వృద్ధాప్యం అంటే అదృష్టం

పుట్టినవాడు గిట్టక తప్పదని మనకు తెలుసు, కానీ “వృద్ధాప్యం” అనే మాట వినగానే గుండెల్లో గుబులు, కళ్లలో దిగులు కలుగుతాయి. మానవ జీవితంలో అనేక దశలుంటాయి, అందులో చివరి దశ వృద్ధాప్యం.
ఈ మార్పు శరీరానికి మాత్రమే, మనసుకు వృద్ధాప్యం అనేది ఉండదు. మనసు ఎప్పుడూ చురుకుగా ఉంటూనే ఉంటుంది.
నేటి పరిస్థితుల్లో వృద్ధాప్యాన్ని అనుభవించడం ఒక వరమే. మనం తినే ఆహారం, పీలిచే గాలి, త్రాగే నీరు—ఇవి అన్నీ కలుషితమైపోయాయి. మనుషుల్లో కూడా స్వచ్ఛత అనేది తగ్గిపోయింది. అయినప్పటికీ, మనం ఇంకా బ్రతికే ఉండటం మన అదృష్టం, దేవుడు మనకిచ్చిన వరంగా భావించాలి.
వృద్ధాప్యంలో ఆరోగ్య పరిరక్షణ
- మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
- యువకులు, పిల్లలు తినే ఆహారం జోలికి అస్సలు పోవద్దు.
- శరీరానికి అవసరమైన పోషకాహారం మాత్రమే తీసుకోవాలి.
- అనారోగ్యం వస్తే, మీకు ఎక్కువ కాలం సపర్యలు చేసే టైమ్ ఎవరికి ఉండదు.
- డబ్బుంటే పనివారిని పెట్టుకుంటారు, కానీ రోజువారీ జీవన సరళి మీరు స్వయంగా జాగ్రత్తగా నడిపించుకోవాలి.
- భార్యాభర్త కలసి పనిచేస్తే గానీ గడవని రోజులివి.
- జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవాలి.
- ఎక్కడ పడిపోకుండా ఉండాలి.
- బాత్రూమ్‌లో ఏదైనా పట్టుకుని స్నానం చేయాలి.
- అవసరమైతే స్టూల్ మీద కూర్చుని స్నానం చేయడం మంచిది.
- అవసరమైతే ఉతకర్ర (లాంగ్ హ్యాండిల్ బ్రష్) వాడటంలో ఎలాంటి సిగ్గు పడొద్దు.
- మీరు పడిపోయిన తర్వాత పరిస్థితి అత్యంత క్లిష్టమవుతుంది.
- వయసును బట్టి, శరీర సామర్థ్యాన్ని బట్టి సర్జన్లు ఆపరేషన్ చేయడానికి ఇష్టపడరు.
- అప్పటి నుంచి మంచం మీదో, వీల్‌చైర్‌లోనో జీవించాల్సి రావచ్చు.
- చాలా మంది పడిపోయాక తిరిగి కోలుకోలేరు.
వృద్ధాప్యంలో బంధాలు, జీవన శైలి
- మీకు ఆస్తులు ఉంటే తప్ప, మీనుంచి ఎవరూ డబ్బులు ఆశించరు.
- మీ కుటుంబ సభ్యులు మంచి వాళ్లయితే, మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటారు.
- డబ్బులుండి, చూసుకోలేనివాళ్లు వృద్ధాశ్రమంలో చేర్పించేస్తారు లేదా మీరు స్వయంగా వెళ్లిపోవాలి.
- వృద్ధాప్యంలో అనుభవాన్ని యువతతో పంచుకోవాలి.
- పిల్లలకు, యువతకు మీ జీవిత జ్ఞానాన్ని అందించండి.
- భార్యాభర్తలయితే మరింత ప్రేమగా ఉండాలి.
- కోపతాపాలు, కక్షలు వదిలేయాలి.
- పిల్లలతో, బంధువులతో సంతోషంగా జీవించాలి.
- చలాకీగా ఉండాలి, ప్రతివిషయాన్ని పట్టించుకోవద్దు.
- ఎవరూ అడగకపోతే, ఉచిత సలహాలు ఇవ్వకూడదు.
- మీ సలహాలను ఎవరు పాటించకపోతే బాధపడొద్దు.
- సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి.
- సేవా సంఘాల్లో చేరి, ఇతరులకు సహాయం చేయండి.
- మీ దాతృత్వాన్ని బ్రతికి ఉన్నప్పుడే చూసి సంతోషించండి.
వృద్ధాప్యంలో సంతోషంగా ఉండటానికి కొన్ని చక్కటి అలవాట్లు
✅ పుస్తకాలు చదవడం
✅ చిన్ననాటి స్నేహితులతో మాట్లాడడం
✅ ఇండోర్ లేదా ఔట్‌డోర్ గేమ్స్ ఆడటం (రిస్క్ లేని ఆటలు)
✅ మనవళ్లతో కలిసి ఆడటం, పాటలు పాడటం
✅ టీవీ తక్కువగా చూడడం
✅ దైవ సన్నిధిలో గడపడం
✅ ప్రపంచంలోని ప్రశాంత ప్రదేశాలను సందర్శించడం
మరణాన్ని మరిచిపోండి, కొత్త జన్మగా భావించి జీవించండి!
– బి మల్లికార్జున దీక్షిత్
Family Counselor & Counseling Psychologist
📞 9133320425