మరణ సమయంలో భగవాన్ నామస్మరణ మహిమ తెలుసుకుందాం

పూర్వం మాధవపురం అనే గ్రామంలో ఒక భక్తుడు నివసించేవాడు. భగవంతుడి పాదస్మరణ తప్ప వేరే ధ్యానం అతనికి తెలియదు. పూజా, ధ్యాన, సాధన, ఆధ్యాత్మిక చింతనతో జీవిస్తూ, ఆయన ముక్తిమార్గాన నడిచేవాడు. లౌకిక విషయాల పట్ల పూర్తిగా విముఖుడై, ఆయన చుట్టూ అనేక శిష్యులు చేరి భగవద్భక్తి మార్గం అనుసరించసాగారు.
కాలక్రమేణా ఆయన వృద్ధాప్యంలోకి ప్రవేశించి, తన జీవితం ముగియబోతుందని గ్రహించాడు. మరణం కాశీలో జరగాలని ఆకాంక్షించి, శిష్యులను ఆ కోరిక తెలిపాడు. శిష్యులు సంతోషంగా పల్లకిని సిద్ధం చేసి, గురువును కాశీక్షేత్రానికి తీసుకెళ్లారు.
ప్రయాణం సాగుతుండగా, కాశీ పొలిమేరకు చేరినప్పుడు ఆయన ప్రాణాలు పోవు సమయం సమీపించింది. ఆ క్షణంలో గురువు అడిగాడు –
“మనం కాశీ చేరామా?”
శిష్యులు సమాధానమిచ్చారు –
“స్వామీ! ఇప్పుడే మాలవాడ అనే ఊరికి చేరాము. ఇంకొద్ది సేపట్లో కాశీ చేరుకుంటాం.”
అదే సమయంలో ఆయన చెవిలో “మాలవాడ” అనే మాట పడింది. ప్రాణం పోవు సమయంలో ఆ ఒక్క తలంపే మిగిలింది. అలా ఆ భక్తుడు మాలపల్లెలో ఒక నిమ్నజాతి కుటుంబంలో మళ్లీ జన్మించాడు.
పూర్వజన్మ వాసన
తండ్రి కాపరిగా పని చేసేవాడు. రాత్రిళ్లు ఊరికి కాపలా కాయుతూ “పారాహుషార్” అంటూ తిరుగేవాడు. కానీ ఆ కుమారుడు మాటలేమీ మాట్లాడని మౌనవ్రతిగా ఉండేవాడు. పూర్వజన్మ వాసన వల్ల అతడిలో భిన్నమైన గుణాలు కనిపించేవి.
ఒకసారి తండ్రి బయటకు వెళ్లవలసి రావడంతో, తన కుమారుడిని రాత్రి కాపలా కాయమని రాజుకు చెప్పి వెళ్ళిపోయాడు. రాజు అతడి ప్రవర్తన చూడాలని మారు వేషంలో వెంబడించాడు.
మొదటి యామంలో ఆ బాలుడు తప్పెట్లు కొడుతూ ఇలా చెప్పాడు—
“కామం క్రోధంచ లోభంచ దేహేతిష్ఠంతి తస్కరాః
జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృతః జాగృతః.”
(మన దేహంలో కామ, క్రోధ, లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానరత్నాన్ని అపహరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త!)
రాజు ఆశ్చర్యంతో అతణ్ణి గమనించాడు.
రెండవ యామంలో అతడు చాటాడు—
“జన్మదుఃఖం జరాదుఃఖం జాయాదుఃఖం పునః పునః
సంసారసాగరం దుఃఖం తస్మాత్ జాగృతః జాగృతః.”
(జననం దుఃఖం, వృద్ధాప్యం దుఃఖం, సంసారం దుఃఖసాగరం. కాబట్టి జాగ్రత్త!)
మూడవ యామంలో చాటాడు—
“మాతానాస్తి పితానాస్తి నాస్తి బంధు సహోదరః
అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృతః జాగృతః.”
(తల్లి, తండ్రి, బంధువులు, ధనం ఇవన్నీ మాయ. కాబట్టి జాగ్రత్త!)
చివరి యామంలో చెప్పాడు—
“ఆశయా బధ్యతే లోకే కర్మణా బహుచింతయా
ఆయుఃక్షీణం నజానాతి తస్మాత్ జాగృతః జాగృతః.”
(ఆశల పాశంలో చిక్కుకుని, కర్మచింతల్లో మునిగిపోతూ జీవితం తరిగిపోతుంది. కాబట్టి జాగ్రత్త!)
రాజు ఇది విని పరవశుడయ్యాడు. ఆ బాలుడు జీవన్ముక్తుడని గ్రహించి తన రాజప్రాసాదానికి పిలిచాడు. రాజు అతడి ఇష్టానుసారం ఏ పని చేయాలనుకుంటావని అడిగాడు. అప్పుడు బాలుడు,
“నేరస్తులకు మరణశిక్ష అమలు చేసే పని నాకు ఇవ్వండి” అని కోరాడు.
రాజు ఆశ్చర్యపడి ఆ కోరిక నెరవేర్చాడు.
మరణశిక్షలో ముక్తి మార్గం
ఆ బాలుడు మరణశిక్ష స్థలాన్ని పవిత్ర స్థలంగా మార్చాడు. అక్కడ శివుడు, విష్ణువు పటాలు, పుష్పాలు, ధూపదీపాలు, పవిత్ర గ్రంథాలు అలంకరించి ఉంచేవాడు.
శిక్షకు తెచ్చినవారిని ముందు దైవనామం వినిపిస్తూ, భగవద్భక్తిని వివరించి, చివరగా వారు దైవస్మరణలో లీనమయ్యే క్షణంలోనే మరణశిక్ష అమలు చేసేవాడు.
అలా వారి ప్రాణం దైవనామ స్మరణలోనే విడిపోవడంతో వారు ముక్తి పొందేవారు.
దీన్ని బ్రహ్మదేవుడు స్వయంగా చూసి ఆశ్చర్యపోయాడు.
“వత్సా! ఈ విధంగా మరణశిక్ష అమలు చేయడంలో అంతరార్థం ఏమిటి?” అని అడిగాడు.
ఆ జీవన్ముక్తుడు నమస్కరించి చెప్పాడు—
“ఓ బ్రహ్మదేవా! నా గత జన్మలో మరణ సమయంలో భగవన్నామ స్మరణ చేయక, ‘మాలపల్లె’ అనే మాట వినడంతో మాలవాడగా పుట్టాను.
కాబట్టి ఇప్పుడు మరణ సమయంలో వీరందరూ భగవన్నామం జపిస్తూ ముక్తి పొందేలా చేస్తున్నాను.”
బ్రహ్మ సంతోషించి అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకానికి తిరిగి వెళ్లాడు.
సారాంశం
మరణకాలంలో సత్స్మరణ, దైవనామస్మరణ ఉంటే ముక్తి లభిస్తుంది.
భగవన్నామమే పరమ ఔషధం — సులభోపాయం, ధన్యోపాయం.
జీవితాంతంలో ఆ నామమే మనకు కడతేరు దారి చూపిస్తుంది.
శివయ్యా! అందరినీ చల్లగా చూడు తండ్రి.
