ఆదిశంకరులు శివుడి వద్ద ఎందుకు ఉండలేదు?

శివుడు ఉండమని అడిగినా ఆదిశంకరులు ఎందుకు ఉండలేదు రెండు రోజులు:
శంకరాచార్యులు ” శివానందలహరి ” చేస్తూ ఒక అద్భుత శ్లోకంతో శివుణ్ణి ప్రార్ధిస్తారు:
అశనం గరళం ఫణీ కలాపో
వసనం చర్మచ వాహనం మహోక్షః
మమ దాస్యసి కిం కిమస్తి శంభో
తవ పాదాంబుజ భక్తిమేవ దేహి “
ఓరోజు శంకరాచార్యులవారికి శివుణ్ణి నేరుగా దర్శించి ప్రార్ధన చేసుకోవాలనిపించింది. కైలాసానికి చేరుకున్నారు. శివుడు పరమానందపడిపోయి ” రావోయ్, ఎన్నాళ్ళకి వచ్చావు, కూర్చో ” అన్నారు. 10 ని.లు అవగానే తను తిరిగి వెడతానన్నారు శంకరులు. ” అదేమిటోయ్ రాకరాక వచ్చావు, రెండు రోజులు ఉండి వెడుదువుగాని ” అన్నారు శివుడు.
అప్పుడు శంకరులు పై శ్లోకాన్ని చెబుతారు.
మనం వేరే ఊరిలో ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్ళామనుకోండి. ఇంట్లోకి ఆహ్వానించి సామాను ప్రక్కరూములో పెట్టుకో అంటాడు. లుంగీ ఇచ్చి కట్టుకోమని కాఫీ ఇస్తాడు. స్నానంచేసి రమ్మని టిఫిన్ పెడతాడు. తన స్కూటర్ మీదో కారుమీదో ఊరంతా చూపిస్తాడు. వెళ్ళేటప్పుడు ఏదో చిన్న జ్ఞాపిక ఇచ్చి సాగనంపుతాడు.
ఇదే విషయాన్ని శంకరులు ఈ శ్లోకంలో ఎంత అద్భుతంగా శివుడితో ఏమన్నారో చూద్దాం.
నువ్వు ఉండేదే శ్మశానంలో కనుక నన్నుకూడా ఓ ప్రక్కన సర్దుకోమంటావు. నువ్వు త్రాగేదే గరళం కనుక నాకు కూడా కొంచెం అదే త్రాగమని ఇస్తావు. నువ్వుకట్టుకునేదే జంతుచర్మం కనుక ఓ చిన్నముక్క నాకు కూడా ఇస్తావు కట్టుకోమని. నువ్వు తిరిగేదే ఎద్దుమీద కనుక దానిమీద ఎక్కించుకునే అటూ ఇటూ త్రిప్పుతావు నన్ను. నువ్వు ధరించేవే నాగుపాములు కనుక నేను వేళ్ళేటప్పుడు ఓ చిన్నపాముని జ్ఞాపికగా ఇస్తావు. ” ఇవన్నీ భరించడం నావల్ల అవదు కానీ నీపాదాలను సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించి అనుగ్రహించు స్వామీ ” అని వేడుకున్నారు అనుకోవాలి.
ఎంత అద్భుతంగా ఉంది శంకరుల వేడికోలు..
