ఒక పెద్దమనిషి పరమాచార్య స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి తన గురించి చెప్పుకుని తను ఎక్కడనుండి వచ్చాడొ చెప్పాడు.

”మీ ఊళ్ళో ‘టుక్కిరి పాట్టి’ అని ముసలావిడ ఉంది, నీకు తెలుసా” అని అడిగారు మహాస్వామివారు.

Advertisement

”ఆమె మాకు సంబంధీకురాలు” అని చెప్పాడు.

”రామ వినాయకుడు . . . ఇంకా ఉన్నాడా?”

Advertisement

“మా ఊరిలో ఉన్న దేవాలయలోని వినాయకుడు ‘రామ వినాయకుడు’ అని ప్రసిద్ధి” అని బదులిచ్చాడు. ఆ ముసలావిడ, వినాయకుని గురించి పరమాచార్య స్వామివారు చాలా విషయాలు అడిగారు. కాని ఆ భక్తుడు వాటికి సరైన జవాబులు చెప్పలేకపోయాడు. స్వామివారి ప్రశ్నలకు అతను కకావికలమైపోయాడు.

తరువాత మహాస్వామివారే ఆ కథనంతా ఇలా చెప్పారు.

”ఆ ఊళ్ళో శివాలయం కాని విష్ణ్వాలయం కాని లేవు. ఉన్నది ఒక్కటే ఆలయం అది వినాయకుని ఆలయం. రోజూ ఉదయం, సాయింత్రం ఆ ఊరి బ్రాహ్మణులు పొలిమేరులో ఉన్న వాగులో స్నానాదికాలు చేసుకుని సంధ్యావందనం చేసేవారు. తిరిగివస్తూ దార్లో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళి అక్కడ కూర్చుని రామనామాన్ని జపం చెసేవారు. ఊళ్ళోనివారు కూడా వారితో కలిసి రామ సంకీర్తనం చేసేవారు. వారి నామజపం ఎతటిది అంటే ఒక మైలుదూరం నుండి కూడా వారి నామసంకీర్తనం వినపడేది అని నాతో చెప్పారు. వినాయకుని దేవాలయంలో రామనామం చేసేవారు కాబట్టి అది రామనామ వినాయక దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది.

Advertisement

టుక్కిరి పాట్టి ఎవరంటే, ఏడేళ్ళ చిరుప్రాయంలో ఒక ఆడపిల్లకు వివాహం చేశారు. కాని విధివశాత్తు తొమ్మిదేళ్ళకే భర్త చనిపోవడంతో విధవరాలు అయ్యింది. ఆ ఊరివాళ్ళు ఆ అమ్మాయిని దురదృష్టవంతురాలుగా పరిగణించేవారు. దాంతో అమ్మాయిని ‘టుక్కిరి (నష్టజాతకురాలు)’ అని తన దురదృష్టాన్ని ఎత్తిచూపుతూ పిలిచేవారు.

ఆ అమ్మాయి పెద్దదైన తరువాత తన స్థితిని అర్థం చేసుకుంది. ఇప్పటిలాగా అప్పట్లో విప్లవాలు చేసి సంఘ సంస్కరణలు చేసే కాలం కాదు. ఊరి వాళ్ళని కాదని ఏమిచేసే పరిస్థితి కూడా కాదు. కాబట్టి పూర్వసువాసినులకు విధించిన పాతపద్ధతుల ప్రకారం ఆ అమ్మాయి జీవనం సాగించేది. రోజూ తెల్లవారుఝామున నాలుగు గంటలకే లేచి బయటకు వచ్చి ఇంటిముందు అలికి శుభ్రం చేసి, బయట ఒక దీపం వెలిగించి ఇంటిలోపలికి వెళ్ళిపొయేది. మరి ఆమె లోపల ఏం చేసేది? ఏమిలేదు కేవలం రామ నామ జపం. ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏదో కాస్త వండుకుని తినేది. అప్పుడప్పుడు ఎవరో ఒకరు తినడానికి ఇచ్చి వెళ్ళేవారు.

తిరువయ్యారు త్యాగరాజు ఇరవైఒక్క సంవత్సరాల పాటు రామనామం జపించారు. ప్రతిరోజూ లక్షా ఎనిమిదివేల సార్లు రామనామాన్ని జపించేవారు. కాలగమనంలో టుక్కిరిగా ముద్ర పడీన ఆ అమ్మాయి ‘టుక్కిరి పాట్టి (అవ్వ)’ అయ్యింది. ఆమె జపం లెక్కపెట్టలేనంత అయ్యింది. ఆమె ఎంత జపంచేసిందో కేవలం రామచంద్ర ప్రభువుకు మాత్రమే తెలుసు.

ఒకరోజు ఆ ఊళ్ళో ఒక పిల్లవానికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. భరించలేనంత నొప్పితో అల్లాడిపోతున్నాడు. బాధతో ఏడుస్తున్నాడు. ఊర్లోని వైద్యుడు అల్లం, వాముతో కషాయం చేసి తాగించమన్నాడు. ఊర్లో ఎవరితోనూ ఇవి లేవు. ఇక గత్యంతరం లేక టుక్కిరి పాట్టి వద్ద ఉన్నయేమో వెళ్ళి అడగమన్నారు. ఆ చిన్నవాడు వెళ్ళి భయంతో, “కొంచం వాము కావాలి” అని అడిగాడు. పట్టి వాముతో పాటు మరికొన్ని అవసరమైన దినుసులు ఇచ్చి “ఎందుకు, ఏమైంది నీకు?” అని అడిగింది.

Advertisement

“కడుపు నొప్పి. . . చాలా ఎక్కువగా ఉంది . .”

“ఉండు... ఇప్పుడే వస్తాను”

పాట్టి కొంచం విభూతి తీసుకువచ్చి ‘రామ నామం’ చెప్తూ, ఆ పిల్లవాడి నుదుటున పెట్టింది.

వాడు ఇంటికి పరిగెత్తాడు. ”నాకు కషాయం వద్దు”

Advertisement

“ఎందుకు?”

“కడుపునొప్పి పోయింది”

ఆ బాలుడి తల్లి విషయం అర్థంకాక తికమకపడి బాలుని నుదిటిపైనున్న విభూతిని చూసింది.

“పాట్టి పెట్టింది. వెంటనే నా కడుపునొప్పి పోయింది” అని చెప్పాడు.

మొత్తం ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది. ‘టుక్కిరి పాట్టి’కి అంతటి సిద్ధి కలిగిందా?

అంటే ఆమె ఇప్పుడు టుక్కిరి కాదన్నమాట. రామనామ మహత్యాన్ని చాటిచెప్పడానికే విధి ఆమె తలరాతని అలా రాసింది. ఆ ఊరి వైద్యుడితో ఇక పనిలేదు. ఆయన స్థానాన్ని రామనామ పాట్టి తీసుకుంది. ఆవిడ వద్ద ఉన్న మందు కేవలం చిటికెడు విభూతి అంతే!!”

మహాస్వామి వారు వీటిని చెప్పగా విన్నవారు ధన్యులు.

--- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్

#KanchiParamacharyaVaibhavam
#కంచిపరమాచార్యవైభవం