ఈరోజు నుండి ధనుర్మాసం ప్రారంభం. భక్తి, తపన, ఆత్మసమర్పణకు ప్రతీక అయిన ఈ మాసంలో గోదాదేవి విరచితమైన తిరుప్పావై పాశురాలకు విశిష్టమైన స్థానం ఉంది.

గోదాదేవి ఎవరు?

Advertisement

గోదాదేవి (ఆండాళ్) సుమారు 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు అయిన పన్నెండు ఆళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర దివ్యప్రబంధం (4000 పాశురాలు)లో గోదాదేవి పాడిన 30 పాశురాలు అత్యంత విశిష్టమైనవిగా నిలిచాయి.

గోదాదేవి తనను తాను రేపల్లెలోని ఒక గొల్లభామగా భావించుకొని, శ్రీకృష్ణుడితో అనురాగభరితమైన ఆత్మసంబంధాన్ని అనుభవిస్తుంది.

పగలంతా తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని చూసిన ఆనందం,
రాత్రివేళ చూడలేని విరహతాపం,
తెల్లవారే వేళ కన్నులారా దర్శించుకోవాలనే తపన,
ఈ అన్ని భావరాగానురాగాల సమ్మేళనమే తిరుప్పావై.

Advertisement


పాశురం అంటే ఏమిటి?

పాశురం అనగా — భక్తి, తత్త్వం, తపస్సు, ఆత్మసమర్పణను పద్యరూపంలో వ్యక్తపరిచే దివ్యకవిత.

తిరుప్పావైలో మొత్తం 30 పాశురాలు ఉన్నాయి.

Advertisement


తిరుప్పావై పాశురాల పరమార్థం

మొదటి అయిదు పాశురాలు – ఉపోద్ఘాతం

ఈ పాశురాలు తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి.
భగవంతుని ఆరాధనలో ఆడంబరం అవసరం లేదని,
చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు బోధిస్తాయి.

భగవంతుని భక్తితో ఆరాధిస్తే—

Advertisement
  • వానలు సమృద్ధిగా కురుస్తాయని
  • పంటలు నిండుగా పండుతాయని
  • దేశం సుభిక్షంగా ఉంటుందని
    ఈ పాశురాలు స్పష్టం చేస్తాయి.


తదుపరి పది పాశురాలు – సేవా యాత్ర

ఈ భాగంలో గోదాదేవి తన చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి బయలుదేరే సన్నివేశాలు వర్ణించబడ్డాయి.
భక్తుల మధ్య ఐక్యత, పరస్పర ప్రేరణ, సేవాభావం ఇక్కడ ప్రధానాంశాలు.


పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు

ఈ పాశురాల్లో—

  • దేవాలయానికి చేరుకోవడం
  • అక్కడి శిల్పసౌందర్యాల వర్ణన
  • రంగనాథునికి సుప్రభాతం పాడటం
    వివరించబడ్డాయి.

కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంది.


చివరి తొమ్మిది పాశురాలు – ఆత్మసమర్పణ

ఈ భాగం పూర్తిగా భగవంతుడి విలాసాన్ని, కృపను ప్రకటిస్తుంది.
గోదాదేవి తన నిష్కల్మష హృదయాన్ని రంగనాథుడికి సమర్పిస్తుంది.

చివరి పాశురంలో ఫలశ్రుతిగా—
ఎవరైతే ఈ పాశురాలను గానం చేస్తారో
వారికి తప్పక భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని పేర్కొంటుంది.


ధనుర్మాసం – శివ ప్రాశస్త్యం

ఋషిపీఠం

మార్గశిరమాసంలోని ఆర్ద్రా నక్షత్రం నాడు శివుడు అగ్నిలింగంగా అరుణాచలంలో అవతరించాడని శైవపురాణాలు పేర్కొంటాయి.
ఈ మాసంలోని ఒక సోమవారం నాడు శివ–పార్వతుల కళ్యాణం జరిగిందని శివపురాణ వచనం.

ఉషఃకాలంలో శివార్చనకు ఉన్న విశిష్టతను పురాణాలు విశదీకరిస్తాయి.
వైదిక శైవ సిద్ధాంతానుసారం, ప్రాచీన కాలం నుంచే తమిళనాట శైవాలయాలలో ఉషఃకాల పూజ జరుగుతోంది.

ఆ సమయంలో మాణిక్యవాచకుని
‘తిరువెంబావై – తిరుప్పళి ఎళుచ్చి’ పఠనం ఆనవాయితీ.

వైష్ణవ సంప్రదాయం శ్రీరామానుజుల పరంపర ద్వారా దక్షిణాదిలో వ్యాప్తి చెంది, ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణం వైష్ణవాలయాలలో స్థిరపడింది.

తిరుప్పావై, తిరువెంబావై — రెండూ అవశ్య పఠనీయాలుగా ప్రజల్లో వ్యాప్తి చేయవలసిన గ్రంథాలుగా పేర్కొన్నది
కాంచీ పరమాచార్యులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు.

ఆ మహాస్వామి వారి చరణాలను ధ్యానిస్తూ,
వారి హృదయానుసారం
ఈ ధనుర్మాసంలో
తిరుప్పావై – తిరువెంబావై రెండింటినీ పారాయణం చేద్దాం.