పోలి స్వర్గం నవంబర్ 21, శుక్రవారం నాడు చేసుకోవాలి. మన సంప్రదాయంలో తిధి ప్రధానము, వారము కాదు.

కార్తీక మాసం ముగిసిన తరువాత (కార్తీక అమావాస్య అనంతరం), వచ్చే మార్గశిర శుక్ల పాడ్యమి రోజున తెల్లవారుఝాము నిద్రలేచి, పుణ్యస్త్రీలు మరియు కన్యకామణులు నది, కాలువ, చెరువు లేదా బావుల వద్దకు వెళ్లి అరటి తొట్టెల్లో దీపాలను వదులుతారు. నీటిలో అలలపై నెమ్మదిగా కదులుతూ వెలుగులు పంచే ఈ దీపకాంతులు స్త్రీల జీవితంలో చీకట్లను పోద్రోలడమే కాక, అంత్యంలో స్వర్గానికి తీసుకెళ్లే వెలుగుకిరణాలుగా మారుతాయని విశ్వాసం.

Advertisement

నీటి కెరటాలతో ఆడుకునే ఈ దివ్వెలను చూసే దృశ్యం అద్భుతం. ఆ రోజు ఆకాశంలోని నక్షత్రాలే వెలవెల బోయేంత అందం. ఈ సోయగాన్ని దర్శించేందుకు దేవతలూ భూమికి దిగివస్తారనే అపూర్వ విశ్వాసం ప్రజల్లో ఉంది. ఈ వెలుగుల పర్వాన్నే ‘పోలిని స్వర్గానికి పంపడం’ అంటారు.

స్త్రీలు అత్యంత భక్తితో ఆచరించే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి. ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పవిత్రాచారం ఈ తరం మహిళలను కూడా అలరించుతోన్నది. దీనికి సంబంధించిన కథ ఆసక్తికరంగా, ఆచరించాలనిపించేలా ఉంటుంది.

Advertisement

పోలమ్మ కథ

ఓ గ్రామంలో ఒక రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవారు. అందులో చిన్న కోడలు పోలమ్మ. చిన్నప్పటి నుంచే తీవ్ర దైవభక్తి కలిగిన ఆమె పూలు కోయడం, పూజలు చేయడమే తన జీవితంగా భావించేది. పెళ్లయ్యాక మాత్రం ఆమెకు ఆలయ దర్శనానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కారణం—ఆమె అత్త.

సాధారణంగా కోడలికి భక్తి ఎక్కువగా ఉంటే ఇంట్లోవారు ఆనందిస్తారు. కానీ పోలమ్మ అత్త మాత్రం తన భక్తి గొప్పదని భావించే అహంకారంతో పోలిని ఆలయానికి తీసుకెళ్లకుండా మిగతా కోడళ్లతోనే వెళ్లేది.

Advertisement

ఒక కార్తీక అమావాస్య రోజు అత్త పోలికి ఇంటి పనులు పురమాయించి, పూజాగ్రహణాలే లేకుండా చేసి మిగతా కోడళ్లతో నదీ స్నానానికి వెళ్లింది. కానీ పోలమ్మ నిరాశపడలేదు. బావి దగ్గర స్నానం చేసి, పత్తిచెట్టులోనుంచి పత్తి తీసి వత్తులు తయారు చేసుకుంది. చల్లకవ్వంలోని వెన్నతో దీపం వెలిగించి దేవుణ్ణి ఆరాధించింది.

ఆమె భక్తికి మెచ్చిన దేవతలు పోలమ్మ కోసం పుష్పక విమానాన్ని పంపారు. గ్రామస్తులు చూస్తుండగానే పోలమ్మ విమానం ఎక్కింది. విమానం పైకెగ్రమెత్తుతుండగా వచ్చిన అత్త, తాను కాకుండా కోడలు స్వర్గానికి వెళ్తోంది అని అసహనంతో పోలమ్మ కాళ్లను పట్టుకుంది. వెంటనే మిగతా కోడళ్లు ఒకరి కాళ్లు ఒకరు పట్టుకొని వేలాడసాగారు.

దేవతలు వారిని చూసి, పోలమ్మ వంటి భక్తి వారికి లేదని భావించి వారందరినీ కింద వేయగా, పోలమ్మ మాత్రం బొందితో స్వర్గానికి చేరింది.


పోలి స్వర్గం ఆచారం

Advertisement

ఆపాటి నుంచి ఆశ్వయుజ అమావాస్య నుండి కార్తీక అమావాస్య వరకు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీస్నానం చేసి దీపం వెలిగించడం ఆచారంగా కొనసాగింది.
మార్గశిర శుక్ల పాడ్యమి రోజున స్త్రీలు 33 వత్తులతో దీపారాధన చేస్తారు —
31 వత్తులు కార్తీక మాసంలోని రోజులకు,
మిగతా 2 వత్తులు పోలి స్వర్గం రోజుకి.

గంగాదేవి ప్రవాహంలో వదిలే అవకాశం లేకపోతే ఇంట్లో నీటి తొట్టిలో దీపాలు వదులుతారు.
పోలమ్మ గౌరవార్థం దేవుడి ముందు 33 వత్తులను ఉసిరికాయల మీద వెలిగించి తమలపాకులపై ఉంచడం ఆనవాయితీ.
కొన్ని ప్రాంతాల్లో ఈ దీపాలను అరటి దొప్పలలో పెట్టి నదీ ప్రవాహంలో వదిలే ఆచారం ఉంది.
ఓ బ్రాహ్మణుడికి దీపదానం చేయడం, పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఇప్పటికీ కొనసాగుతోంది.


ఓం శ్రీ తులసీధాత్రీ సమేత కార్తీక దామోదర స్వామియే నమః