సోమరితనమే శత్రువు: సుభాషితం, భీష్ముడు చెప్పిన నీతి కథ

“సోమరితనమే శత్రువు”
విద్యార్థి అయినా, రోజువారీ కూలీ అయినా, అన్ని వేళలా చురుగ్గా పనులు చేస్తూ ఉండాలి. ఉన్నచోటనే ఉండిపోవడం ఓ పెద్ద జబ్బు.
సోమరితనాన్ని నిరసిస్తూ చెప్పిన సుభాషితం.
ఆలస్యం హి మనుష్యాణాం
శరీరస్థో మహాన్ రిపుః
నాస్త్యుద్యమసమో బంధుః
కృత్వా యం నావసీదతి
“మన శరీరంలోనే నివసించే పరమ శత్రువు సోమరితనమే. కష్ట పడి పని చేసే గుణాన్ని మించిన బంధువు లేడు. ప్రయత్నశీలురు ఆపదలో చిక్కుకోరు.”
మహాభారతంలో భీష్ముడు సోమరితనానికి సంబంధించిన చిన్న కథ చెప్పాడు.
ఓ ఒంటె తన మెడను అవసరమైనంత మేరకు పొడుగ్గా చేసే వరం దేవుని నుండి పొందింది. కూర్చున్న చోట నుండి కదలకుండా ఆహారం సంపాదించుకుంటూ ఉండేది. ఓ రోజు వర్షం నుండి రక్షించుకోవడం కోసం ఓ గుహలోకి తన తలను సాచింది. అక్కడున్న నక్కలు ఆ కంఠం కొరికి తినేశాయి. ఒంటె తన సోమరితనం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంది.
సోమరితనమే శత్రువు, ప్రయత్న శీలత్వమే మన బంధువు.
శ్రీ సద్గురు పీఠం నుండి…..✍️
