భార్యే శ్రేష్ఠ సఖి: దాంపత్య ధర్మంపై వైదిక సందేశం

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
నిన్నటి భార్యా శ్రేష్ఠతమా సఖా!
👉 కొనసాగింపు
భార్య గొప్ప స్నేహితురాలు
యజుర్వేద మంత్రాలలో స్నేహధర్మం గురించి చెబుతూ –
“స్నేహితునిగా భావించే వారిని పరిత్యజించరాదు. మిత్రుని వదిలిన వారికి ధర్మంలో భాగం ఉండదు. పుణ్యమార్గం అతనికి గోచరించదు” - అంటే ఇహపరాల్లో క్షేమం ఉండదని భావం. స్నేహబంధమైన దాంపత్యంలో దీనిని గుర్తుంచుకోవాలి...! మనిషి తనని తాను ఎలా క్షమించుకుంటాడో, తనతో తాను ఎలా రాజీపడతాడో..... తన భార్య ( భర్త ) తోనూ అలాగే సహన శీలియై సఖ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని భేదాలు వచ్చినా శాశ్వత ప్రయోజనమైన ధర్మం కోసం, స్నేహనిబద్ధత కోసం సహనం వహించడం ప్రేమధర్మం! “సామ్రాజ్ఞి శ్వశురేభవ మూర్థానాం పత్యురారోహ”
“నా గృహానికి నువ్వు సామ్రాజ్ఞివి, పతినైన నా శిరస్సుపై అధిష్ఠించు" - అని ఉత్తమస్థానంలో గౌరవించదగినది ఇల్లాలేనని వైదిక వివాహ మంత్రాల బోధన. “అర్థస్య సంగ్రహే పక్త్యాంచ పారిణాహ్యస్యచేక్షణే॥”
“ఆర్జించిన ధనాన్ని భార్యకు అధీనం చేయాలి. ధనరక్షణ, వ్యయాలపై ఆమెయే అధికారిణి. గృహంలో సదాచారంలోనూ, శౌచంలోనూ, ధర్మంలోనూ, ఆహారంలోనూ ఆమెకే పూర్ణ అధికారం” - అని వేదవాక్కు ఉపదేశం. “స్త్రీకి ధనాన్ని ఆర్జించే వేదన ఉండరాదు” - అని నిబంధించిన సంస్కృతంలోని ఉదారతని గ్రహిస్తే, ‘స్త్రీ ధనం కోసం ఆశపడే పురుషుడు అధముడు’ - అని హెచ్చరించిన మన మహర్షుల వాక్కుల్ని గుర్తుపెట్టుకుంటే, పవిత్రమైన వివాహ వ్యవస్థలో వరకట్నపు అపశ్రుతులు వినబడనే వినబడవు. కుటుంబ సామాజిక బాధ్యతలను ఒక యజ్ఞంగా నిర్వహించడంలో భార్యాభర్తలు కలిసి నడవాలి.
అసలు దాంపత్య ధర్మం అనాది , సనాతనం. ఒకే పరమాత్మ తనను రెండుగా విభజించుకున్నాడనీ, అదే ప్రకృతీ-పురుషులనీ, ఆ అర్ధనారీశ్వర తత్త్వం వల్లనే సమస్త విశ్వం ఆవిర్భవించిందనీ వేదం స్పష్టంగా పలికింది. ఈ విషయాన్నే పెద్దలు. ‘ద్విధాకృత్వాత్మనో దేహమర్ధన పురుషో భవత్’
అర్ధేన తస్యాం సా నారీ విరోజ మసృజతే ప్రభుః॥ ..అని తెలియజేశారు.
విశ్వనిర్మాణానికే మూలం దాంపత్యభావం. ఒకే పరతత్త్వం రెండయ్యింది. అలాగే స్త్రీ-పురుషభావం ఏకమవ్వాలి. ఆ ఏకంలో పరమాత్మ వైభవం ప్రకాశిస్తుంది. ప్రకృతి నియయం పాలించబడుతుంది. అంటే - దాంపత్యధర్మాన్ని అతిక్రమించడం ప్రకృతి విరుద్ధం. భార్యాభర్తల అన్యోన్యత గురించి రాముడు చెప్పిన ఒక్క మాట చాలు…! “అనన్యా హి మయా సీతా భాస్కరస్య ప్రభా యథా”
“సూర్యునికి వెలుగులా సీత నాకు అనన్య(వేరుకానిది)” దాంపత్యంలో ఔన్నత్యాన్ని తెలిపేది ఇంతకన్నా గొప్ప వాక్యం ఇంకేదైనా ఉంటుందా...! అసలు ఈ భూప్రపంచంలో వివాహ బంధాన్ని ఇంతగొప్పగా నిర్వచించిన ధర్మం ఇంకెక్కనా ఉందా ?. సర్వే జన సుఖినోభవంతు ...!! 🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
