ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది…

అన్నం తినేముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం.
ఇరుకు ఇళ్లల్లో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం.
బాధ్యతల్ని ఎరిగిన తరం.
‘నేను’ అనకుండా, ‘మనం’ అంటూ బతికిన తరం.
డిగ్రీలు లేకపోయినా జీవితాన్ని చదివిన తరం.
గడియారం లేకపోయినా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం.
ఇంటర్నెట్ చూడకపోయినా జ్ఞానాన్ని నింపుకున్న తరం.
కాలిక్యులేటర్ లేకపోయినా లెక్కలు చేయగలిగిన తరం.
మొబైల్ ఫోన్లు లేకపోయినా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం.
టీవీలు లేకపోయినా వినోదంగా కాలం గడిపిన తరం.
GPS లేకపోయినా గమ్యాన్ని ఖచ్చితంగా చేరగలిగిన తరం.
సాంకేతికత లేకపోయినా సుఖసంతోషాలతో జీవించిన తరం.
ACలు, కూలర్లు లేకపోయినా ఆరుబయట హాయిగా నిద్రించిన తరం.
మినరల్ వాటర్ లేకపోయినా చెరువు–బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం.
పిజ్జాలు, బర్గర్లు కాకుండా పేలాలు, పీచు మిఠాయిలు తినే తరం.
రాత్రిళ్లు ఇంటి అరుగులపై కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపిన తరం.
ఆరో ఏడేళ్లు వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం.
పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి —
తెలుగు, ఇంగ్లీష్ రెండింటిలోనూ పండితులను చేసిన తరం.
కిలోమీటర్ల దూరాన్ని అవలీలగా నడవగలిగిన తరం.
క్రమశిక్షణ తప్పిన పిల్లవాడిని టీచర్ కొట్టితే,
మరిన్ని పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం.
వీధి నాటకాలు, తోలు బొమ్మలాటలు, బుర్రకథలు ఆస్వాదించిన తరం.
సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు–తెలుపు సినిమాలు చూసిన తరం.
ఇంటిముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం.
పనిమనుషులు, జిమ్, యోగా లేకుండా చెమట చిందించి వందేళ్లు బ్రతికిన తరం.
బంధాలకు విలువనిచ్చిన తరం — ఆస్తులకన్నా ఆప్యాయతలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం.
ఉమ్మడి కుటుంబాల్లో ఆనందంగా జీవించిన తరం.
భేదాభిప్రాయాలున్నా అందర్నీ కలుపుకుని వెళ్ళిన తరం.
వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం.
ఇతరుల మేలు కోరుకున్న తరం.
నీతి, నిజాయితీతో మోసాలు చెయ్యకుండా బ్రతికిన తరం.
రాళ్లు తిన్నా అరిగించుకోగలిగిన తరం.
కార్పొరేట్ ఆసుపత్రులు లేకపోయినా ఆరోగ్యంగా జీవించిన తరం.
హార్ట్ ఎటాక్, క్యాన్సర్ అనే పదాలు తెలియని తరం.
బీపీ, షుగర్ లను దరిచేరనీయని తరం.
లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం.
కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న తరం.
ఎంత ఉన్నా ఇంకా కావాలని ఆశపడని తరం.
ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం.
పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం.
త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసిన తరం.
కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం.
ఇలాంటి అపురూపమైన తరంలోని వ్యక్తులు
నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్తున్నారు.
వారిని కోల్పోతుంటే — సర్వం కోల్పోయినట్టే అనిపిస్తుంది.
వెళ్ళిపోతున్న ఆ తరం నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే —
భవిష్యత్తు అంధకారమే.
సేకరణ: కొ.భా.వే.సు — కర్నూలు
