🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

ప్ర: ఉపమన్యు మహర్షి శ్రీకృష్ణ పర మాత్మకు శివదీక్షనిచ్చినట్లు చెప్తారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవానుడే అయిఉండగా, ఆయన వేరొక మహర్షి ద్వారా ఉపదేశం పొందే అవసర మెందుకు?

Advertisement

జ: "యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః" అని శ్రీకృష్ణపరమాత్మ వచనం. లోకానికి ఆదర్శంకోసమే ఆయన సత్కర్మాచరణం చేశాడు. కర్మను ఆచరించవలసిన అవసరమే ఆయనకు లేదు. భగవంతుని ఉపాసించడం, గురువు ద్వారా దీక్షను స్వీకరించడం అనేది సత్సంప్రదాయం. ప్రతి మనిషికీ అవసరమైన ధర్మం. ధర్మప్రతిష్టాపనకు అవతరించిన శ్రీకృష్ణుడు ఆ ధర్మాన్ని తాను ఆచరించి చూపించాడు. అన్ని విద్యలకీ ప్రభువైన ఆ స్వామి, స్వయంగా సాందీపని వద్ద విద్యలనభ్యసించిన విషయం విదితమే కదా!

'మహాభారతంలో' - శ్రీకృష్ణుడు ఉపమన్యువు వద్ద 'శివదీక్ష'
 పొందినట్లు చెప్పబడింది.

 "రుద్రోనారాయణశ్చైవ
  సత్యమేకం ద్విధాకృతం.
  యత ఆత్మానమేవాహం
  తతోరుద్రం భజామ్యహం” 

“ఒకే సత్యం రుద్రుడనీ, నారాయణుడనీ రెండుగా చెప్పబడుతోంది. నా స్వరూపమైన రుద్రునే నేను సేవించాను". అని హరిహరులకు భేదంలేదని సాక్షాత్తూ శ్రీకృష్ణుడే మహాభారతం “శాంతిపర్వం"లో తెలియజేశాడు.

Advertisement

శివస్యహృదయం విష్ణు: విష్ణోశ్చ హృదయం శివః. - అని 'వేదవాక్యం'..

శివుడు రామనామ రసికుడైనట్లే, విష్ణువు శివోపాసనారసికుడు. తనకిష్టమైన, తన హృదయమైన శివుని తాను ఆరాధించి, భగవదారాధన ఆవశ్యకతని మనకి బోధించాడు. ఆయనకు అవసరమై కాదు.

యుగేయుగేతు కృష్ణేణ తోషితోవై మహేశ్వరః. - ప్రతియుగంలోనూ, కృష్ణుని ద్వారా మహేశ్వరుడు అర్చింపబడతాడు.

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷