స్వామి వారు ఎలా ఉన్నారు? – ప్రొఫెసర్ రాబిన్సన్కు కంచి మహాస్వామి దివ్యానుభవం
స్వామి వారు ఎలా ఉన్నారు? ప్రొఫెసర్ రాబిన్సన్ అమెరికాలో ఉన్న సౌత్ కరోలినా విశ్వవిద్యాలయం అధ్యక్షుడు.
స్వామి వారు ఎలా ఉన్నారు?
ప్రొఫెసర్ రాబిన్సన్ అమెరికాలో ఉన్న సౌత్ కరోలినా విశ్వవిద్యాలయం అధ్యక్షుడు. ఆయన గ్రీకు తత్వ శాస్త్రంలో దిట్ట. అమెరికాలోని కొన్ని విశ్వవిద్యాలయాల నుండి వివిధ శాఖలకు సంబంధించిన అచార్యులు ఒకమారు చెన్నై వచ్చారు.
నేను రాబిన్సన్ తో, “మీరు ఒకమారు తప్పకుండా కంచి వెళ్ళి మహాస్వామి వారి దర్శనం చేసుకోవాలి” అని అన్నాను. అంతే!! అతని కళ్ళు ఆనందంతో వికసించాయి. ఆరోజే అతని కంచి యాత్రా విశేషాలను నాకు చెప్పాడు. అందరూ చిన్న చిన్న గుంపులుగా కంచి మొత్తం తిరగడం ప్రారంభించారు. కాని వారికి శంకరమఠం కాని పరమాచార్య స్వామివారు కాని తెలియదు.
రాబిన్సన్ మరియు అతని ఇద్దరు మిత్రులు అనుకోకుండా శ్రీమఠం ప్రవేశద్వారం వద్దకు వచ్చారు. వారు అది ఒక దేవాలయం అనుకుని లోపలికి వెళ్ళారు. తరువాత జరిగిన విషయాలు అతని మాటల్లోనే.
రాబిన్సన్ అనుభవం
”అది తాళ్ళతో అల్లిన మంచం. దానిపైన చాలా వయసైపోయిన వారు ఒకరు కూర్చుని ఉన్నారు. వారి చుట్టూ చాలామంది జనం ఉన్నారు. మాకు ఏమి అర్థం కాలేదు. హఠాత్తుగా ఒక పిల్లవాడు మావద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, ‘మీరు అమెరికా నుండి వచ్చారా?’ అని అడిగాడు.
అతని ప్రశ్నకు మేము ఆశ్చర్యపోయాము ఎందుకంటే అక్కడ ఉన్న ఎవరికి మాగురించి తెలిసే అవకాశమే లేదు. మేము అతనితో అవును అని చెప్పాము. తరువాత ఆ అబ్బాయి వేసిన ప్రశ్న మమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ‘మీలో ప్రొఫెసర్ రాబిన్సన్ ఎవరు? అతణ్ణి తీసుకురావల్సిందిగా స్వామి వారు నన్ను ఆదేశించారు’ అని చెప్పాడు”
“నేను మహాస్వామి వారిని దర్శించుకున్నాను. వారు నన్ను దగ్గరగా కూర్చోమన్నారు. అంతే!! నాకు బాహ్యస్మృతి పోయింది. అక్కడి నుండి ఎప్పుడు బయటకు వచ్చానో కూడా తెలియదు” కళ్ళల్లో ఆనందభాష్పాలు కారుతుండగా కంఠం గాద్గదికమై రాబిన్సన్ ఇక మాట్లాడలేకపొయాడు.
తరువాత జరిగిన సంఘటన
[ఇదే రాబిన్సన్ మే 1994న చెన్నైలోని అమెరికన్ ఎంబసికి వచ్చినప్పుడు డా. పద్మా సుబ్రమణ్యంకు ఫోను చేసి “మహాస్వామి వారు ఎలా ఉన్నారు?” అని విచారించాడు. మహాస్వామి వారు విదేహముక్తులయ్యారు అని చెప్పగానే, “ఆరోజు జనవరి ఎనిమిదా? లేదా తొమ్మిదా?” అని అడిగాడు. ”నీకు అంత ఖచ్చితంగా ఎలా తెలుసు?” అని పద్మగారు అడిగారు.
రాబిన్సన్ ఉద్వేగంతో, “ఆ రోజు మహాస్వామి వారు నాకు సాకారరూపంలో దర్శనం ఇచ్చారు. మూడుసార్లు ‘గుడ్ బై’ చెప్పి అదృశ్యమయ్యారు. అక్కడివారితో నేను ఈ విషయం చెప్తే వాళ్ళకు అర్థంకాదు కనుక నేను ఈ విషయాన్ని ధృవపరచుకోలేదు” అని చెప్పాడు.]
మూలం
--- డా. పద్మా సుబ్రమణ్యం, ‘నృత్యోదయ’ చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2
శ్లోకం
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఛానల్
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

