ఆదిశక్తి మహిమ – సమారాధ్యామాద్యాం భావవ్యాఖ్య

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
అనేకే సేవంతే భవదధిక గీర్వాణనివహాన్
విమూఢాస్తే మాతః కిమపి నహి జానంతి పరమామ్।
సమారాధ్యామాద్యాం త్వాం హరిహరవిరించ్యాదివిబుధైః,
ప్రపన్నోऽస్మి స్వైరం రతిరసమహానందనిరతామ్ ॥౧3
భావము: ఓ తల్లీ! చాలా మంది (అజ్ఞానులైన ఉపాసకులు) నీకంటే అధికులని భావించబడే (లేదా నీ పరివార దేవతలైన) ఇతర దేవతా సమూహాలను, నీకంటే అధికులని భావించబడే (లేదా నీ పరివార దేవతలైన) ఇతర దేవతా సమూహాలను, సేవిస్తున్నారు (ఆరాధిస్తున్నారు). పరాశక్తివైన పరమప్రేమ స్వరూపిణివైన నిన్ను, అస్సలు తెలుసుకోలేకపోతున్నారు. బ్రహ్మ విష్ణువు శివుడు మొదలైన దేవతలచేతకూడా చక్కగా ఆరాధింపబడేదానవు. సృష్టికి మూలమైన ఆదిశక్తివి, పరమశివునితో కూడి ఆనందామృత రసంలో నిరంతరం నిమగ్నమై ఉండేదానివైన నిన్ను అచంచలమైన భక్తితో (స్వేచ్ఛగా) శరణు వేడుతున్నాను.
ఘనసార వ్యాఖ్యా:
ఓ తల్లీ! లోకంలో చాలా మంది జనులు నీకంటే గొప్పవారని భ్రమించి ఇతరమైన చిన్న దేవతలను ఆరాధిస్తుంటారు. ఈ దేవతలు ఒకానొక పరిమిత శక్తికి (ఉదాహరణకు: అగ్ని, వాయువు) ప్రతీకలు. కానీ ‘అమ్మవారు’ ఆ శక్తులన్నింటికీ మూలమైన “మూలప్రకృతి”. ఈ ఇతర దేవతలను కోరికల కోసం కొలిచేవారు “విమూఢులు” అని ఇక్కడ సంబోధించబడ్డారు ఎందుకంటే మహానది సమీపములో ఉంటూ దాహముకోరకు చెలమ కోసం వెతకడం వంటిదే ఇది. అటువంటి వారు అజ్ఞానులు, ఎందుకంటే సర్వోత్కృష్టమైన నీ తత్త్వాన్ని వారు గ్రహించలేక పోతున్నారు.
సమారాధ్యామాద్యాం త్వాం హరిహరవిరించ్యాది విబుధైః బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులవంటి త్రిమూర్తులే నిన్ను నిరంతరం ఆరాధిస్తారు. త్రిమూర్తులు త్రిగుణములకు సంకేతము ఈ గుణత్రయముచేతను గుణాధిష్ఠాతలచేతను ఆరాధింపబడు ఆదిశక్తివి. అంటే ఈమె గుణాతీత శక్తి. సృష్టి స్థితి లయ కారకులుకూడా ఈమె ఇచ్ఛా-జ్ఞాన-క్రియా శక్తులపైనే ఆధారపడి ఉంటారు. పరాశక్తి (కాళి) తన అంతరంగము ద్వారా అదృష్టంగా మనం చూడలేని ఊహించలేని విధంగా భూతములు, దేవతలు, మానవులు మొదలైన సృష్టిరచనా వైదుష్యాన్ని ప్రకటిస్తోంది కనుక ‘ఆద్యామ్’ అని చెప్పబడుతోంది.
‘రతిరస-మహానంద నిరతామ్’ ఇక్కడ ‘రతి’ అంటే కేవలం లౌకికమైన అర్థం కాదు. ఇది శివ-శక్తి ఐక్యం. మూలాధారములోని కుండలినీశక్తి సహస్రారచక్రంలోని సదాశివుడిని కూడినప్పుడు కలిగే స్థితి. దీనినే ‘సామరస్యం’ అని కూడా అంటారు. నన్ద శబ్దమునకు గోపకుడు అని అనర్థము. ‘మహానన్ద’ గొప్ప ఇంద్రియ నిగ్రహముగల యోగుల అని. “ఓ మాతా! ఇంద్రియ నిగ్రహం కలిగిన మహాయోగుల సహస్రార కమలంలోని బిందుస్థానంలో, పరమశివుడితో కలిసి నీవు పొందే ఆ నిరంతర పరమానంద స్థితియే నీ స్వరూపం.” ఆ స్థితిలో అమ్మవారు ఎప్పుడూ ఉంటుంది. ఆ ఆనందాన్ని సాధకుడు తనలో అనుభవించడమే పరమార్థం.
పరమశివునితో కలిసి బ్రహ్మానందస్థితిలో ఉండే నిన్ను నేను సంపూర్ణంగా శరణు వేడుతున్నాను.
“ప్రపన్నః అస్మి” అంటే నేను నీకు అప్పగించుకున్నాను అని అర్థం. భక్తి మార్గంలో గానీ, జ్ఞాన మార్గంలో గానీ ‘అహకారం’ వీడి అమ్మవారి పాదాల చెంత చేరడమే మోక్షానికి మార్గం. సంపూర్ణ శరణాగతి.
🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
