పెళ్లిళ్లు లేక బ్రహ్మదేవుడు ఖాళీగా!

లక్ష్మీదేవి:
“బ్రహ్మదేవా! ఇంత ఖాళీగా ఉన్నారు? ఏమయింది?”
బ్రహ్మదేవుడు:
“ఏమి చెప్పను తల్లీ! భూమిపై పెళ్లిళ్లు తగ్గిపోతున్నాయి. యువత వివాహం చేసుకోవడం మానేశారు. పెళ్లిళ్లు లేకపోతే పిల్లలు ఎలా పుడతారు? పిల్లలు లేకపోతే నా సృష్టికి పని ఏముంది? అందుకే ఖాళీగా ఉన్నాను.”
లక్ష్మీదేవి:
“అదెలా బ్రహ్మదేవా? పెళ్లిళ్లు ఎందుకు జరగడంలేదు?”
బ్రహ్మదేవుడు:
“నాకు తెలిసి, నేను ఆడమగలను సృష్టించినప్పుడు, వారు యుక్తవయస్సులో పెళ్లి చేసుకుని, కలిసి జీవించాలి, సుఖదుఃఖాలను పంచుకోవాలి అని అనుకున్నాను. కానీ ఇప్పటి యువతికి పెళ్లి మీద ఆసక్తి లేదు. తల్లిదండ్రులు కూడా ఉదాసీనంగా ఉన్నారు. సంబంధాలు చూస్తున్నారంతే కానీ, ఆతురత లేదు.”
“వీళ్ల పెళ్లిలేకపోతే పిల్లలు ఎలా పుడతారు? పిల్లలు లేకపోతే సృష్టికి అవసరమేముంది? ఇప్పుడు నువ్వే కారణంగా అనిపిస్తోంది తల్లీ!”
లక్ష్మీదేవి:
“నేనా? ఏం చేశాను బ్రహ్మదేవా?”
బ్రహ్మదేవుడు:
“నీవే అబ్బాయిలకు, అమ్మాయిలకు లక్షల్లో జీతాలు, విలాసవంతమైన జీవితం ఇచ్చావు. అందుకే వారు పెళ్లిని పక్కనపెట్టి, ఇల్లు, కారు, టూర్‌లు అన్నీ చేసుకుంటూ సంతోషంగా ఒంటరిగా జీవించడానికి అలవాటు పడిపోయారు.”
లక్ష్మీదేవి:
“నేను డబ్బుతో హాయిగా జీవించాలనుకున్నాను, కానీ పెళ్లి అనే బంధం తగ్గిపోతుందనే అనుకోలేదు. అలా గొడవలు, కలిసిపోవడం అన్నీ దాంపత్య జీవితం భాగమే. నాకే మా శ్రీవారిని వదిలి ఒక్క క్షణం ఉండలేను. నా పేరు ‘లక్ష్మి’ కాకుండా, ఆయన పేరుతో ‘శ్రీలక్ష్మి’ అని పిలిచినప్పుడే సంతృప్తి. పెళ్లిలేని జీవితం జీవితం కాదు బ్రహ్మదేవా!”
బ్రహ్మదేవుడు:
“అవును తల్లీ! అందుకే నేను స్త్రీ శరీరాన్ని 28–30 సంవత్సరాల లోపు సంతానానికి అనువుగా రూపొందించాను. ముప్పై తర్వాత పెళ్లి చేసుకుని ముప్పై ఐదు సంవత్సరానికి పిల్లలు కావాలంటే, శరీరం సహకరించదు. తల్లీబిడ్డల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుంది.”
లక్ష్మీదేవి:
“చింతించకండి బ్రహ్మదేవా. వీళ్లలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. సకాలంలో పెళ్లిళ్లు జరుగుతాయి. మీరు మళ్లీ పని మరిచిపోయేంత బిజీగా ఉండే రోజులు వస్తాయి.”
రచయిత:
బి. మల్లికార్జున దీక్షిత్
ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
📞 సెల్: 9133320425