దశాఫల రహస్యాలు – భాగం 3

జ్యోతిషశాస్త్రంలో అత్యంత గోప్యమైన విషయాలలో ఒకటి గ్రహము తన దశలో ఎప్పుడు సంపూర్ణ ఫలితమును ఇస్తాడు? అనే ప్రశ్న. చాలామంది దశ వచ్చిందంటే వెంటనే ఫలితం వస్తుందని భావిస్తారు. కానీ పరాశర సిద్ధాంతం ప్రకారం ప్రతి దశ ప్రారంభంలోనే సంపూర్ణ ఫలితాలు రావు.

దశానాథుడు ఉన్న భావము, ఆ భావాధిపతి స్థితి, దశానాథుని నక్షత్రాధిపతి, నవాంశస్థితి, గోచార గురు మరియు శని సంచారములు కలిసివచ్చినప్పుడు మాత్రమే యోగఫలితములు పూర్తిగా వ్యక్తమవుతాయి.

Advertisement

జాతకములో రాజయోగము ఉన్నప్పటికీ సంబంధిత గ్రహ దశ రాకపోతే ఆ యోగము నిద్రావస్థలోనే ఉంటుంది. అందువల్ల మహర్షులు "యోగము ఉన్నదా?" అనే ప్రశ్నకన్నా "యోగము ఎప్పుడు ఫలిస్తుంది?" అనే ప్రశ్నను ముఖ్యంగా పరిగణించారు.

దశానాథుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ పాపగ్రహముల మధ్య ఇరుక్కొని ఉన్నచో తన సంపూర్ణ శుభఫలములను ఇవ్వలేడు. అదే నీచస్థితిలో ఉన్న గ్రహము శుభదృష్టి పొందినచో ఊహించిన దానికంటే మంచి ఫలితములు ఇవ్వగలడు. అందువల్ల ఉచ్చ–నీచ నిర్ణయం మాత్రమే సరిపోదు.

పరాశర మహర్షి దృష్టిలో భావాధిపత్యము అత్యంత ముఖ్యము. ఒక గ్రహము సహజ శుభగ్రహము అయినా దుష్ఠస్థానాధిపతి అయితే తన దశలో కొంత కష్టఫలితములను కూడా ఇస్తాడు. అలాగే సహజ పాపగ్రహము అయినా యోగకారకుడైతే విశేష అభివృద్ధిని కలిగించగలడు.

Advertisement

దశానాథుడు ద్వితీయ లేదా ఏకాదశ స్థానములతో సంబంధము కలిగినచో ధనలాభములు అధికమవుతాయి. పంచమ, నవమ సంబంధము కలిగినచో భాగ్యవృద్ధి, పుణ్యకార్యములు, గురుకటాక్షము కలుగును. దశమ సంబంధము ఉన్నచో ఉద్యోగము, పదవి, కీర్తి అభివృద్ధి చెందును.

ఇంకొక ముఖ్యమైన రహస్యం దశానాథుని నుండి భావ పరిశీలన. ఉదాహరణకు గురు మహాదశ నడుస్తున్నదనుకొంటే గురువునే తాత్కాలిక లగ్నముగా తీసుకొని అతని నుండి భావములను పరిశీలించవలెను. ఈ విధానముతో అనేక సూక్ష్మ ఫలితములు తెలుస్తాయి.

పరాశర సంప్రదాయంలో దశాఫల నిర్ణయానికి నవాంశ చక్రము అత్యంత ముఖ్యమైనది. రాశి చక్రములో బలముగా కనిపించే గ్రహము నవాంశములో బలహీనుడైతే ఫలితములు తగ్గిపోవచ్చు. అందువల్ల నవాంశ పరిశీలన లేకుండా దశాఫల నిర్ణయము అసంపూర్ణమని ఆచార్యులు పేర్కొన్నారు.

గురు మరియు శని గోచారములు దశాఫలములను వేగవంతము చేయగలవు లేదా ఆలస్యము చేయగలవు. అందుకే పరాశరులు దశ మరియు గోచారములను పరస్పర అనుసంధానముతో పరిశీలించవలెనని బోధించారు.

ముఖ్యమైన సూత్రము

దశానాథుడు ఏది వాగ్దానం చేశాడో, గోచారం దానిని అమలుచేస్తుంది. అందువల్ల దశ లేకుండా గోచారం ఫలించదు; గోచారం లేకుండా దశ పూర్తిగా వికసించదు. ఇదే దశాఫల నిర్ణయంలో మహర్షులు బోధించిన గంభీరమైన రహస్యాలలో ఒకటి.


మరిన్ని జ్యోతిష విషయములకు సంప్రదించండి:- 098661 93557

చింతా గోపిశర్మ సిద్ధాంతి
పెద్దాపురం – 533437
సెల్ : 9866193557