జనక మహారాజు చతుర్మాస్య వ్రత మహిమ విని, వశిష్ట మహర్షిని ప్రశ్నించాడు —
“గురువర్యా! కార్తీకమాస మహాత్మ్యం గురించి ఇంకా విశేషాలు వినాలనిపిస్తోంది. ఈ మాసంలో మరిన్ని మహిమలు ఉన్నాయా? నా సంశయం తొలగించండి.”

వశిష్టుడు మృదుస్మితంతో పలికాడు —
“రాజా! కార్తీకమాస మహిమపై అగస్త్య మహర్షి, అత్రిమహర్షిల మధ్య జరిగిన సంభాషణ ఒకటి ఉంది. విను, దానిని నీకు వివరిస్తాను.”

Advertisement

ఒకసారి అగస్త్యుడు, అత్రిమహర్షిని ఆశ్రయించి అడిగాడు —
“ఓ మహర్షీ! నీవు విష్ణువుయొక్క అంశం. నీకు కార్తీకమాస మహాత్మ్యం సమగ్రంగా తెలుసు. దయచేసి నాకు వివరించుము.”

Advertisement

అప్పుడు అత్రిమహర్షి చెప్పాడు —
“ఓ కుంభసంభవా! నీ ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమైనది. కార్తీకమాసముతో సమానమైన మాసం లేదు. వేదముతో సమానమైన శాస్త్రం లేదు. ఆరోగ్య సంపదకు సాటియైన ధనం లేదు. అలాగే శ్రీమన్నారాయణునికి సమానమైన దేవుడు లేరు.

ఏ మానవుడు అయినా కార్తీకమాసంలో నదిలో స్నానము చేసినా, శివ–కేశవాల ఆలయంలో దీపారాధన చేసినా, లేక దీపదానం చేసినా — అతనికి కలుగు ఫలితం అపారమైనది. ఈ సత్యాన్ని నిరూపించే ఒక ఇతిహాసం విను.”

త్రేతాయుగంలో సూర్యవంశస్థుడైన పురంజయుడు అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. విద్యలన్నీ నేర్చుకొని రాజ్యాభిషిక్తుడైన అతడు మొదట ధర్మబద్ధంగా ప్రజల పాలన చేసేవాడు.

Advertisement

కానీ కాలక్రమంలో ధనమోహం, రాజ్యగర్వం అతన్ని అంధుడిని చేశాయి. దయాదాక్షిణ్యరహితుడై దేవ–బ్రాహ్మణ మాన్యములను లాగుకొని, దొంగలను ఆశ్రయించి, వారితో దోపిడీలు చేయించి, వాటిలో సగం తానే స్వీకరించేవాడు. ప్రజలు అతని పాలనకు భయపడే స్థితి వచ్చింది.

అతని దౌష్ట్యం నలుదిక్కులా వ్యాపించగా, కాంభోజ, కొంకణ, కళింగాది రాజులు కలసి కాంభోజరాజును నాయకునిగా చేసుకొని మహాసేనను సిద్దం చేశారు. రహస్యమార్గం గుండా అయోధ్యను ముట్టడించి, నలువైపులా శిబిరములు వేసి యుద్ధసిద్ధులయ్యారు.

ఇది తెలుసుకున్న పురంజయుడు భయపడకుండా తన సైన్యాన్ని సిద్దం చేసాడు. శత్రువులు ఎక్కువ బలముగలవారైనా, తాను ధైర్యంగా రథమెక్కి, భేరి మ్రోగించి, సింహనాదం చేసి, శత్రుసైన్యంపై దండయాత్ర ప్రారంభించాడు.

Advertisement

ఇంతటితో —

స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహాత్మ్యములో
వింశాధ్యాయము (ఇరవయ్యవ అధ్యాయము) సమాప్తము.

🕉 ధర్మ ప్రచారం 🕉
AVB ధర్మ ప్రచారం