మనసులో ఉన్న దేవుడికి సేవ చేయడం – హుండీ కంటే హృదయం విలువైంది

దేవుడికి హుండీలో డబ్బులు వేయడం ద్వారా మనం మనం చేసిన మొక్కులు తీరతాయని అనుకుంటాం. కానీ చాలా మంది దేవాలయాల హుండీలలో నిధులు వేస్తూ, అసలు దేవుడిని – ఆత్మస్వరూపుని – మనం అనుకోకుండా దూరం చేస్తూ ఉంటాం. అలాంటి వారికి అర్థమయ్యేలా ఒక సార్ధకమైన చిన్న కథ.
సుదర్శన్ అనే వ్యక్తి గొప్ప దైవభక్తుడే కాక, ధర్మమార్గాన నడిచే వ్యక్తి. “మానవ సేవే మాధవ సేవ” అనే వాక్యాన్ని తన జీవన సూత్రంగా నమ్మినవాడు. ఒక రోజు శ్రీవారి దర్శనానికి తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగం చేస్తున్న కార్యాలయంలో తన యజమానిని కలిసి, “రేపు నుండి రెండు రోజులు సెలవు కావాలి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాను” అని అన్నాడు.
అప్పుడు యజమాని అతని భక్తిని గమనించి, “ఈ వంద రూపాయలు తీసుకో, స్వామి వారి హుండీలో వేసేయి” అని డబ్బులు ఇచ్చాడు.
సుదర్శన్ ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్లి, అక్కడి నుంచి రైల్వే స్టేషన్ చేరాడు. ట్రైన్ ఎక్కడానికి లోపలికి వెళ్తుండగా, ఒక వృద్ధురాలు దగ్గరకి వచ్చి, “బాబు… రెండు రోజులు అన్నం తినలేదు, దయచేసి ఏదైనా తినిపించు” అని వేడుకుంది.
తన నమ్మకానికి కట్టుబడి – మానవ సేవే మాధవసేవ అనే నమ్మకంతో – సుదర్శన్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ వంద రూపాయలతో ఆమెకు భోజనం కొనిచ్చి, తరువాత ట్రైన్ ఎక్కాడు.
ఆ రాత్రే యజమానికి కలలో శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనమిచ్చి,
“నువ్వు పంపిన డబ్బులు నాకు అందాయి” అని అన్నారు.
గాభరా చెందిన యజమాని – సుదర్శన్ ఇప్పటికీ తిరుమల చేరలేదు కదా, మరి డబ్బులు ఎలా చేరాయి? అని ఆశ్చర్యపోయాడు. వెంటనే సుదర్శన్‌ను ఫోన్ చేసి విషయం అడిగాడు. సుదర్శన్ సరళంగా సత్యం చెప్పాడు.
అప్పుడు యజమాని ఆనందంతో,
“సుదర్శన్, నీవల్లే నాకు నిజమైన శ్రీవారి దర్శనం జరిగింది. నీ మంచితనానికి భగవంతుడు నీతోనే ఉన్నాడు” అని ప్రశంసించాడు.
సారాంశం:
దేవుడికి హుండీలో డబ్బులు వేయడం కన్నా,
ప్రతి జీవిలో దేవుడిని చూడగలగడం గొప్పది.
నీవల్ల ఎవరికైనా చేయగల సహాయం చేయడం — అదే నిజమైన భక్తి.
కోటి పూజల కన్నా ఒక్క మంచి పని గొప్పది.
భగవద్గీతలో శ్రీ కృష్ణుడు అన్నట్టు: “సర్వాంతర్యామి నేనే”
అంటే ప్రతి హృదయంలో ఉన్నవాడే భగవంతుడు.
ఓం నమో నారాయణాయ 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
