బ్రహ్మచర్యానికి ముగింపు – గృహస్థాశ్రమ జీవనంలో అడుగుపెట్టు

బ్రహ్మచర్యం అనేది ప్రతి యువకుడు, యువతికి ఉన్న అవసరమైన దశ. అయితే ఆ దశకి పూర్ణవిరామం పలుకుతూ, జీవనయానం నూతన మలుపు తిప్పే ఘట్టమే వివాహం. ఇది బాలుడిని గృహస్థుడిగా, బాలికను గృహిణిగా మార్చే శాస్త్రోక్త మార్గం.
వివాహం తప్పనిసరి
దేవుడు సృష్టించిన పురుష, స్త్రీ మధ్య మనస్సు, వాక్కు, కర్మగా ఒకటవాల్సిన పవిత్రమైన బంధమే వివాహం. ఇది శరీర సంబంధానికి మించిన ఒక ఆధ్యాత్మిక అనుబంధం. ప్రతి యువతి, యువకుడు ఈ దశను అనుభవించాల్సిందే. ప్రేమ, అనురాగం, అభిమానం ఉన్నప్పుడు ఈ దాంపత్య జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది.
సర్దుకుపోవడం అనే కళ
జీవితంలో ఆనందం కోరేవారు సర్దుకుపోవడంలో నైపుణ్యం కలిగి ఉండాలి. అబ్బాయి, అమ్మాయి మధ్య సరైన అవగాహన ఉంటే ఏ సమస్య అయినా అవలీలగా అధిగమించవచ్చు. రాజీపడే తత్వం, వినయం, పరస్పర గౌరవం ఉంటే దాంపత్యం తియ్యగా మారుతుంది.
మనసుతో మాట్లాడే జీవితం
పులకించే హృదయం ఉంటే, మొగుడు-పెళ్లాం మధ్య ప్రతి మాటా, ప్రతి స్పర్శా మధురమే. డబ్బు గొడవలు, అహంకారపు మాటలు, జాతకాలకు అతితెలివి చూపడం వంటి దుష్ప్రవర్తనలను తక్కువ చేస్తే యువతికి సరైన వయస్సులో వివాహం జరగడం అసాధ్యం కాదు.
యౌవనం కి నిదర్శనం – ఆకర్షణ
అమ్మాయిని చూస్తే అబ్బాయికి, అబ్బాయిని చూస్తే అమ్మాయికి ఆసక్తి కలగడం సహజం. అది ప్రకృతి సృష్టి. దీన్ని చట్టబద్ధం చేసి సురక్షితమైన బంధంగా మార్చేది వివాహబంధం.
యువతకు పిలుపు
ప్రియమైన యువతీ, యువకులారా! మీరు వివాహానికి సిద్ధపడండి. దేశాభివృద్ధిలో, జనాభా సమతుల్యతలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. ప్రేమతో, బాధ్యతతో జీవితం నిర్మించండి.
– బి మల్లికార్జున దీక్షిత్
ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
