☘️ కనువిప్పు కలిగించే ఒక చిట్టికథ ☘️

విజయుడు అనే రాజు "నాకంటే తెలివైన వాళ్ళెవరైనా ఉంటారా?
విజయుడు అనే రాజు "నాకంటే తెలివైన వాళ్ళెవరైనా ఉంటారా?" అని తరచూ మంత్రిని ప్రశ్నిస్తూ ఉండేవాడు. మంత్రికేమో మొహమాటం! "కాదంటే ఆయనకు ఎక్కడ కోపం వస్తుందో" అని "మీకంటే తెలివైన వారు నాకు తెలిసి ఎవ్వరూ లేరు ప్రభూ" అనేసేవాడు.
⭕అయితే ఒక రోజున రాజుగారు నిండు దర్బారులో తన గురించి గొప్పలు చెప్పడం మొదలుపెట్టారు. ఊరికే ఉండక, మంత్రిగారిని కూడా "మీరేమంటారు మంత్రిగారూ?!" అని అడగడం మొదలుపెట్టాడు..
⭕మంత్రిగారికి ఏమి అనాలో తోచలేదు. 'ఎలాగైనా రాజు గారిని ఈ అలవాటు నుంచి బయటపడేట్లు చేయకపోతే సమస్యే' అనుకున్నాడు ఆయన.
⭕ "మన రాజ్యపు పొలిమేరల్లో ఉన్న గోపాలపురంలో చాలామంది తెలివైనవారు ఉన్నారట ప్రభూ..! మీరు ఒకసారి కొంచెం సమయం తీసుకొని చూడండి- ఆ ఊరి జనాలకంటే మీరే తెలివైనవారు అని తేలిపోతే బాగుంటుంది. అలా మీ గొప్పతనం మరింత మందికి తెలుస్తుంది.. అయినా వారెవరూ మీ తెలివికి సరితూగరులెండి" అని తప్పించుకున్నాడు మంత్రి.
⭕దాంతో రాజుగారికి ఉత్సాహం ఆగలేదు. 'ఏంటి ఈ గోపాలపురం? ఏంటి వీళ్ల తెలివి? చూసొస్తాను' అని నేరుగా అక్కడికే బయలుదేరాడు.
⭕ఆయన గోపాలపురం చేరుకుంటుండగా ఊరి మొదట్లో ఉన్న గడ్డి భూముల్లో ఓ పశువుల కాపరి కనిపించాడు- ఆవుల్ని మేపుకుంటూ.
⭕"ముందు వీడిని ఓడిస్తాను… నా తెలివి ముందు వీడు ఏపాటి?" అనుకుంటూ దగ్గరికి వెళ్లాడు రాజు.
⭕"నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను. నీకు చేతనైతే జవాబు చెప్పు చూస్తాను-" అన్నాడు.
⭕పశువుల కాపరి రాజుకేసి వింతగా చూసి "సరే, అడగండి" అన్నాడు.
⭕"సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది?" అడిగాడు విజయుడు.
⭕'గాలి'…. చెప్పాడు పశువుల కాపరి.
⭕అన్నింటికంటే ఉత్తమమైన జలం?
⭕"గంగాజలం"
⭕అన్నింటిలోకి ఉన్నతమైన పాన్పు?
⭕" ఇంకేముంటుంది చందనపు కర్రతో చేసినదే"
⭕"భలే భలే! నా మనసులోనూ ఇవే జవాబులున్నాయి!" అన్నాడు విజయుడు అతడిని మెచ్చుకుంటూ.
⭕ఆ మాటలకు "హ్హ హ్హ హ్హ" అని ఎగతాళిగా, పగలబడి నవ్వాడు పశువుల కాపరి.
⭕"ఎందుకు, అంత నవ్వుతున్నావు?" అడిగాడు విజయుడు చికాకుగా.
⭕"తప్పుగా చెప్పిన జవాబుల్ని సరియైనవని మెచ్చుకుంటుంటేనూ…" అని మళ్ళీ నవ్వాడు పశువుల కాపరి.
⭕"మరి సరైన జవాబులేమిటో చెప్పు చూస్తాను" అన్నాడు విజయుడు పట్టుదలగా.
⭕"సృష్టిలో అన్నికంటే వేగవంతమైనది మనసు. ఎడారుల్లో ఎండవేళన దొరికేదే ఉత్తమ జలం, ఉన్నతమైన పాన్పు అమ్మ ఒడి…" చెప్పాడు పశువుల కాపరి.
⭕"అవును నిజమే" మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు విజయుడు.
⭕"ఇంకో సంగతి చెప్పనా?" అన్నాడు పశువుల కాపరి. "నేను ఇంతకు ముందు చెప్పిన జవాబులూ సరైనవే, ఇవి కూడా సరైనవే- ఏమంటే 'ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి' అనుకోవటంలోనే అసలు తప్పు ఉంది. ఒక ప్రశ్నకు అనేక జవాబులుండచ్చు- ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉన్నట్లే"
⭕విజయుడు నివ్వెరపోయాడు. "అవును గదా! నేను ఇలా ఆలోచించనే లేదే?! ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉండచ్చు గదా, 'అందరిలోకీ తెలివైనవాళ్ళు' అంటూ అసలు ఎందుకుండాలి?" అని ఆయన ఆశ్చర్యంలో మునిగాడు.
⭕పశువుల కాపరిని అభినందించాడు. అటుపైన ఆయన తన తెలివితేటల గురించి గొప్పలు చెప్పుకోవటం మానేశాడు!
⭕అందరిలోనూ తెలివితేటల్ని గుర్తిస్తూ, కాల క్రమేణా " మంచి రాజు - అందరినీ ప్రోత్సహిస్తాడు" అని పేరు తెచ్చుకున్నాడు.
⭕ చదివి చదివి కొంత చదువంగ చదువంగ
చదువు చదివి యింక చదువు చదివి
చదువు మర్మములను చదువలేడయ్యెను
విశ్వదాభిరామ! వినురవేమ!
⭕భావం: ఎన్ని చదువులు చదివి, ఎన్ని విద్యలు నేర్చినా, ఆత్మతత్వము తెలియని మనిషి మూర్ఖుడే కదా!~~
{మనమందరం.. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు.. ఖచ్చితంగా ఇందులోని సారాంశాన్ని అర్థం చేసుకుని మసలుకోవాలి. ఇది సేకరణే…: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు & స్టూడెంట్ మోటివేటర్
తరచుగా అడిగే ప్రశ్నలు
విజయుడు రాజు గోపాలపురానికి ఎందుకు వెళ్ళాడు?
తనకంటే తెలివైనవారు లేరని గొప్పలు చెప్పుకునే రాజు అలవాటు మాన్పించడానికి, గోపాలపురంలో చాలామంది తెలివైనవారు ఉన్నారని మంత్రి చెప్పాడు. అది చూసి రావాలని విజయుడు నేరుగా అక్కడికే బయలుదేరాడు.
రాజు పశువుల కాపరిని అడిగిన మూడు ప్రశ్నలు ఏమిటి?
సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది ఏది, అన్నింటికంటే ఉత్తమమైన జలం ఏది, అన్నింటిలోకి ఉన్నతమైన పాన్పు ఏది అని రాజు అడిగాడు. కాపరి మొదట గాలి, గంగాజలం, చందనపు కర్రతో చేసిన పాన్పు అని జవాబిచ్చాడు.
పశువుల కాపరి చెప్పిన రెండో జవాబులు ఏమిటి?
సృష్టిలో అన్నిటికంటే వేగవంతమైనది మనసు, ఎడారుల్లో ఎండవేళ దొరికేదే ఉత్తమ జలం, ఉన్నతమైన పాన్పు అమ్మ ఒడి అని కాపరి చెప్పాడు. రెండు రకాల జవాబులూ సరైనవేనని కూడా అన్నాడు.
ఈ చిట్టికథ నీతి ఏమిటి?
ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలనుకోవడమే తప్పు; ఒక రాజ్యంలో అనేకమంది తెలివైనవాళ్ళు ఉన్నట్లే ఒక ప్రశ్నకు అనేక జవాబులు ఉండొచ్చు. అందరిలోనూ తెలివితేటల్ని గుర్తించాలి, గర్వం వదలాలి.
కథ చివర ఉన్న వేమన పద్యం భావం ఏమిటి?
ఎన్ని చదువులు చదివి, ఎన్ని విద్యలు నేర్చినా, ఆత్మతత్వము తెలియని మనిషి మూర్ఖుడే అని ఆ వేమన పద్యం భావం. ఈ సారాంశాన్ని అందరూ, ముఖ్యంగా ఉపాధ్యాయులు అర్థం చేసుకుని మసలుకోవాలి.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
కథలు నుంచి మరిన్ని
- శ్రీకృష్ణుడు, గోవర్ధన గిరి కథ: అధికారంపై విశ్వాసం సాధించిన విజయం
- సులభంగా రామాయణం: దసరాకు దారితీసిన శ్రీరాముని కథ
- దీపావళి రోజున శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని ఎలా జయించాడు: వామనావతార కథ
- నిర్జల ఏకాదశి మహాత్మ్యం | భీముడు – వ్యాసమహర్షి సంభాషణ | పాండవ నిర్జల ఏకాదశి కథ
- గంగావతరణ ఫలశ్రుతి | గంగావతరణ కథ వినడం వల్ల కలిగే మహా పుణ్య ఫలితాలు




