మారక దశలు అంటే ఏమిటి? – పరాశర సిద్ధాంతం ప్రకారం చింతా గోపిశర్మ సిద్ధాంతి వివరణ
మారక దశలు జ్యోతిషశాస్త్రంలో అత్యంత జాగ్రత్తగా పరిశీలించవలసిన అంశాలలో మారక దశలు ఒకటి. నేటి కాలంలో చాలామంది ద్వితీయాధిపతి లేదా సప్తమాధిపతి దశ వచ్చిన వెంటనే "మారక దశ" అని భయపెడుతుంటారు.
మారక దశలు
జ్యోతిషశాస్త్రంలో అత్యంత జాగ్రత్తగా పరిశీలించవలసిన అంశాలలో మారక దశలు ఒకటి. నేటి కాలంలో చాలామంది ద్వితీయాధిపతి లేదా సప్తమాధిపతి దశ వచ్చిన వెంటనే "మారక దశ" అని భయపెడుతుంటారు. కానీ ఇది పరాశర మహర్షి బోధించిన సంపూర్ణ విధానం కాదు. పరాశర సిద్ధాంతం ప్రకారం ముందుగా ఆయుర్దాయ నిర్ణయం చేయాలి. జాతకునికి అల్పాయువు, మధ్యాయువు, పూర్ణాయువు ఏది ఉన్నదో నిర్ణయించకుండా మారక నిర్ణయం చేయరాదు.
ద్వితీయస్థానం మరియు సప్తమస్థానం మారకస్థానములుగా పరిగణించబడినవి. వాటి అధిపతులు ప్రధాన మారకగ్రహములుగా చెప్పబడినారు. అయితే ప్రతి ద్వితీయాధిపతి లేదా సప్తమాధిపతి దశలో మరణము సంభవించదు. అది కేవలం మారకశక్తిని కలిగియుంటుంది. పరాశర మహర్షి ప్రకారం ద్వితీయాధిపతి, సప్తమాధిపతి, వారితో యుతి కలిగిన గ్రహములు, వారిచే దృష్టి పొందిన గ్రహములు, ద్వితీయము లేదా సప్తమమున ఉన్న గ్రహములు మారక ప్రభావమును కలిగించగలవు.
అయితే మారక దశ ఫలించుటకు కొన్ని పరిస్థితులు అవసరమవుతాయి. ఆయుర్దాయము పూర్తికి చేరువలో ఉండాలి. గోచారములు అనుకూలించాలి. అష్టమభావము మరియు అష్టమాధిపతి బలహీనముగా ఉండాలి. అరిష్టభంగ యోగములు లేకపోవాలి. పూర్ణాయుష్కులైన జాతకులలో మారక దశలు తరచుగా మరణమునకు కారణము కాకుండా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు, ఉద్యోగ విరమణ, జీవితంలో ఒక ముఖ్య అధ్యాయం ముగింపు వంటి ఫలితములను ఇవ్వగలవు.
మధ్యాయుష్కులలో మారక ప్రభావము కొంత బలంగా ఉండవచ్చును. అల్పాయుష్కులలో ఆయుర్దాయము పూర్తికావలసిన సమయంలో మారక గ్రహ దశ లేదా అంతర్దశ ప్రబలమైతే ప్రాణాపాయ సూచనలు ఏర్పడవచ్చును. ఇక్కడ ఒక ముఖ్యమైన శాస్త్రసూత్రము గుర్తుంచుకోవాలి. మారక గ్రహము బలవంతుడైతే ఎల్లప్పుడూ హానికరుడు కాదు. కొన్నిసార్లు అతడు ధనం, కుటుంబవృద్ధి, వివాహము, స్థిరాస్తి వంటి ఫలితములను కూడా ఇస్తాడు. మారకత్వము అతని ఒక కర్తవ్యం మాత్రమే; అది ప్రతి దశలో వ్యక్తమవదు.
అష్టమాధిపతి మరియు మారకాధిపతి పరస్పర సంబంధము కలిగినచో మారకశక్తి పెరుగుతుంది. అదే గురు లేదా శుక్ర దృష్టి లభించినచో ఆ ప్రభావము తగ్గిపోవచ్చు. పరాశర సంప్రదాయంలో మారక నిర్ణయమునకు ముందు ఈ అంశములు పరిశీలించవలెను.
- ఆయుర్దాయ నిర్ణయం
- అష్టమభావ బలం
- అష్టమాధిపతి స్థితి
- ద్వితీయ, సప్తమాధిపతుల బలం
- దశా-అంతర్దశ
- గోచార శని, గురు
- అరిష్టభంగ యోగములు
ఈ క్రమము లేకుండా కేవలం ఒక గ్రహ దశను చూసి మారక నిర్ణయం చేయుట శాస్త్రసమ్మతము కాదు.
పరాశర మహర్షుల బోధన ప్రకారం జ్యోతిషి భయపెట్టువాడు కాకూడదు. శాస్త్రసమ్మత పరిశీలన చేసి, దోషముంటే పరిహారమార్గము చూపించువాడై ఉండాలి.
అందువల్ల "మారక దశ వచ్చింది" అనేది తుది నిర్ణయం కాదు. "ఆయుర్దాయము పూర్తయిందా? మారకయోగము క్రియాశీలమైందా? అరిష్టభంగములున్నాయా?" అనే ప్రశ్నలకు సమాధానం లభించిన తరువాతనే నిర్ణయం చేయవలెను.
మరిన్ని జ్యోతిష విషయములకు సంప్రదించండి:- 098661 93557
చింతా గోపిశర్మ సిద్ధాంతి
పెద్దాపురం – 533437
సెల్ : 9866193557


