చమత్కార పద్యం – హనుమంతుని గాథ పంచభూత రూపంలో

ఇది ఒక అజ్ఞాతకవి రచించిన కంద పద్యం – భావాన్ని పంచభూతాలతో అన్వయించి అర్థం చేసుకోవాల్సిన అద్భుత విజ్ఞానవంతమైన రచన
పద్యం:
అంచిత చతుర్ధ జాతుడు
పంచమ మార్గమున నేగి ప్రధమ తనూజన్
గాంచి, తృతీయం బక్కడ
నుంచి, ద్వితీయంబు దాటి నొప్పుగ వచ్చెన్!!
భావం:
గొప్పవాడైన నాల్గవ వాని కుమారుడు, ఐదవ మార్గం ద్వారా వెళ్లి, మొదటి దానికీ కుమార్తెను చూసి, మూడవ దానిని అక్కడ ఉంచి, రెండవ దానిని దాటి వచ్చెను...
ముందుగా చూస్తే ఏమాత్రం అర్థం కానట్టు అనిపిస్తుంది. కానీ దీన్ని పంచభూతాలు అనే భావంతో అన్వయించుకుంటే అర్థం అద్భుతంగా తేలుతుంది:
పంచభూతాలు:
భూమి – ప్రధమ తనూజ (భూమిపుత్రి సీత)
నీరు – ద్వితీయము (సముద్రం)
అగ్ని – తృతీయము (లంకకు నిప్పు పెట్టినది)
వాయువు – చతుర్థ జాతుడు (వాయుపుత్రుడు హనుమంతుడు)
ఆకాశం – పంచమ మార్గము (ఆకాశ మార్గం)
అర్థం:
వాయుపుత్రుడైన హనుమంతుడు, ఆకాశమార్గం ద్వారా ప్రయాణించి, భూమిపుత్రిగా గుర్తించబడిన సీతను దర్శించి, లంకకు నిప్పు పెట్టి, సముద్రాన్ని దాటి తిరిగి వచ్చాడన్నది ఈ పద్యంలో చమత్కారంగా నిగూఢంగా చెప్పబడింది.
ఇలాంటి పద్యాలే తెలుగుభాషలో గాఢత, గంభీరత, చమత్కారాన్ని నిలుపుతాయి. అజ్ఞాతకవికి హృదయపూర్వక నమస్సుమాంజలి.
