేద్యం పెట్టిన తీర్థాన్ని గ్రహించే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడని, పరమేశ్వర సాయుజ్యాన్ని పొందుతాడని, తులసితో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రకాల రోగాలను పోగొడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంధాలు చెప్తున్నాయి. సాధారణంగా గుళ్ళలోని దేవతా విగ్రహాలని కడిగిన లేదా అభిషేకించిన జలాన్ని, పాలను దేవాలయాలకి వచ్చిన భక్తులకి తీర్థంగా ఇస్తారు. కొన్ని గుళ్ళల్లో తులసి, పచ్చకర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన తీర్థాన్ని దేవుడికి నివేదన చేసి భక్తులకు ఇస్తారు.
భగవంతునికి నివేదించిన ఆ తీర్థాన్ని ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపత్రయాన్ని ఉపశమించే విధంగా — "అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ విష్ణుపాదోదకం (లేదా శివపాదోదకం) పావనం శుభం" అంటూ — భక్తుల చేతిలో మూడు సార్లు పోస్తారు. అలాంటి పవిత్రమైన తీర్థాన్ని కింద పడకుండా పవిత్రమైన భావనతో సేవించాలి.
తీర్థాన్ని ఎలా స్వీకరించాలి?
ఎడమ అరచేతి కింద అంగవస్త్రాన్ని నాలుగు మడతలుగా పెట్టుకొని, దానిపై కుడిచేతిని శంఖువు ఆకారంలో పెట్టుకుని, నేల మీద ఒక చుక్క కూడా పడకుండా తీర్థాన్ని స్వీకరించాలి. పూజారులు కూడా తీర్థాన్ని నిర్లక్ష్యంగా అందించకూడదు — అది భక్తితో సేవించే పవిత్రమైన ఉదకం అని భక్తులతో పాటు అర్చకులూ తెలుసుకోవాలి.
వేళ్ళ వెనుక ఉన్న అర్థం
తీర్థం సేవించే సమయంలో అరచేయి మధ్య గుంట వచ్చేలా బొటన వేలు పైన చూపుడు వేలుని ఉంచుతాం — అది శంఖం ఆకారంలో కన్పిస్తుంది. శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదన్నట్టు, అప్పుడు అది శంఖంలో తీర్థం పోసినట్టే అవుతుంది.
హస్తసాముద్రికం ప్రకారం బొటన వేలు ఐహికమైన సుఖ భోగాలకి, మమకార వికారాలకి కారణమైన శుక్రుడిది; చూపుడు వేలు భగవత్సమానుడు, జ్ఞానప్రదాత అయిన గురువుది. పవిత్రమైన, పాపహారణమైన ఆ తీర్థాన్ని తాకి ఐహికమైన వాంఛలని పోగొట్టుకోవాలంటే — అవి దైవసమానమైన గురువు అనుగ్రహం ఉంటేనే పోతాయనే భావంతో — గురువైన చూపుడు వేలుతో శుక్రుడైన బొటన వేలుని మడిచి నొక్కి పెడతారు. తీర్థం ఇవ్వడం, పుచ్చుకోవడం వెనుక ఇంత అర్థం ఉంది.
జై శ్రీమన్నారాయణ.
(ఇది ఒక సంప్రదాయ ఆధ్యాత్మిక వివరణ.)


