జీవనశైలి

బంగారు పూల రథం

blank

ఉదయం కోసం ఎదురు చూస్తాం.
ఎదురు చూడాలి.
ఈ రోజుకంటే రేపు గొప్పది —
ఈ సంవత్సరంకంటే వచ్చే సంవత్సరం మరింత గొప్పగా ఉంటుంది.

ఎదురు చూడటంలో నమ్మకం ఉంది,
ఆశ ఉంది,
మనోబలం ఉంది,
శ్రద్ధ ఉంది,
ఇష్టం ఉంది,
అపారమైన ప్రేమ ఉంది.

బతకాలన్న కోరిక మెండుగా ఉంది.
వసంతం కోసం కోయిల,
కోయిల కోసం వసంతం ఎదురుచూస్తాయి.

ఎంతో కష్టపడి తాను పోగుచేసిన తేనెను
మనిషికి అందించాలనే సంతోషంతో
తేనెటీగ ఎదురు చూస్తుంది —
ఆ సహజత్వంలో అపారమైన ప్రకృతి ప్రేమ ఉంటుంది.

కారణజన్ములను కన్న తల్లులు కూడా
తొమ్మిది నెలలు తమ గర్భంలో మోసి
వారి రాకకోసం ఎదురుచూశారు.

ఈ రోజు వెళ్లిపోతుంది.
రేపు చిరునవ్వులతో మన ముందుకు వస్తుంది.
కొత్త ఆశలు రెక్కలు తొడుక్కుంటాయి.
కొత్త చిగుళ్లతో చెట్లు ముస్తాబవుతాయి.
కొత్త సూర్యుడు బంగారు పూల రథంపై వస్తాడు.

భవిష్యత్తులో జరగబోయే అద్భుతాల కోసం
అందరూ ఎదురు చూడాలి.

రామాయణంలో —
గుహుడు ఎదురుచూశాడు.
శబరి ఎదురుచూసింది.
కౌసల్య ఎదురుచూసింది.
దశరథుడు ఎదురుచూశాడు.
అయోధ్య ఎదురుచూసింది — శ్రీరాముడి జననం కోసం.

కాలాన్ని దివ్యత్వంతో నింపుతారు,
లోకాన్ని సంరక్షిస్తారు.
మంచి మనుషుల కోసం, మంచిపనుల కోసం
గొప్పవాళ్లు వస్తారు.

దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తారు —
అది అవతారుల పని.

“నావైపు దృష్టి పెట్టండి.
నన్ను గుర్తుంచుకోండి.
ప్రతి హృదయంలో నేను నివసిస్తాను.
మీరు ఎక్కడికో దూరం పోనవసరం లేదు.
నేను సనాతనుడిని, నిత్యనూతనుడిని.
పాత, కొత్తలో నేనే” —
అని భగవద్గీత బోధలో శ్రీకృష్ణుడు అన్నాడు.

విత్తనాలు భూమిలో నాటి
వర్షంకోసం ఎదురు చూస్తాడు రైతు.

ఆశలు జీవితంలో నాటి
బంగారు భవిష్యత్తుకోసం ఎదురు చూస్తాడు మనిషి.

మనిషి జీవించడమే ఎదురుచూడటం.
రేపటికోసం కొత్త జెండా మొయ్యాలి.
జీవన స్పూర్తిని నింపుకొని కాలాన్ని పండించుకోవాలి.

సరిహద్దుల్లో, చలిలో కాపలా కాసే సైనికుడిలా —
దేశభక్తితో, దైవభక్తితో
జీవితాన్ని రక్షించుకుంటూ జీవించాలి.

జీవితం అంతా ఎదురుచూపులే,
ఆశల ఊపిరులే.

కోరికలు తీరతాయి.
శుభవార్తలు వింటాం.
జరిగిపోయిన చెడును మరచిపోదాం.
జరగబోయే మంచిని నమ్ముదాం.

అపజయాలను పాఠాలుగా తీసుకొని,
ధైర్యం అనే జెండాను మోసుకుంటూ ముందుకు వెళ్ళాలి.

తీరం చేరడానికి నావ ఎంతో దూరం ప్రయాణించాలి.
ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు పోవాలి.
పట్టు విడవకూడదు.
పడినా వందసార్లైనా పైకి లేవాలి.

రేపటి విజయానికి
ఈ రోజును ముస్తాబు చేసుకోవాలి.

గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారడానికి
పరిణామం తప్పదు —
అదే దాని జీవన పరిపూర్ణత.

త్యాగరాజు ఇంటికి శ్రీరాముడు నడిచి వచ్చినట్లే,
విజయం కోటి చేతులతో
నూతన భవిష్యత్తును మన ముందుకు తెస్తుంది.

అందరూ శుభాకాంక్షలు చెప్పుకోండి!
బాధ్యతలు మరచిపోకండి.
ఆనందపు వెల్లువలో జీవన విలువలు విస్మరించవద్దు.

బతుకు శిఖరం చేరాలంటే జీవితాన్ని గౌరవించాలి.
పాత పనులైనా కొత్త భావాలతో చాకచక్యంగా చక్కబెట్టుకోవాలి.

సత్యమేవ జయతే!

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
జీవనశైలి

హిందూ రోజువారీ అభ్యాసాలలో యోగా మరియు ధ్యానం యొక్క పాత్ర

యోగా మరియు ధ్యానం కేవలం శారీరక లేదా మానసిక వ్యాయామాల కంటే చాలా ఎక్కువ – అవి స్వీయ-సాక్షాత్కారానికి మరియు అంతర్గత శాంతికి మార్గాలుగా హిందూ సంస్కృతిలో
blank
జీవనశైలి

హిందూ జీవితంలో జ్యోతిషశాస్త్రం పాత్ర

జ్యోతిష్యం, లేదా జ్యోతిషం, లక్షలాది మంది హిందువుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. పురాతన వేద జ్ఞానంలో పాతుకుపోయిన జ్యోతిష్ భవిష్యత్తును అంచనా వేయడానికి కేవలం ఒక