ధన మూల మిదం జగత్’ అన్న సత్యాన్ని రామాయణం బోధించింది. కానీ ధనమే మనిషికి సర్వస్వం కాదు. కాకూడదు. ధనం కలిగి ఉండడం ఎంత అవసరమో, సమాజంలో బ్రతకాలంటే బాంధవ్యాలు , విలువలు పాటించడం కూడా అంతే అవసరం. ధనం ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. ఒక్కోసారి ప్రాణాలు నిలబెట్టే ఆ ధనమే మరోసారి ప్రాణాలు తీస్తుంది. ధనం లేనిదే గడప దాటలేం . ఒకవేళ దాటినా ఏ పనీ చేయించుకోలేము. ధనం లేని వారికి అంత గౌరవం కూడా ఇవ్వదు సమాజం. అలా అని ధనమేమీ ఆయువు పెంచే ఇంధనం కాదు. అదొక సాధనం మాత్రమే. ఎంత ధనం వున్నా ఆరోగ్యం సరిగా లేకపోతే సుఖ జీవనం గడపలేరని గుర్తించాలి.
ధనం కావాలనుకోవడం తప్పు కాదు. కానీ ధనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదని జెన్ బౌద్ధ బోధనలు బోధిస్తాయి. గౌరవం, మర్యాద, సంస్కారం వంటివి ఉన్నత వ్యక్తిత్వంతోనే పొందగలము. కీర్తి, ప్రతిష్టలు వంటివి సమాజ హిత కార్యక్రమాలు చేస్తూనే పొందగలం తప్ప ధనంతో కొనలేము. ధనం విషయంలో మానవులెలా ప్రవర్తించాలో తెలిపే కథ మహాకవి కాళిదాసు విరచిత రఘువంశంలో ఉంది. ఆ కథను ఆకళింపు చేసుకుంటే ధనం విషయంలో ఎలా ప్రవర్తించాలో బోధపడుతుంది.

వరతంతుడనే ముని గురుకులంలో కౌత్సుడు ఒక శిష్యుడు . అతడి విద్య పూర్తి అయింది. గురువుగారికి గురుదక్షిణగా ఏమి కావాలో చెప్పమన్నాడు కౌత్సుడు. అతడి ఆర్ధిక స్థితిగతులు తెలిసిన గురువు ఏమీ ఇవ్వక్కరలేదని చెప్పాడు. అలా దయ చూపవద్దని గురుదక్షిణగా ఏమివ్వాలో చెప్పాల్సిందేనని కౌత్సుడు పట్టుబట్టాడు. శిష్యుడి కోరిక మన్నిస్తూ గురువు “ పద్నాలుగు విద్యలు నేర్పినందుకు, ఒక్కోవిద్యకు ఒక మనిషి ఏనుగు మీద నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తుకు వెళుతుందో, అంత ధనరాశులు పద్నాలుగు” ఇమ్మన్నాడు .

Advertisement

గురుదక్షిణ ఇవ్వాలన్న సంకల్పమే తప్ప అంత ధనాన్ని ఎలా సమకూర్చాలో తెలియలేదు కౌత్సుడుకి. అందరికీ తండ్రి వంటి వాడు రాజు కాబట్టి రఘు మహారాజుని కలిసాడు కౌత్సుడు. తనకి వచ్చిన సమస్యను విన్నవించుకున్నాడు. తగిన సహాయ మర్ధించాడు. అప్పటికే విశ్వజిత్ యజ్ఞం చేసి తనకున్న సర్వస్వాన్ని దానం చేసాడు రఘుమహారాజు. అందువల్ల ఆయన కోశాగారం పూర్తిగా ఖాళీ అయింది. అలాంటి సమయంలో కౌత్సుడు రఘుమహారాజుని సహాయం కోరాడు. కౌత్సుడి కోరిక విన్న రఘుమహారాజు తప్పక సహాయం చేస్తానని, మరునాడు రమ్మని మాట ఇచ్చి పంపేసాడు. తన కోశాగారంలో ధనం నిండుకున్నందున తరుణోపాయం చెప్పమని గురువు వశిష్ఠుని సంప్రదించాడు రఘువు.

‘మహారాజా! మనం సంపాదించి కౌత్సుడికి ఇవ్వడానికి సరిపడినంత వ్యవధి లేదు. కాబట్టి అత్యవసర నిధుల కోసం ఇంద్రునిపై దండెత్తడమే మార్గం’ అని సలహా చెప్పాడు వశిష్ఠుడు. వశిష్టుల వారి సూచన పాటిస్తూ అమరావతి మీదకు దండయాత్ర కోసం విజయభేరీలు మ్రోగించి, సేనలు సిద్ధం చేసాడు రఘువు. రఘు మహారాజు యొక్క సేనలు మ్రోగించిన భీకర భేరీ నాదాలు ఇంద్రుని చెవులకు తాకాయి.
ఇంద్రలోకంలో అత్యవసర సమావేశం జరిగింది. ‘రఘుమహారాజు చాలా ధర్మాత్ముడు. ఆయనతో యుద్ధం అవసరం లేదు. వెంటనే ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపండి’ అని తన అనుచరులకు ఆదేశించాడు ఇంద్రుడు.

Advertisement

ఇంద్రుని ఆదేశం ప్రకారం రఘుమహారాజు కోశాగారాలన్నీ ధనరాశులతో నిండాయి. యుద్ధ ఆలోచన విరమించాడు రఘువు. కౌత్సుడికి కబురు పంపించి ఆ ధనాన్ని తీసుకొమ్మన్నాడు రాజు. మొత్తం ధనరాశులను తీసుకోడానికి నిరాకరించాడు కౌత్సుడు. “నేను గురువు గారికి ఇవ్వాల్సిన గురుదక్షిణకు సరిపోయేంత మాత్రమే తీసుకుంటాను. అంతకు మించి ఒక్క వరహా కూడా వద్దని” స్పష్టంగా చెప్పాడు.

కౌత్సుడికి అవసరమైనంత ధనాన్నిఇచ్చిన తరువాత కూడా కోశాగారంలో చాలా ధనం మిగిలింది. దానిని తిరిగి దేవేంద్రుడికే పంపాడు రఘువు. అంతేతప్ప ఆ ధనాన్ని భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేయలేదు. అవసరం లేకుండా అధిక ధనాన్ని నిల్వ చేయకూడదని, అవసరం లేని ధనాన్ని త్యజించాలని లోకానికి చాటాడు రఘువు.

రఘు మహారాజు పాటించిన ఆదర్శప్రాయమైన ఆ మార్గమే సరియైనదిగా భావించాలి జనులు. ధన వ్యామోహమే అన్ని దౌష్ట్యాలకు మూలమని, ధనమే దైవమనుకున్న వారిని ఆ ధనమే దయ్యమై పీడిస్తుందని గ్రహించి, అత్యాశ వదులుకోవాలి . ధనాన్ని దోచుకున్నవాడే కాదు, తనకున్న ధనాన్ని ఎటువంటి సత్కార్యాలకు వినియోగించక దాచుకునేవాడు కూడా దొంగేనన్న’ సత్యం గ్రహించి ఉన్నత లక్ష్యాల కోసం పాటు పడాలి. సమాజానికి ఉపయోగపడే శక్తిగా ఎదిగి ఆ నీడలో పదిమందికి ఉపాధి దారి చూపించే దారి దీపమై వెలగాలి.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷namaste 🙏