సర్వం శ్రీకృష్ణార్పణం: మూడు త్యాగాల అర్థం & ఫలం (భగవద్గీత సారం)
"సర్వం శ్రీకృష్ణార్పణమస్తు" — భగవద్గీత బోధించిన కర్తృత్వ త్యాగం, ఫల త్యాగం, సంగ త్యాగం అనే మూడు త్యాగాల అర్థం, ఆచరణ విధానం & మోక్షమార్గ ఫలం.

"సర్వం శ్రీకృష్ణార్పణమస్తు" — భగవద్గీత బోధించిన కర్తృత్వ త్యాగం, ఫల త్యాగం, సంగ త్యాగం అనే మూడు త్యాగాల అర్థం, ఆచరణ విధానం & మోక్షమార్గ ఫలం.
ఏదో ఒక కర్మ చేయకుండా ఏ ప్రాణీ ఉండలేదు. మంచి పనులు చేస్తే కీర్తి, ప్రతిష్ఠలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు; చెడ్డ పనులు చేస్తే చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు. ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలను అనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జన్మమరణ సంసార చక్రంలో ఉండిపోవలసిందేనా? లేక మోక్షం పొందే మార్గం ఉందా? — ఈ సందేహాన్ని తొలగించడానికే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు.
"అర్జునా! నువ్వు ఏ పని చేసినా, ఏది తిన్నా, ఏ హోమం చేసినా, ఎవరికి ఏది ఇచ్చినా, ఏ తపం చేసినా — అదంతా నాకు సమర్పించు."
ఈ సలహా పాటిస్తే మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది.
1. కర్తృత్వ త్యాగం
"ఈ పని నేనే చేస్తున్నాను / చేయిస్తున్నాను" అనే అహంకారాన్ని వదలాలి. ఏ కర్మనైనా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి; ప్రతిదీ భగవత్పరంగా చేయాలి. ఇలా చేస్తే పాపపు పనులు చేయడానికి జంకుతాము; కర్మసాక్షి అయిన భగవానుని స్మరిస్తూ సదా సత్కార్యాలకు పూనుకుంటాము.
2. ఫల త్యాగం
ఏం చేసినా "ఇది నా కర్తవ్యం" అని చేయాలి; "ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది" అనే కోరికతో కాదు. నేనేం చేసినా దాని ఫలం భగవానునిదే — అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి.
3. సంగ త్యాగం
"ఇది నాది, ఇది నేనే చేయాలి, అంతా నా ఇష్టప్రకారం జరగాలి, ఇది నా ఆనందం కోసం" అనే బంధాన్ని పెంచుకోవద్దు. అంతా భగవన్ముఖ వికాసం కోసమే; ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా భావించాలి.
ఈ త్రివిధ త్యాగాలు ఎలా చేయాలి?
ఏ పని చేసినా — ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెబితే చాలు:
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
Advertisement
ఈ మూడు త్యాగాలను త్రికరణశుద్ధిగా (మనసా, వాచా, కర్మణా) అవలంబించాలి. అప్పుడు కర్మ బంధం తొలగి, చిత్తశుద్ధి కలిగి, క్రమంగా మోక్షమార్గం సుగమమవుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
"కృష్ణార్పణం" అంటే ఏమిటి?
మనం చేసే ప్రతి కర్మను — దాని కర్తృత్వాన్ని, ఫలాన్ని, దానిపై మమకారాన్ని — శ్రీకృష్ణునికి సమర్పించడమే కృష్ణార్పణం. ఇది భగవద్గీత బోధించిన కర్మయోగ సారాంశం.
కృష్ణార్పణం వల్ల ఫలం ఏమిటి?
కర్తృత్వ – ఫల – సంగ త్యాగాల ద్వారా అహంకారం, కోరిక, మమకారం తొలగి, కర్మ బంధం నశించి, చిత్తశుద్ధితో మోక్షమార్గం సుగమమవుతుంది.
కృష్ణార్పణం 🙏 · సమస్త లోకాః సుఖినో భవంతు



