🙏 నిర్జల ఏకాదశి 🙏

బ్రహ్మవైవర్త పురాణములోని భీమ-వ్యాస సంభాషణ

ద్వాపర యుగంలో కుంతీపుత్రులలో మధ్యముడైన భీముడు ఒక రోజు శ్రీ వ్యాసమహర్షిని ఇలా ప్రశ్నించాడు:

“ఓ పూజ్యులైన తాతగారూ!
నా మనవిని దయచేసి వినవలసిందిగా కోరుచున్నాను.

నా అన్నయైన ధర్మరాజు యుధిష్ఠిరుడు, తల్లియైన కుంతీదేవి, నా తమ్ముళ్లైన అర్జునుడు, నకులుడు, సహదేవుడు, అలాగే ద్రౌపది — వీరందరూ ప్రతి మాసమున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, ఉపవాసం ఉండి, శ్రీకృష్ణుని నామస్మరణ చేస్తూ తమ జీవితాలను ధన్యముగా చేసుకుంటున్నారు.

Advertisement

కానీ నేను మాత్రం ఎల్లప్పుడూ భోజనంపైనే ఆసక్తి కలిగి ఉండుటవలన, నా తల్లి, అన్నగారు, తమ్ముళ్లు మరియు ద్రౌపది అందరూ నన్ను కూడా ఏకాదశి వ్రతం చేయమని కోరుతున్నారు.

అయితే నా ఉదరమందు ‘వృకాగ్ని’ ఉండుటవలన ఏకాదశి ఉపవాసం చేయలేను. ఉపవాసం చేస్తే ప్రాణాపాయం కలుగుతుందేమోనని భయపడుతున్నాను. కాబట్టి ఏకాదశి ఉపవాసం చేయకుండానే పుణ్యఫలాన్ని పొందుటకు మరేదైనా ఉత్తమమైన మార్గం ఉంటే దయచేసి చెప్పండి.”

అందుకు వ్యాసమహర్షి ఇలా పలికెను:

“ఓ భీమా! ఎంతటి కష్టమైనా భరించి, నరకయాతనల నుండి విముక్తి పొంది, భగవద్ధామమైన శాశ్వత శాంతిని పొందాలనే కోరిక ఉంటే, ప్రతి మాసమున వచ్చే రెండు ఏకాదశులను తప్పక ఆచరించవలెను.”

వ్యాసమహర్షి మాటలు విన్న భీముడు భయంతో ఇలా అన్నాడు:

Advertisement

“ఓ పితామహా! నాకు ఏమి తోచుటలేదు. ప్రతి ఏకాదశి ఉపవాసం చేయడం నాకు సాధ్యం కాదు. ఒకే ఒక్క ఏకాదశి ఉపవాసం మాత్రం చేయగలను.”

అప్పుడు వ్యాసమహర్షి ఇలా ఉపదేశించారు:

“ఓ భీమా! సూర్యుడు వృషభ లేదా మిథున రాశిలో సంచరించే సమయంలో, జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి వస్తుంది. దానిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు.
ఈ ఒక్క ఏకాదశి ఆచరించిన మిగతా మాసాలలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఫలం, భగవంతుని నామ, రూప, గుణ, లీలా కథలను శ్రవణం చేయాలి. కీర్తన, స్మరణ చేయాలి. అలా చేసినచో జీవితం ధన్యమగును.

ఈ వ్రతాన్ని ఆచరించిన వారి సమీపానికి మృత్యుసమయంలో విష్ణు ధూతలు వచ్చి వారిని వైకుంఠానికి తీసుకువెళ్తారు.”

వ్యాసమహర్షి ఆజ్ఞను అనుసరించి భీముడు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు.

భీముడు ఆచరించిన ఈ నిర్జల ఏకాదశి, తరువాత “పాండవ నిర్జల ఏకాదశి” అనే పేరుతో ప్రసిద్ధి పొందింది.

Advertisement

శ్రద్ధా-భక్తులతో నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, దాని మాహాత్మ్యాన్ని శ్రవణం, కీర్తనం, స్మరణం చేసినవారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి.


స్వస్తి 🙏

శ్రీ సద్గురు పీఠం ద్వారా...... ✍️

సమస్త లోకాః సుఖినో భవంతు 🙏