నేనే కామాక్షి: కంచి పరమాచార్య స్వామివారి దివ్య దర్శన అనుభవం

పరమాచార్య స్వామివారు మకాం చేసిన ఊర్లో ఉన్న ఒకావిడకి స్వామివారంటే అనన్యమైన భక్తిప్రపత్తులు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆవిడ తరచూ ఇంటినుండి బయటకు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండేది కాదు. ఒకరోజు ఎలాగో ఇంటినుండి బయటకు వచ్చి మహాస్వామి వారు బస చేసిన చోటికి వచ్చింది.

అది మద్యాహ్న సమయం. పూజావేదిక పైనుండే కూర్చుని పరమాచార్య స్వామివారు భక్తులతో మాట్లాడుతున్నారు. ఈమె చేతిలో హారతి పళ్ళెంతో మహాస్వామి వారి దగ్గరకు వెళ్ళి హారతివ్వడానికి స్వామివారికేసి చూసింది. వెంటనే స్వామివారు ముఖాన్ని మరోవైపుకు తిప్పుకున్నారు. రెండు మూడు సార్లు ప్రయత్నించినా పరమాచార్య స్వామివారు ఆమెకు వారి ముఖ దర్శనం ఇవ్వలేదు.

ఆవిడకు చాలా బాధవేసింది. మహాస్వామివారు తన వైపు తిరిగినట్టనిపించి హారతిపళ్ళెంలో కర్పూరాన్ని వెలిగించింది. ముందుకు వెళ్ళి హారతి ఇచ్చే లోపల స్వామివారు లేచి లోపలికి వెళ్ళిపోయారు. ఆవిడ నిచ్చేష్టురాలై మనసులో “అమ్మా అంబికా! ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నేను చేసిన పాపం ఏమిటి?” అని రోదించసాగింది. తరువాత తమాయించుకొని “సరే! నేను ఈ హారతిని నీకే సమర్పిస్తాను” అని పూజా వేదికపైన ఉన్న త్రిపురసుందరి అమ్మవారికి హారతిచ్చి చాలా నిరాశతో ఇంటికి వెనుతిరిగింది.

ఆ పందిరి నుండి బయటకు రాగానే, ఒకరు ఆవిడ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, “అమ్మా! పెరియవ నిన్ను పిలుస్తున్నారు” అని చెప్పాడు. “నన్ను పిలుస్తున్నారా? నన్ను కాదేమో” అని సంశయంగా చెప్పింది. “అవును అమ్మా మిమ్మల్నే. లోపలికి రండి” అని చెప్పాడు. అనుమానంగా లోపలికి వెళ్ళింది. వేదికపైన కూర్చున్న మహాస్వామి వారు ఆవిడతో, “నాకు ఇవ్వాల్సిన హారతి అమ్మవారికి ఇచ్చానని ఏమి మధనపడకు. ఇప్పుడు నాకు హారతి ఇవ్వు” అని చెప్పారు.

ఉద్వేగంతో కర్పూరాన్ని పళ్ళెంలో పెట్టింది. చేతులు వణుకుతుండగా కర్పూరాన్ని వెలిగించింది. కొద్దిగా ధైర్యము తెచ్చుకుని స్వామివారి ముందుకు వెళ్ళి హారతి ఇస్తూ మహాస్వామి వారి ముఖంలోకి చూసింది. ఆవిడ కళ్ళకి మహాస్వామి వారు ఒకచేతిలో చెరుకు విల్లుతో, మరొక చేతిలో పరాంకుశముతో మందస్మితయై సాక్షాత్ కామాక్షి అమ్మవారిలాగా కనపడ్డారు. స్వామివారిని అలా చూడగానే ఆవిడ గట్టిగా లెంపలేసుకుంటూ భక్తితో “అమ్మా! అమ్మా!” అని అరవసాగింది. వేదికపైన ఉన్న కామాక్షి, పరమాచార్య స్వామివారు ఒక్కటే అన్న విషయం ఈ సంఘటన వల్ల మనకు తెలుస్తుంది.

Advertisement

--- నాగలక్ష్మి, తిరుచ్చి. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2

KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

తరచుగా అడిగే ప్రశ్నలు

'నేనే కామాక్షి' సంఘటనలో భక్తురాలికి ఏం జరిగింది?

ప్రచారంలో ఉన్నట్లుగా, హారతి ఇవ్వడానికి వచ్చిన భక్తురాలి వైపు స్వామివారు ముఖం తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత ఆమెను పిలిపించి హారతి తీసుకున్నప్పుడు స్వామివారు ఆమెకు సాక్షాత్ కామాక్షి అమ్మవారిలా కనపడ్డారు.

స్వామివారు ముఖ దర్శనం ఇవ్వనప్పుడు భక్తురాలు ఏం చేసింది?

బాధతో అంబికను మనసులో ప్రార్థించి, ఆ హారతిని పూజా వేదికపైన ఉన్న త్రిపురసుందరి అమ్మవారికి ఇచ్చి నిరాశతో ఇంటికి వెనుతిరిగింది.

పరమాచార్య ఆమెను తిరిగి పిలిపించి ఏమన్నారు?

"నాకు ఇవ్వాల్సిన హారతి అమ్మవారికి ఇచ్చానని ఏమి మధనపడకు. ఇప్పుడు నాకు హారతి ఇవ్వు" అని మహాస్వామి వారు చెప్పారు.

హారతి ఇస్తున్నప్పుడు పరమాచార్య ఆమెకు ఎలా కనిపించారు?

ఒక చేతిలో చెరుకు విల్లు, మరొక చేతిలో పరాంకుశముతో మందస్మితయై సాక్షాత్ కామాక్షి అమ్మవారిలా కనపడ్డారు. ఆమె లెంపలేసుకుంటూ "అమ్మా! అమ్మా!" అని అరవసాగింది.

ఈ దర్శన అనుభవం ఏం తెలియజేస్తుంది, ఎవరు పంచుకున్నారు?

భక్తుల విశ్వాసం ప్రకారం కామాక్షి అమ్మవారు, పరమాచార్య స్వామివారు ఒక్కటే అని ఈ సంఘటన తెలియజేస్తుంది. దీనిని తిరుచ్చికి చెందిన నాగలక్ష్మి 'మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2'లో పంచుకున్నారు.