నిత్యం ఆనందగా వుండాలి అంటే

భిన్నత్వంలో ని ఏకత్వాన్ని గుర్తించాలి, అప్పుడే ఆనంద ప్రాప్తి దొరుకుతుంది…
ఒక శ్రీ మంతునికి కృష్ణుడంటే చాలా ప్రేమ, కృష్ణునికి రోజూ పూజ చేసి, అభిషేకములనుచేసి, తీర్థమును స్వీకరించాలి అనే సంకల్పముతో 20 కాసుల బంగారముతో కృష్ణ విగ్రహమును చేయించుకున్నాడు.
ఆ తరువాత 20 కాసుల బంగారముతో కృష్ణుని కి ఒక గోవు చేయించాడు.
ఇంకా 20 కాసులు పెట్టి, నెమలినికూడా చేయించి కృష్ణుని వద్ద పెట్టాడు.
అభిషేకము చేయడానికి 20 కాసులతో ఇంకో బంగారు కప్పును చేయించుకున్నాడు ,నిత్యము ఆ కప్పుతో అభిషేకము చేయడం, తీర్థము త్రాగి ఆనందించడము, ఈవిధంగా కొంతకాలము జరుగుతూ వచ్చింది.
కానీ, కాలము ఎప్పటికీ ఒకే రకముగా ఉండదు కదా!
ఎప్పుడు హెచ్చు పల్లములు వస్తాయో ఎవరికీ చెప్పడానికి వీలు లేదు.
తన పుణ్య మంతా అయిపోయి ఈ శ్రీ మంతునికి ఆర్ధిక పరిస్థితి దిగజారుతున్న పరిస్థితి వచ్చింది.
కడపటికి ఈ బంగారు కాసుల విగ్రహములు వ్యాపారికి అమ్మి, డబ్బు తీసుకోవాలని వెళ్ళాడు,
అభిషేకం గిన్నె, నెమలి, గోవు అన్నింటికి వెలకట్ఠి , ధనము ఇచ్చాడు. చివరకు కృష్ణ విగ్రహము కూడా తూకం వేసి, పై వాటితో సమముగానే వెల కట్టాడు. ” కాదు కాదు కృష్ణుని కి వెల ఎక్కువ ఉండాలని గొడవచేశాడు ఈ శ్రీ మంతుడు.
అందుకా వ్యాపారి, ” అయ్యా, నీవు కేవలం రూపమును దృష్టి లో పెట్టుకుంటున్నావు, కానీ, నాకు అందులో ని బంగారమే ప్రధానము. దానికే నేను విలువ ఇస్తాను”, అన్నాడు.
ఆ శ్రీమంతునివలె మనము భిన్నభిన్నములుగా గోచరించే, రూపనామములనే దృష్టి లో ఉంచుకుంటున్నాము.
కానీ, అందరిలో ఏకత్వముగానున్న పంచభూతములు పరమాత్మ తత్వమునకు, విలువ ఇవ్వటం లేదు. అంతర్లీనముగా ఉన్న ఏక త్వమును అనుభవించి నప్పుడు, మనకు ఎంతైనా ఆనందము కలుగుతుంది, అని శంకరులవారు అద్వైత మును ప్రభోధిస్తూ వచ్చారు.
శుభమస్తు 🙏శ్రీ సద్గురు పీఠం నుండి…✍️
సమస్త లోకా సుఖినోభవంతు
