A.V.B. సుబ్బారావు శర్మ గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో


Advertisement

వశిష్టుడు చెబుతున్నాడు –

ఓ రాజా! కార్తీకమాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము.
ఆ మాసములో స్నాన, దాన, వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము.

ఎవరు కార్తీకమాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో, అట్టి వారు రౌరవాది నరకబాధలు పొందుదురు.
ఈ నెల దినములలో తాంబూలదానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు.

Advertisement

నెలరోజులలో ఏ ఒక్కరోజు విడువకుండ తులసి కోటవద్దగాని, భగవంతుని సన్నిధిలోగాని దీపారాధన చేసిన యెడల,
సమస్త పాపములు నశించి వైకుంఠప్రాప్తి కలుగును.

కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీస్నానమాచరించి,
భగవంతుని సన్నిధిలో ధూప దీప నైవేద్యములతో, దక్షిణా తాంబూలాదులు, నారికేళ ఫలదానము చేసిన యెడల —
చిరకాలమునుండి సంతతి లేనివారికి పుత్రసంతానము కలుగును.

సంతానము ఉన్న వారు చేసినచో సంతాన నష్టము జరుగదు;
పుట్టిన బిడ్డలు చిరంజీవులై యుందురు.

Advertisement

ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపమును నింపిన వారు వైకుంఠములో సకల భోగములు అనుభవింతురు.
కార్తీకమాసమంతయు ఆకాశ దీపముగాని, స్తంభ దీపముగాని వుంచి నమస్కరించిన స్త్రీపురుషులకు
సకల ఐశ్వర్యములు కలిగి, వారి జీవితము ఆనందదాయకమగును.

ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యముగాని, నువ్వులుగాని ప్రమిద అడుగున పోసి దీపమును వెలిగించవలెను.
దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టనివారు, లేదా దీపము పెట్టువారిని పరిహసించువారు
చుంచుజన్మమునే పొందుదురు.

ఇందులకొక కథ కలదు — చెప్పెదను, వినుము.


దీప స్తంభము విప్రుడగుట

Advertisement

ఋషులలో అగ్రగణ్యుడైన మంతగ మహాముని ఒక చోట అశ్రమమును స్థాపించి, దానికి సమీపములో ఒక విష్ణు మందిరమును నిర్మించి
నిత్యము పూజలు చేయుచుండెను.

కార్తీకమాసములో ఆ యాశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడ వచ్చి పూజలు చేయుచుండిరి.
వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి, కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్లుచుండిరి.

ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి ఇలా పలికెను —
“ఓ సిద్దులారా! కార్తీకమాసములో హరిహరాదుల ప్రీతికోసం స్తంభదీపము నుంచినచో
వైకుంఠప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా!

రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతికోసం ఈ ఆలయానికెదురుగా
ఒక స్తంభముపాతి దానిపై దీపమును పెట్టుదాము. కావున మనమందరం అడవికి వెళ్లి
నిడుపాటి స్తంభమును తెచ్చుకుందాము,” అని పలికెను.

అందరూ పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు లేని ఒక చెట్టును నరికి తెచ్చి, ఆలయంలో స్వామికి ఎదురు పాతిరి.
దానిపై శాలిధాన్యము పోసి, ఆవునేతితో నింపిన పాత్రను పెట్టి, వత్తివేసి దీపము వెలిగించిరి.

తరువాత పురాణపఠనము చేయుచుండగా ఫెళ్‌ఫెళ్‌మనే శబ్దము వినిపించెను.
చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి, దీపము ఆరిపోయి చెల్లాచెదురై పడియుండెను.

ఆ దృశ్యము చూచి మునులందరూ ఆశ్చర్యముతో నిలుచిరి.
అంతలో ఆ స్తంభములోనుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను.

వారతనిని చూచి ప్రశ్నించిరి —
“ఓయీ! నీవెవడవు? ఈ స్తంభములోనుండి యెలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి?”

అప్పుడు ఆ పురుషుడు నమస్కరించి చెప్పెను —
“పుణ్యాత్ములారా! నేను క్రిందటి జన్మములో బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను.
నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై, న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని.

వేదములు చదువక, శ్రీహరిని పూజించక, దానధర్మములు చేయక మెలగితిని.
నా వద్దకు వచ్చిన అతిథులను అవమానించితిని. విప్రులను నిర్లక్ష్యపరచితిని.
అహంకారంతో పాపకార్యములు చేసితిని.

దానధర్మములు చేయక చనిపోయి ఘోర నరకములు అనుభవించితిని.
తర్వాత లక్ష జన్మలు కుక్కగా, పదివేల జన్మలు కాకిగా, ఐదువేల జన్మలు తొండగా,
మరియు పేడ పురుగుగా పుట్టి, చివరికి వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందు వుండితిని.

ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా జన్మించి, ఇప్పుడు నరరూపమెత్తి జ్ఞానినైనాను.
నాకర్మలన్నియు మీకు తెలియజేసితిని. దయచేసి నన్ను మన్నించండి.”


మునులందరూ అతని మాటలు విని ఆశ్చర్యమొందిరి.
“ఆహా! కార్తీకమాసమహిమ ఎంత గొప్పది!
కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు.
కఱ్ఱలు, రాళ్లు, స్తంభములు కూడ మన కళ్లముందు ముక్తి పొందుచున్నవి,”
అని అనుకోనుచుండగా ఆ పురుషుడు నమస్కరించి అడిగెను —

“మునిపుంగవులారా! నాకు ముక్తి కలుగు మార్గమేదైనా గలదా?
ఈ జగత్తులో సకల జనులకు కర్మబంధము కలుగును; అది నశించుటెట్లు?
దయచేసి నా సంశయము తీర్చమని ప్రార్థించుచున్నాను.”

అప్పుడు అక్కడ వున్న మునిశ్రేష్ఠులు అంగీరసమునిని చూచి,
“స్వామి! మీరు అతని సంశయమును తీర్చగల సమర్థులు. దయచేసి వివరించండి,” అని కోరిరి.

అంత అంగీరసుడు ఇలా చెప్పుచున్నాడు —


ఇట్లు

స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి
షోడశాధ్యాయము — పదహారవ అధ్యాయము పారాయణము సమాప్తం.