ఒక పండు తినడానికి, ఒక విత్తనం రేపటి కోసం అనే నాన్నమ్మ మాట నుంచి మొదలయ్యే ఈ రచన, గింజలు లేని పండ్ల లాగే పెళ్లి, పిల్లలు వద్దనుకునే నేటి తరం గురించి ఆలోచింపజేస్తుంది.

కాలం మారింది

ఒకప్పుడు మా నాన్నమ్మ విత్తనాలు దాచుకునేది.

ప్యాకెట్లలో కాదు. ఒక స్టీల్ డబ్బాలో. మామిడి టెంకలు ఎండలో ఆరబెట్టి, నిమ్మ గింజలు, జామ గింజలు కడిగి చిన్న ముత్యాల్లా దాచేది. ఆమె అనేది, "ఒక పండు తినడానికి. ఒక విత్తనం రేపటి కోసం."

నేను ఏడవ అంతస్తులోని ఇంట్లో ఉంటున్నాను. మా నాన్నమ్మ వంటగదిలో ఎప్పుడూ లేనివన్నీ నా ఫ్రిజ్‌లో ఉన్నాయి.

గింజలు లేని ద్రాక్ష. గింజలు లేని పుచ్చకాయ. ఉమ్మేయాల్సిన అవసరమే లేని గింజలు లేని నారింజ పండ్లు. హాయిగా, సౌకర్యవంతంగా, ఏ చీకూచింతా, చిందరవందరా లేదు.

ఇప్పుడు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి.

నా మిత్రులు, నేను - మాకు 28, 29, 31 ఏళ్లు. మా మధ్య ఒక ఒప్పందం ఉంది, మాటల్లో చెప్పుకోలేదు కానీ అందరికీ అర్థమైంది.

పెళ్లి వద్దు. చాలా సర్దుబాట్లు చేయాలి.
పిల్లలు వద్దు. చాలా ఖర్చు, వాతావరణం గురించి చాలా ఆందోళన, ఇతరత్రా ఆలోచనలు, పోగొట్టుకోవడానికి చాలా స్వేచ్ఛ ఉంది.

మేము స్వయం సమృద్ధిగా, హాయిగా ఉన్నామని చెప్పుకుంటాం. మేమే గింజలు లేని రకాలం. తియ్యగా, ఎక్కువ కాలం నిలవ ఉండేలా, పునరుత్పత్తి బాధ లేకుండా తయారు చేయబడిన వాళ్లం.

నెల క్రితం మా మావయ్య ఊరికి వెళ్లాను. మా అమ్మమ్మ ఉండే ఇల్లు తాళం వేసి ఉంది. దాని వెనకున్న ఆమె పాత మామిడి చెట్టు వేసవి తుఫానులో కూలిపోయింది. మా మావయ్య కొత్తది నాటడానికి ప్రయత్నించాడు. నర్సరీ నుంచి ఒక మొక్క తెచ్చాడు. హైబ్రిడ్, దిగుబడి ఎక్కువ, గింజలు లేనిది.

Advertisement

నేను అడిగాను, "మరి తర్వాతి చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది?"

అతను నవ్వాడు. "మళ్ళీ కొనాలి. కంపెనీ దగ్గర నుంచి."

ఆ రాత్రి నేను నా ముగ్గురు ఫ్రెండ్స్‌కి కాల్ చేశాను. వీడియో కాల్. మనమంతా సంతోషంగా మన ఇళ్లలో హాయిగా ఉన్నాం, ఏడ్చే పిల్లలు లేరు. అత్తమామలతో గొడవలు లేవు. మా ఫోటోలు వారసత్వంగా తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు.

మేము ఇళ్లకు ఏం తెప్పించుకున్నామో ఒకళ్లకు ఒకళ్ళు చూపించుకుంటున్నాం: అంతా గింజలు లేనిదే. అప్పుడే నాకు ఒక్కసారిగా తట్టింది.

మన పండ్ల లాగే మనం ఒక ప్రపంచాన్ని తయారు చేసుకున్నాం.

మనకు అంతరాయం లేని జీవితం కావాలి. బాధ్యత లేని ప్రేమ కావాలి. పరిమితి లేని ఆనందం కావాలి. గింజలు లేని పండు కావాలి.

మనకు అదే దొరికింది.

మా నాన్నమ్మ డబ్బా ఇప్పుడు ఖాళీగా ఉంది. నా ఫ్రిజ్ నిండుగా ఉంది.

కానీ ప్రతి పండుకు గింజ లేకపోతే, ప్రతి మనిషీ పిల్లలు వద్దని నిర్ణయించుకుంటే, రేపు ఫ్రిజ్ ఎవరు తెరుస్తారు?

పండు మనతోనే అంతమవుతుంది.
మనం మనతోనే అంతమవుతాం.

ఒక పర్ఫెక్ట్, తియ్యని, గింజలు లేని తరం. భవిష్యత్తు లేని తరం.

పైఆలోచనలకు లింగబేధం లేదు - అందుకే పేర్ల ప్రస్తావన లేదు.

రచన: మృత్యుంజయ