homebanner

కౌపీనం – కాషాయం: కంచి పరమాచార్య అనుగ్రహం

కౌపీనం – కాషాయం: కంచి పరమాచార్య అనుగ్రహం

Seshaa Avadhanigaru:
కౌపీనం – కాషాయం

నేను రాముణ్ణి కాకపోయినా నా తమ్ముడు చంద్రశేఖర్ నిజంగా లక్ష్మణుని వంటివాడే. భారతీయ వాయు సేనలో కార్పోరల్ గా చేస్తున్నాడు. ఇవ్వకూడని ఇంజక్షన్ ఇవ్వడం వల్ల కోమా దశలో పూణేలోని సదరన్ కమాండ్ మిలటరీ ఆసుపత్రిలో ఉన్నాడు. తమ్ముణ్ణి చూడడానికి కలకత్తా నుండి వచ్చాను. బ్రిగేడియర్ గా ఉన్న డా. నారాయణ అయ్యర్ నా తమ్మునికి చికిత్స చేస్తున్నారు.

“వేలల్లో ఒక్కరు మాత్రమే ఈ స్థితి నుండి బయటపడగలరు కనుక మా చేతుల్లో ఏమిలేదు. మీ దేవుణ్ణి ఆచార్యులను ప్రార్థించండి” అని నాతో అన్నారు. నేను నా తల్లి వద్దకు వచ్చాను. ఎందుకు వాణ్ణి వదిలి వచ్చావు అని నన్ను అమ్మ అడిగింది.

“పరమాచార్య స్వామివారిని దర్శించాలి అనుకుంటున్నాను అందుకే
ఇంటికొచ్చాను”

“నాతో పాటు వస్తావా?” అని అడిగాను.

“నన్ను తిరువణ్ణామలైలో వదిలిపెట్టు. నేను శేషాద్రి, రమణుల వద్ద ఉంటాను”.

“నేను ముందు పెరియవను దర్శించుకుంటాను అని సంకల్పం చేసుకున్నాను. అటుతరువాత నిన్ను తిరువణ్ణామలైలో వదిలిపెడతాను” అని చెప్పాను.

ఇద్దరమూ కాంచీపురం వెళ్ళాము. కాని మహాస్వామి వారు అక్కడ లేరు. తిరుమిలిసై ఆళ్వారుల 1001వ జయంతి ఉత్సవాలకని ఒరిరిక్కై వెళ్ళారు. మేము ఉదయం ఆరు గంటలకు ఒరిరిక్కై చేరుకున్నాము. అమ్మ ఒక చెట్టు కిందనున్న బండపైన కూర్చున్నారు.

“అమ్మా! నాన్నగారు పోయాక ఎలాగూ నువ్వు పూర్వాసువాసినిలా కాశిలో ముండనం చేసికొని, తెల్ల చీర కట్టుకుని ఉన్నావు. నువ్వు కూడా పరమాచార్యుల దర్శనానికి రావచ్చు కదా?” అని అడిగాను

“లేదు రా, నేను రమణులను, శేషాద్రిని తలచుకుంటూ ఇక్కడే ఉంటాను. నువ్వు స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత నన్ను తిరువణ్ణామలై తీసుకునివెళ్ళు”

ఆమె సమాధానంతో కాస్త చికాకుపడి, “కావాలనే పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకోకుండా ఉంటె, భగవాన్ రమణులు, శేషాద్రి స్వామివారు నిన్ను అనుగ్రహిస్తారనుకుంటున్నవా?” అని అడిగాను.

“చూడు, నాతో వాదించకు. నువ్వు వెళ్లి దర్శనం చేసుకో. నిన్ను నేను అడ్డుకోవడం లేదు. నేను ఇక్కడే ఉంటాను”

ఈ మనస్తత్వం ఉన్న నిన్ను వందమంది రమణులు, శేషాద్రి స్వాములు కూడా కాపాడలేరు అని లోపలకు వచ్చి స్వామివారికి సాష్టాంగం చేశాను. తమ్ముని దీన స్థితిని తలుచుకుని గొంతు గాద్గదికమవుతుండగా తిరువేంబావై నుండి 19వ పాశురాన్ని పాడాను.

తన్నుకొస్తున్న దుఃఖం వల్ల పాశురాన్ని పూర్తిచేయ్యలేక పోయాను. ఒక్క క్షణంపాటు నా తత్తరపాటును గమనించి, “పాశురాన్ని పూర్తిచెయ్యి” అన్నారు. స్వామి ఆజ్ఞమేరకు పూర్తిచేశాను.

“ఒంటరిగా వచ్చావా?” అని అడిగారు స్వామివారు.

“అమ్మతో పాటు వచ్చాను”

“అయితే, ఏమిటి విషయం?”

నా తమ్ముని దుస్థితిని స్వామివారికి తెలిపాను.

“మూత్రపిండం దెబ్బతినిందా?” అని అడిగారు.

“లేదు”

చేతితో స్వామివారి తలను చూపించారు.

“అవును, మెదడు దెబ్బతినింది” అని చెప్పాను.

చేతిలో తామరాకులో కొంచం కుంకుమ వేసి, రెండు నిముషాలు ధ్యానమగ్నులై కళ్ళు మూసుకున్నారు. “నువ్వు ఇప్పుడు కలకత్తా వెళ్తున్నావా?” అని అడిగారు.

“లేదు పెరియవ. మా అమ్మని తిరువణ్ణామలైలో విడిచి, పూణే వెళ్ళి కలకత్తాకు వెళ్తాను” అని బదులిచ్చాను. “వెంటనే ఈ కుంకుమని పూణేలో ఉన్న నీ తమ్మునికి పంపు” అని చెప్పారు. మరో పది నిముషాల పాటు ఇతర భక్తులతో మాట్లాడారు.

తరువాత నన్ను ఆశ్చర్యపరుస్తూ శ్రీవారు తమ కౌపీనాన్ని సర్దుకుని, పైకి లేచి కాషాయ వస్త్రాన్ని విప్పి రెండు మడతలు వేసి భుజంపైన వేసుకుని, ఎడమచేతిలో దండం పట్టుకుని బయటకు వెళ్తున్నారు. ఆ కౌపీనధారి కొద్ది దూరం నడిచి మా అమ్మ వద్దకు వెళ్ళారు. ఆమె స్వామివారిని చూడగానే ఆనందపరవశురాలై కాళ్ళపై పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది.

అమ్మకి పరమాచార్య స్వామివారి మొదటి ప్రశ్నయే, “మీ మాతామహుల పూర్వికులు ఎక్కడివారు?”

తిరువణ్ణామలై అని అమ్మ చెప్పింది.

“మీరు శేషాద్రి స్వామివారిని చూశారా? ఆయన మీ ఇంటికి వచ్చారు కదూ?” అని అడిగారు. ఈ ప్రశ్నతో చాలా సంబరపడింది.

“అవును”

“వారు ఏం చేశేవారు?”

“నన్ను వండిన అన్నాన్ని ఇమ్మనేవారు. చాలా వేడిగా ఉందని చెప్పేదాన్ని. కాని నాకు చాలా ఆకలిగా ఉందని నా మాటలను పట్టించుకునేవారు కాదు. అంతటి కాలుతున్న అన్నంలో చెయ్యిపెట్టి తినేవారు. సరిగ్గా రెండు సార్లు తినగానే తినడం ఆపేవారు. తరువాత మేమందరం దాని తినేవారం”

“భగవాన్ ని చూశారా?” అని అడిగారు ఈసారి.

“అవును వారిముంది మేము పాడేవారం”

“మీరు అక్షర మణిమాల పాడుంటారు కదూ”

“అవును. తెల్లవారుఝామున మూడున్నర నుండి వరుసగా వేంకటేశ్వర సుప్రభాతం, భగవద్గీత, వల్లల్లార్ తిరువరుత్ప, పాటలు పాడేవారం”

“ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు?”

“నన్ను తిరువణ్ణామలై తీసుకునివెళ్ళమని వాణ్ణి అడిగాను”
పరమాచార్య స్వామివారు నడిచి వెళ్ళిపోయారు. మహాస్వామి వారు తనతో భగవాన్ రమణులు, శేషాద్రి స్వామి గురించి అడిగారని అమ్మ ఎంతో ఆనందపడింది. ఇంకా నాతో అన్నది, “నువ్వు వారిని గమనించావా? నువ్వు వారిని పెరియవ అన్నావు, కాని వారు నావద్దకు కోపీనధారియై వచ్చారు. భగవానుల దేహంలా వారి దేహమూ కాంతివంతముగా ఉంది.

వీరి స్థితి కూడా రమణుల స్థితివలె తోస్తోంది. నువ్వు ఇది గమనించావా! వారి మాటతీరు అచ్చం శేషాద్రి స్వామివారి మాటల లాగే ఉంది”

రమణులు శేషాద్రి స్వామివారే కావాలి, పరమాచార్య స్వామి వారిని దర్శించను అన్న వ్యక్తికి మహాస్వామి వారు రమణులవలె కనిపించి, శేషాద్రి స్వామివారివలె మాట్లాడారు అని కొన్ని రోజుల తరువాత నాకు స్ఫురించింది.

రెండురోజుల్లో కుంకుమను నా తమ్మునికి పంపాను. అతని నుదుటికి, శరీరమంతా దాన్ని అలదారు. రాత్రి పదకొండు గంటలప్పుడు మగతగా పెరియవ పెరియవ అని కలవరించాడు. ఎదో చెయ్యాలని తాపత్రయపడి మంచం పైనుండి కిందకు పడిపోయాడు. ఏడుస్తూ, “ఓ! నేను పాపిని. సాష్టాంగం చెయ్యలేకపోతున్నాను. వారు వెళ్ళిపోతున్నారు” అని అన్నాడు.

అక్కడకు పరమాచార్య స్వామివారు వచ్చారని ఆపాదమస్తకం రెండు మూడు సార్లు తనని తీక్షణంగా చూశారని, వారికి నమస్కరించడానికి తన శరీరం సహకరించలేదని నాతో చెప్పాడు.

“అవును నిజం నేను పరమాచార్య స్వామివారిని ఆసుపత్రిలో నా పక్కన చూశాను!!!”

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

— తిరువణ్ణామలై గౌరీశంకర్ మామ

KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ