homebanner

స్వామికి శస్త్రచికిత్స: పరమాచార్యుల కరుణ, శాస్త్రనిష్ఠ & మంత్రస్నానం మహిమ

స్వామికి శస్త్రచికిత్స: పరమాచార్యుల కరుణ, శాస్త్రనిష్ఠ & మంత్రస్నానం మహిమ

స్వామికి శస్త్రచికిత్స

అది 1974. పరమాచార్య స్వామివారికి ఒక కంటిలో దృష్టిలోపం ఏర్పడింది. ఒక కన్ను దాదాపు పూర్తిగా లేకుండానే తమ అనుష్టాలన్నిటినీ వదలక కొనసాగిస్తున్నారు. మహాత్ములు తమకు కలిగిన శారీరక వైకల్యాలను అస్సలు లెక్కచేయరు. అటు తరువాత కూడా స్వామివారి దినచర్యలో ఏమాత్రం తేడా కనబడలేదు. ప్రియశిష్యుల బలవంతం మీద కంటి శస్త్రచికిత్సకు అంగీకరించారు స్వామివారు. దురదృష్టవశాత్తు చికిత్స పూర్తి ఫలితాన్ని ఇవ్వలేదు. అంతేకాక ఇక ఆ కంటికి ఎటువంటి చికిత్స చేయరాదు, చేసినా అది ఫలించదు. స్వామివారు ఈ వయస్సులో ఒక కంటితోనే గడుపుతున్నారు.

కొద్దికాలం తరువాత మరొక కన్నులో కూడా శుక్లాలు రావడం మొదలయ్యింది. ఈ విషయం తెలిసి చాలామంది శ్రీమఠం భక్తులు, శిష్యులు స్వామివారిని కలిసి, “మీరు కంటి శుక్లాలకు చికిత్స తీసుకుంటే బావుంటుంది” అని వేడుకున్నారు.

స్వామివారు చిరునవ్వుతో తిరస్కరించారు. “అవసరం లేదు. నేను ఒక్క కంటితోనే చంద్రమౌళీశ్వర పూజ చేస్తాను. అది చెయ్యడానికి నాకు ఒక్క కంటిచూపు చాలు” అని ప్రేమగా చెప్పారు. కానీ జయేంద్ర సరస్వతీ స్వామివారు ఈ నిర్ణయాన్ని అంగీకరించలేదు. శస్త్రచికిత్సతో కంటి శుక్లాలను నయం చేసుకోవాలని పలుమార్లు విజ్ఞాపన చేశారు. చివరికి స్వామివారు కూడా అంగీకరించారు.

ఈ సమయంలోనే మైలాపూర్ లో ఉన్న ప్రముఖ న్యాయవాది శ్రీ కృష్ణమూర్తి ద్వారా డా. బద్రినాథ్ స్వామివారికి దగ్గరయ్యారు. బద్రినాథ్ చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. వారికి వృత్తి పట్ల ఉన్న నిబద్ధత, సేవా భావాలను చూసి, వారినే స్వామివారికి శస్త్రచికిత్స చేయించడానికి శ్రీమఠం అధికారులు నిర్ణయించారు.

డాక్టరుగారు మొదట జయేంద్ర సరస్వతీ స్వామివారిని కలిసి మహాస్వామి వారికి శస్త్రచికిత్స జరిగే విధానం గురించి వివరంగా తెలిపారు. సన్యాసులు ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోరాదు మరియు నర్సులు, ఇతర సహాయకులు స్వామివారిని తాకకుండా షరతులు పెట్టారు మఠంవారు. డాక్టరుగారు అంతా విని, “నేను కూడా పరమాచార్య స్వామివారి భక్తుణ్ణి, స్వామివారి ఆశ్రమ జీవితానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను” అని మాటిచ్చారు.

శస్త్రచికిత్స జరిగేటప్పుడు కేవలం డా. బద్రినాథ్ మాత్రమే ఉన్నారు. ఆయన తప్ప ఇతర ఆసుపత్రి సిబ్బంది ఎవరినీ అనుమతించలేదు. మరి శస్త్రచికిత్స సమయంలో డాక్టరుగారికి సహాయకులుగా ఎవరున్నారు?

శ్రీమఠంలో ఉన్న స్వామివారి సేవకులు కొందరికి సహాయకులుగా ఉండడానికి సరైన తర్ఫీదునిచ్చారు డాక్టరుగారు. శస్త్రచికిత్సకు కావాల్సిన యంత్రాలను చెన్నై నుండి తెప్పించి కాంచీపురంలో ఉన్న ఒక కల్యాణమండపాన్ని ఆపరేషన్ థియేటర్ గా మార్చారు. మొత్తం సిద్ధం చేసుకుని స్వామివారికి శస్త్రచికిత్స చేశారు.

శస్త్రచికిత్స విజయవంతమైనా ఆ కంటిని రోజూ వైద్యులు పరీక్షించాలి. డాక్టర్ బద్రీనాథ్ గారు రోజూ ఉదయాన్నే చెన్నైలో బయలుదేరి, కాంచీపురం చేరుకుని స్వామివారి కంటిని పరీక్షించి, మందు పూసి, కట్టు కట్టి చెన్నైకి వెళ్లిపోయేవారు.

ఒకరోజు గ్రహణం వచ్చింది. గ్రహణం గురించి తెలుసుకున్న బద్రీనాథ్ గారు కంగారుపడ్డారు. సాధరణంగా గ్రహణం పూర్తయిన తరువాత విడుపు స్నానం చెయ్యడం పరిపాటి. అందునా సన్యాసులు ఏ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. ఇప్పుడు జరిగిన కంటి శస్త్రచికిత్సను లెక్కచేయక మహాస్వామి వారు విడుపు స్నానం చేస్తే ఎలా అన్న ఆలోచన వారిని కలచివేసింది. అంతే వెంటనే కారులో కాంచీపురం బయలుదేరారు.

సాధారణంగా వచ్చే సమయం కన్నా ఇంత తెల్లవారుఝామునే మఠం ముందర డాక్టరు గారి కారును చూసిన మఠ పండితులు, పరిచారకులు సాధారణ సమయం కంటే ఇవాళ ఇంత ఉదయాన్నే వచ్చారు డాక్టరు గారు అని ఆశ్చర్యపోయారు.

మఠం అధికారుల అనుమతితో పరమాచార్య స్వామివారి ముందు నిలబడ్డారు. స్వామివారికి సాష్టాంగం చేసి ఏమీ మాట్లాడకుండా స్వామివారి ముందు నిలబడ్డారు. ఇంత ఉదయాన్నే రావడానికి గల కారణం ఇంకా ఎవ్వరికీ తెలియలేదు.

అంతలోనే స్వామివారు చిరునవ్వుతూ రెండు చేతులు పైకెత్తి ఆశీర్వదిస్తూ, “నేను స్నానం చేస్తానని భయపడ్డావా?” అని అడిగారు.

చెన్నై నుండి ఇంత ఉదయాన్నే వచ్చి, విషయాన్ని స్వామివారికి ఎలా చెప్పాలో ఆలోచిస్తూ నిలబడ్డ డాక్టరు గారు స్వామివారి మాటలను విని నిశ్చేష్టులై “అవును స్వామి, కంటికి శస్త్రచికిత్స ఈమధ్యనే కదా జరిగింది. ఇప్పుడు స్వామివారు గ్రహణ స్నానం చేస్తే ఆ కంటికి కాస్త సమస్య రావచ్చు. అందుకే స్వామివారు స్నానం చేయరాదని విన్నవించడానికి వచ్చాను” అని కంగారూ పడుతూ తెలిపారు.

“గ్రహణం వీడిన వెంటనే విడుపు స్నానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ నేను స్నానం చేయలేదు. మరి నేను ఎలా శుద్ధి చేసుకున్నాను? మన శాస్త్రాలలో ‘మంత్ర స్నానం’ అన్న విషయం ఉంది. ఆ ప్రకారంగా నేను స్నానం చేశాను. ఇలా చెయ్యడం నా కంటిచూపు కోసమో మరొకదాని కోసమో కాదు, నువ్వు ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్న వైద్యుడివి. ఏ కారణం చేతా నీ అభివృద్ధికి ఆటంకం కలుగరాదని ఇలా మంత్ర స్నానం ఆచరించాను” అని తెలిపారు స్వామివారు.

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ