భర్త జీవించినంత కాలం భార్య జీవిస్తే – మగవాడికిది ఓ వరం! 🌷

ఇది తెలుసు కాబోలు మన పూర్వీకులు – అందుకే భార్యాభర్తల మధ్య కొంత వయసు తేడా ఉండేలా జాగ్రత్త పడ్డారు. సహజంగా ఆడవాళ్ళు భర్త చేతుల మీదుగా ఆఖరి శ్వాస విడిచే ఆశతో జీవిస్తారు. కానీ ఈ కాలంలో మనుషుల మధ్య సంబంధాలు ఆర్థిక లావాదేవీలుగా మారిపోతున్నాయ్. అందుకే కొందరు పురుషులు కూడా “నేను భార్య చేతుల మీదుగా పోవాలి” అనే కోరిక కలిగించుకుంటున్నారు.
సాధారణంగా పురుషులు వయస్సులో పెద్దవారు కావడంతో, భార్య కన్నా ముందుగా మరణించడానికి వారు సిద్ధంగా ఉంటారు. కానీ…
తన కన్నా చిన్నదైన భార్య ముందుగా మరణిస్తుందన్న భావన పురుషుల్లో ఉండదు!
ఈ అనూహ్య వాస్తవం, వారు భార్య మరణాన్ని తట్టుకోలేక కృంగిపోవడానికి ఒక కారణం అవుతుంది.
భార్యలను హాస్యంగా తక్కువగా మాట్లాడతాం, కోపంగా అరుస్తాం, అలిగిపోతాం, తిడతాం.
కానీ ఆమె శాశ్వతంగా దూరమైనప్పుడు…
ఆ లోటు భర్తకు తట్టుకోలేనిది.
ఆమె లేని జీవితం –
ఒక మోడువారిన చెట్టు లాంటిది.
అడగకుండానే అన్నీ చూసుకునే భార్య విలువ ఆమె లేని తర్వాతే తెలుస్తుంది.
మనసులో మాట చెప్పుకునే తోడు లేక, బంధువుల మధ్య ఒంటరితనం వెంటాడుతుంది.
అంతలోనే శారీరకంగా కూడా క్షీణత మొదలవుతుంది.
ఒక భార్య గుండె లోతుల్లో ఏముంటుందో తెలుసా?
“నేను ముందు పోతే పసుపు, కుంకుమ మిగుల్తాయి. కానీ నా భర్త ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. దేవుడా, ముందుగా ఆయన్ని తీసుకెళ్లు, ఆ తర్వాత నా సంగతి చూడు” అని ప్రార్థించే ఆలోచన ఆమెకుంటుంది!
“నాకు మీ మావయ్యంటే చచ్చేంత ఇష్టం…
ఆయన మాట నెరవేరకపోయినా, కోరిక తీరకపోయినా, నా ప్రాణం పోతుంది!
చీకటంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం…
నేను లేనప్పుడు ఆయన్ని ధైర్యం చెప్పేది ఎవరు?”
అర్ధరాత్రి ఆకలేస్తే, ఎవరు రొట్టెలు, కందళ్లు, పొంగలి చేసి పెడతారు?
ఇవి “మిథునం” చిత్రంలో బుచ్చిలక్ష్మి పాత్రలో ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన భావోద్వేగాలు — నటుడు తనికెళ్ల భరణి ప్రదర్శించిన అద్భుతం.
జీవితంలోని నిజ సంఘటనలు చెప్పే ఉదాహరణలు:
🎭 నటుడు రంగనాథ్ – తన భార్య నడుం విరిగి మంచాన పడిన తర్వాత పద్నాలుగేళ్లపాటు సేవలందించారు. ఆమె మరణం తట్టుకోలేక 2015లో ఉరివేసుకుని తాను కూడా చనిపోయారు.
🎨 చిత్రకారుడు బాపు – తన భార్య భాగ్యవతి మరణానంతరం ఏడాదిన్నరలోనే తుదిశ్వాస విడిచారు.
వాస్తవం ఏమిటంటే…
భార్యల్ని కొంతమంది తక్కువగా చూస్తారు.
“ఆమె నా మీద ఆధారపడుతుంది” అని భావిస్తారు.
కానీ వాస్తవానికి పురుషులు –
తమకు తెలియకుండానే – భార్య మీద మానసికంగా పూర్తిగా ఆధారపడిపోతారు.
అందుకే భార్య మరణం అనగానే వారి జీవితం గందరగోళంగా మారిపోతుంది.
అదే సమయంలో స్త్రీలు భర్త లేకపోయినా ధైర్యంగా ముందుకు సాగిపోతారు.
తండ్రిగా, తల్లిగా – ఆమెలో రెండు జీవితాలు కలిసిపోతాయి.
ఆమె చిన్ననాటి నుంచి బాధ్యతలకు అలవాటు పడిపోయే గుణం వల్లే – తనని తానే నిలబెట్టుకుంటుంది.
ఆమె తలుపులు చూసుకుంటుంది, మందులు వేసుకుంటుంది, పనులు చేస్తుంది – తన కోసం కాదు –
తన భర్త కోసం, తన పిల్లల కోసం.
🌷 స్త్రీ భావోద్వేగ బలం కల గుణవతి!
పురుషుడు శారీరక బలంతో ఉంటే, స్త్రీ మానసిక బలం, ధైర్యంతో జీవిస్తుంది.
ఇంట్లో ఆమె ‘రిమోట్ కంట్రోల్’ – ఎప్పుడు ఏ బటన్ నొక్కాలో ఆమెకే తెలుసు.
అందుకే…
“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః”
(ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో, అక్కడ దేవతలు నివసిస్తారు)
ప్రతి భర్తకు భార్య దేవత స్వరూపం!
భర్త తనువు చాలించినా – భార్య తనువు తేలిపోతుంది – కానీ మనసు మాత్రం పిల్లల కోసం బలంగా నిలబడుతుంది.
ఇది ఓ చిన్న నివాళి –
ఆమె ప్రేమకు, త్యాగానికి, సహనానికి, భర్త పట్ల ఉన్న ఆప్యాయతకు.
అభివందనం ఆ అమృతరూపిణికి 🌷