దసరా మహర్నవమి విశిష్టత: అమ్మవారి నవరాత్రి అలంకారాలు, మహిషాసుర మర్దిని కథ
దసరా మహర్నవమి విశిష్టతపై తెలుగు భక్తి వ్యాసం: శరన్నవరాత్రులలో నవమి నాడే ప్రధాన పూజ ఎందుకు, బాలా త్రిపురసుందరి నుంచి మహిషాసుర మర్దిని, అపరాజితా దేవి వరకు అమ్మవారి అలంకారాలు, మధుకైటభులు, మహిషాసురుడు, శుంభ నిశుంభుల సంహారం, మాతృకల కథ.

దసరా మహర్నవమి విశిష్టతపై తెలుగు భక్తి వ్యాసం: శరన్నవరాత్రులలో నవమి నాడే ప్రధాన పూజ ఎందుకు, బాలా త్రిపురసుందరి నుంచి మహిషాసుర మర్దిని, అపరాజితా దేవి వరకు అమ్మవారి అలంకారాలు, మధుకైటభులు, మహిషాసురుడు, శుంభ నిశుంభుల సంహారం, మాతృకల కథ.
మహర్నవమి 2026: భారతదేశంలో మహర్నవమి సోమవారం, 19 అక్టోబర్ 2026; విజయదశమి మంగళవారం, 20 అక్టోబర్ 2026 (దృక్ పంచాంగం). బెంగాల్లో దుర్గా పూజ మహా నవమి మంగళవారం, 20 అక్టోబర్. పూజా సమయాలు, రెండు తేదీల వివరణ కోసం మహా నవమి 2026: తేదీ, పూజ, విశిష్టత చూడండి.
దసరా శరన్నవరాత్రులు
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ తొమ్మిదిరోజుల పాటు దుర్గాదేవిని రోజుకొక అలంకారంలో పూజిస్తూ జరుపుకునే పండుగ. దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. తొమ్మిదిరోజులు జరుపుకునే పండుగ. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. అందులోనూ అమ్మవారిని పూజిస్తూ చేసే పండుగ కావడంతో.. శరన్నవరాత్రులు, దేవీనవరాత్రులు అని పిలుస్తారు. పదవ రోజు విజయదశమి. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. దసరా లోనూ బొమ్మలకొలువులు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
మహర్నవమి విశిష్టత: నవమి నాడే ప్రధాన పూజ ఎందుకు?
తొమ్మిదవ తిథిని 'మహర్నవమి' లేదా 'మహా నవమి' అంటారు. దేవీ ఉపాసనలో ఈ రోజుకు అత్యున్నత స్థానం ఉంది. సంప్రదాయం ప్రకారం, నవరాత్రులలో ప్రధాన పూజ అంతా నవమి రోజే జరుగుతుంది, పదవ రోజైన విజయదశమి నాడు కేవలం పునఃపూజ, ఉద్వాసన మాత్రమే నిర్వహిస్తారు. తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించటమంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం. నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం. తొమ్మిది రోజుల దీక్ష వలన పదవరోజు విజయం లభిస్తుంది. అంటే తొమ్మిది రోజుల దీక్షకు ఫలం లభిస్తుంది. కనుక పదవ రోజును ‘విజయదశమి‘ పేరిట పండుగ జరుపుకుంటాము.
మహిషాసురమర్దిని రూపంలో అలంకరించి పూజిస్తారు. లోక కంటకుడైన మహిషాసురుడనే రాక్షసుడితో అమ్మవారు తొమ్మిది రాత్రుల పాటు సుదీర్ఘంగా యుద్ధం చేసి, ఈ నవమి రోజే అతడిని సంహరించి విజయం సాధించింది. అందుకే అమ్మవారి శక్తి ఈ రోజున అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని భక్తుల నమ్మకం.
జగన్మాత అనంత నామాలు
జగన్మాత ఆదిపరాశక్తి గొప్పదనాన్ని, మహిమను గురించి, దేవీ భాగవతం, మార్కండేయ పురాణం మొదలైన అనేక పురాణాలు, ఉపనిషత్తులు వివరిస్తాయి, త్రిపురా రహస్యంలో విపులమైన వివరణ కనిపిస్తుంది. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలందుకుంటోంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గ, పార్వతి, హైమవతి, అపరాజిత, భవాని, లలిత, జయంతి, మంగళ, భద్రకాళి, కాపాలిని, క్షమా, శివదూతి, స్వాహా, స్వధా, చాముండి, విష్ణుపత్ని, ఈశ్వరి ఇటువంటి అనేకమైన నామాలతో ఆరాధనలందుకుంటోంది.
నవరాత్ర వ్రతం: అమ్మవారి పది అలంకారాలు
మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృత పరిచే, దైవ అనుగ్రహంతో, మంత్ర శక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృత పరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం. అందుకే దసరా నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజులు ఈ జగన్మాతను బాలా త్రిపురసుందరిగా, గాయత్రీ మాతగా, అన్నపూర్ణాదేవిగా, శ్రీ మహాలక్ష్మి దేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా, సప్తమి రోజున శ్రీ మహా సరస్వతీ దేవిగా, అష్టమి నాడు దుర్గామాతగా, నవమి నాడు మహిషాసుర మర్దినిగా, దశమినాడు జయా విజయా సహిత అపరాజితా దేవిగా – రాజరాజేశ్వరీ దేవిగా ఆరాధిస్తాం.
| రోజు (తిథి) | అమ్మవారి అలంకారం |
|---|---|
| 1వ రోజు (పాడ్యమి) | బాలా త్రిపురసుందరి |
| 2వ రోజు (విదియ) | గాయత్రీ మాత |
| 3వ రోజు (తదియ) | అన్నపూర్ణాదేవి |
| 4వ రోజు (చవితి) | శ్రీ మహాలక్ష్మి దేవి |
| 5వ రోజు (పంచమి) | శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి |
| 6వ రోజు (షష్ఠి) | శ్రీ రాజరాజేశ్వరీ దేవి |
| 7వ రోజు (సప్తమి) | శ్రీ మహా సరస్వతీ దేవి |
| 8వ రోజు (అష్టమి) | దుర్గామాత |
| 9వ రోజు (నవమి) | మహిషాసుర మర్దిని |
| 10వ రోజు (దశమి) | జయా విజయా సహిత అపరాజితా దేవి; రాజరాజేశ్వరీ దేవి |
గమనిక: అలంకారాల క్రమం ఆలయాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంది; తిథి వృద్ధి, క్షయాల వల్ల కొన్ని రోజులు మారవచ్చు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం ప్రతి సంవత్సరం అలంకారాల షెడ్యూల్ను ప్రకటిస్తుంది; కనకదుర్గ ఆలయం గైడ్ చూడండి.
శివశక్తుల ఏకత్వం
పరమేశ్వరుని సంకల్ప శక్తి జగన్మాత. ఆ సంకల్పం వల్లే సృష్టి స్థితి లయలన్నీ జరుగుతున్నాయి. ఆదిపరాశక్తి ప్రకృతి అయితే, పరమాత్మ పురుషుడు. ప్రకృతి పురుషుల కలయిక వల్లే సృష్టి యేర్పడుతుంది. అంటే శివపార్వతుల చిద్విలాసం యావద్విశ్వం. ఈశ్వరుడని కొలిచినా, విష్ణువు అని కొలిచినా, జగన్మాత అంబిక అని కొలిచినా ఉన్న శక్తి ఒక్కటే అని మనకి ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఒక్కటిగా ఉన్న ఆ శక్తిని, చిచ్ఛక్తినే మనం అమ్మవారిగా, జగన్మాతగా ఆరాధిస్తున్నాము. చండీ సప్తశతిలో జగన్మాత మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహా సరస్వతిగా దుష్ట రాక్షసులను దునుమాడిన వైనాన్ని కీర్తించారు.
దేవీ మాహాత్మ్యం: మధుకైటభులు, మహిషాసుర మర్దిని
అమ్మవారు దేవతలకు – ఎప్పుడు దుష్ట రాక్షసుల నుంచి బాధలు కలిగినా, తాను అవతరించి, దుష్ట శిక్షణ చేస్తానని అభయమిచ్చారు. జగన్మాత, యోగ నిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును జాగృత పరిచి, మధు కైటభులనే రాక్షసులను సంహరింపజేసింది. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించగా, దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు, రుద్రుల దగ్గరికి వెళ్ళి మహిషాసురుని ఆగడాలను గురించి చెప్పారు. ఆ మాటలు వినగానే శివకేశవులకు ధర్మాగ్రహం కలిగింది. ఆ క్రోధం ఒక ఆకృతి దాల్చి, వెలుగు రూపంలో బయటకొచ్చింది. దేవతలందరి ముఖాల నుంచి తేజస్సు బయటికి వచ్చి, ఆ సమష్టి తేజస్సు ఒక మహాద్భుత రూపం దాల్చి, అష్టభుజాలతో మహాలక్ష్మీదేవిగా, ఆదిపరాశక్తిగా భాసించింది.
ఈ తల్లిని దేవతలు ‘అమ్మా! నీవే సర్వకారణభూతురాలివి, కార్య కారణ రూపిణివి, క్రియా రూపిణివి, నీవు లేనిదే ఏదీ లేదు, అంతా నీలోనే ఉంది తల్లి అంటూ కీర్తించారు. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు. కనీసం స్పందించను కూడా లేడట. శక్తి లేకపోతే, చలనం, స్పందన ఉండదు అని జగద్గురువు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి గురించి ప్రస్తుతించారు. ఆమె మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి మహిషాసురమర్దినిగా కీర్తించబడింది.
నవమి నాడు అమ్మవారిని స్తుతించడానికి మహిషాసుర మర్దిని స్తోత్రం, అర్థం, దేవీ మాహాత్మ్యం పరిచయం చూడండి.
శుంభ నిశుంభులు, మాతృకలు
జగన్మాతే ధూమ్రాక్షుడిని, రక్తబీజుడిని, చండ, ముండులను, శుంభ, నిశుంభులనే రాక్షసులను సంహరించింది. ఈ రాక్షసులందరూ బ్రహ్మదేవుని గురించి, పరమేశ్వరుని గురించి తపస్సులు చేసి వరాలు పొందినటువంటి వారు. దేవతల నుంచి ఎటువంటి భయాలు లేకుండా వరాలు పొందారు. కానీ స్త్రీ అంటే చులకన. ఆడవారు మననేం చేస్తారులే! అనే చులకన భావన స్త్రీల మీద! కనుకనే అమ్మవారు ఈ రాక్షసులందరినీ తనలో నుంచి బ్రాహ్మీ , వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, ఐంద్రీ, వారాహి, నారసింహీ, చాముండా, శ్యామలా, కాళీ మొదలైన దేవతాగణాలను ఉద్భవింపజేసి, వారితో కలిసి రాక్షసులతో యుద్ధం చేసి, దానవులందరినీ సంహరించింది. ఈ దుష్ట రాక్షసులందరినీ జగన్మాత ఈ నవరాత్రులలో సంహరించినందున నవరాత్రులలో జగన్మాత వివిధ రూపాలను, అవతారాలను మనం కీర్తిస్తాం, ఆరాధిస్తాం.
నవమి పూజకు ముందు చాలా కుటుంబాలు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పూజా సంకల్పం చెప్పుకుంటాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు
మహర్నవమి విశిష్టత ఏమిటి?
శరన్నవరాత్రులలో తొమ్మిదవ తిథి అయిన మహర్నవమి (మహా నవమి)కి దేవీ ఉపాసనలో అత్యున్నత స్థానం ఉంది. సంప్రదాయం ప్రకారం నవరాత్రుల ప్రధాన పూజ నవమి నాడే జరుగుతుంది, మహిషాసురుడిపై అమ్మవారి విజయాన్ని స్మరిస్తూ ఆమెను మహిషాసుర మర్దినిగా పూజిస్తారు. పదవ రోజైన విజయదశమి తొమ్మిది రోజుల దీక్షకు లభించే ఫలానికి పండుగ.
2026లో మహర్నవమి ఎప్పుడు?
దృక్ పంచాంగం ప్రకారం భారతదేశంలో మహర్నవమి సోమవారం, 19 అక్టోబర్ 2026; విజయదశమి మంగళవారం, 20 అక్టోబర్ 2026. బెంగాల్లో దృక్ దుర్గా పూజ క్యాలెండర్ ప్రకారం మహా నవమి మంగళవారం, 20 అక్టోబర్. USA, కెనడా, UKలలో కూడా మహా నవమి సోమవారం, 19 అక్టోబర్.
నవమి నాడు అమ్మవారిని ఏ అలంకారంలో పూజిస్తారు?
ఈ వ్యాసంలో చెప్పిన తెలుగు సంప్రదాయంలో నవమి నాడు అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరించి పూజిస్తారు. అలంకారాల క్రమం ఆలయాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంది, కనుక మీ ఆలయం ప్రకటించే షెడ్యూల్ చూడండి.
అమ్మవారి పది నవరాత్రి అలంకారాలు ఏవి?
ఈ వ్యాసంలో చెప్పిన క్రమం: బాలా త్రిపురసుందరి, గాయత్రీ మాత, అన్నపూర్ణాదేవి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ లలితా త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి, సప్తమి నాడు శ్రీ మహా సరస్వతి, అష్టమి నాడు దుర్గామాత, నవమి నాడు మహిషాసుర మర్దిని, దశమి నాడు జయా విజయా సహిత అపరాజితా దేవి, రాజరాజేశ్వరీ దేవి.
ప్రధాన పూజ విజయదశమి నాడు కాకుండా నవమి నాడే ఎందుకు?
సంప్రదాయం ప్రకారం నవరాత్రులలో ప్రధాన పూజ అంతా నవమి రోజే జరుగుతుంది, విజయదశమి నాడు కేవలం పునఃపూజ, ఉద్వాసన మాత్రమే నిర్వహిస్తారు. తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం, కనుక నవరాత్రులు ఆరాధించటమంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం.
సంపాదకుని గమనిక (19 అక్టోబర్ 2026)
ఈ వ్యాసం తెలుగులో HinduToneకు అందింది. తెలుగు పాఠమే మూలం; ఆంగ్ల పేజీ దాని యథాతథ అనువాదం. చిన్న సవరణలు మాత్రమే చేశాం: ఒక అక్షరదోషం సవరణ, ఒక అతిశయోక్తిని "ముఖ్యమైన పండుగలలో" అని మార్చడం, "హిందూ శాస్త్రాల ప్రకారం" అన్న చోట సంప్రదాయంగా పేర్కొనడం, శీర్షికలు, 2026 తేదీలు, అలంకారాల పట్టిక, అలంకారాల క్రమం ఆలయాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుందన్న గమనిక. తేదీలు దృక్ పంచాంగం ఆధారంగా.
చివరిగా నవీకరించినది: 19 అక్టోబర్ 2026.
సంబంధిత వ్యాసాలు
- మహా నవమి 2026: తేదీ, పూజ, విశిష్టత
- దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పూజా సంకల్పం
- నవరాత్రి 2026: తేదీలు, నవదుర్గల పేర్లు, పూజా విధానం
- మహిషాసుర మర్దిని స్తోత్రం: సాహిత్యం, అర్థం
- దేవీ మాహాత్మ్యం: సంపూర్ణ పరిచయం
- విజయవాడ కనకదుర్గ ఆలయం: ఇంద్రకీలాద్రి గైడ్
- దుర్గాష్టమి నాడు శ్రీ దుర్గాదేవి అలంకారం
- విజయవాడ కనకదుర్గ ఆలయంలో విజయదశమి (20 అక్టోబర్ 2026)
- విజయదశమి 2026 మంత్రాలు, అపరాజిత, శమీ పూజా విధానం




