మాఘ పౌర్ణమి శ్రీ లక్ష్మీనారాయణ హోమం – 2026 లో పవిత్ర తిధి & ఫలితాలు

మాఘ పౌర్ణమి
శ్రీ లక్ష్మీనారాయణ హోమము
మాఘ మాసం శాస్త్రపరంగా అత్యంత పవిత్రమైనకాలం.. శివ కేశవులిరువురికీ ప్రీతి పాత్రమైన మాసం ఇది..ఈ మాసంలో పౌర్ణమి తిథి అనేది ఒక మహత్తర మైన తిధి..దైవ శక్తి సంపూర్ణంగా వ్యక్తమయ్యే సమయం ఈ మాఘ పౌర్ణమి..
అటువంటి పవిత్ర పుణ్య దినాన శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద నిర్వహించబడే శ్రీ లక్ష్మీ నారాయణులు హోమము కేవలం ఒక పూజా విధానానికే పరిమితం కాదు..అందులో పాల్గొనే భక్తుని జీవన విధానాన్ని సరిదిద్దుకునే ఒక పవిత్ర అవకాశం..
శ్రీ లక్ష్మీ నారాయణు లను తలచుకొగానే మనకు ఒక సత్యం అవగతం అవుతుంది..
లక్ష్మీ దేవి సంపద, సౌఖ్యం, అనుగ్రహానికి ప్రతీకగా మనం కొలుస్తాము.. అలాగే శ్రీమన్నారాయుణి ని ధర్మ పరిరక్షకుడి గా భావిస్తాము.. శ్రీ మహావిష్ణువు అవతారమైన రాముడిని,.. లక్ష్మీదేవిని సీతమ్మవారిగా.. అన్యోన్య దాంపత్యానికి వారిని ఉదాహరణగా చూడటం మనకు తెలుసు..
సరిగ్గా చెప్పాలంటే.. ధర్మబద్ధమైన సంపద మాత్రమే మన వద్ద నిలుస్తుంది..ధర్మం లేకుండా వచ్చిన సంపద ఎక్కువ కాలం నిలబడదు..
ఇది కేవలం శాస్త్ర వాక్యం కాదు..అనుభవంలో ఋజువైన సత్యం..
మాఘ పౌర్ణమి నాడు శ్రీ లక్ష్మీనారాయణ హోమము నిర్వహించడంవల్ల మొదటగా కలిగే ఫలం అంతర్గత శుద్ధి. హోమాగ్నిలో సమర్పించే ఆహుతులు మనలోని దుష్ప్రవృత్తులను దహనం చేయాలనే సంకల్పానికి సూచిక..
ఈ శుద్ధి లేకుండా బాహ్యంగా ఎంత పూజ చేసినా.. ఫలితం పరిమితంగానే ఉంటుంది..
రెండవ ముఖ్యమైన ఫలం.. ఆర్థిక స్థిరత్వానికి మార్గం ఏర్పడటం. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. హోమము చేసినంత మాత్రాన ధనం వర్షంలా కురుస్తుందని భావించడం సరైనది కాదు. కానీ ఈ హోమము ద్వారా బుద్ధి శుద్ధి అవుతుంది.. మనం తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది..అనవసర ఖర్చులపై నియంత్రణ ఏర్పడుతుంది. ధర్మబద్ధమైన ఆదాయ మార్గాలు కనబడే పరిస్థితి క్రమంగా ఏర్పడుతుంది..
మూడవది కుటుంబ శాంతి.. శ్రీ లక్ష్మీనారాయణులు గృహస్థాశ్రమానికి ఆదర్శం..ఈ హోమము ద్వారా.. దంపతులకు ఒకరిపై ఒకరికి బాధ్యత భావం పెరుగుతుంది.. ఇద్దరు సమిష్టి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది..అటువంటి వాతావరణం లో ఆర్ధిక స్థిరత్వం ఏర్పడుతుంది.. ఎప్పుడైతే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందో అప్పుడు ఆ కుటుంబం సుఖ శాంతులతో ఉంటుంది..
ధర్మాచరణ లేకుండా లక్ష్మీ నిలవదు…జీవిత సత్యం.
కాబట్టి ఈ హోమములో పాల్గొనే ప్రతి భక్తుడు ఒక బలమైన సంకల్పం తీసుకోవాలి..
“నేను ధర్మబద్ధమైన మార్గంలోనే సంపాదిస్తాను. అసత్య మార్గాలను దూరం పెడతాను. వచ్చిన సంపదలో కొంత సమాజానికి, అవసరమైన వారికి వినియోగిస్తాను.”
ఈ సంకల్పంతో చేసిన హోమము మాత్రమే నిజమైన ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి కేవలం ఒక్క ధనం రూపంలోనే కాదు..మంచి పేరు, విశ్వాసం, మానసిక శాంతి, స్థిరమైన జీవితం రూపంలో మన ఇంట్లో నివసిస్తుంది..
మేము ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించే ఉద్దేశ్యం భక్తుల్లో అబద్ధపు ఆశలు కల్పించడం కోసం కాదు… ధర్మంతో కూడిన జీవన మార్గంపై అవగాహన కల్పించడం మాత్రమే..
మీరు ధర్మ మార్గాన నడచి.. మీరు సంపాదించే మొత్తం లో కొంత భాగం సత్కార్యాలకు వినియోగిస్తే..శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా మీపై ఉంటుంది…
మా విన్నపం ఒక్కటే..మేము నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి.. మీ ధర్మబద్ధమైన సంపాదన లోనుంచి మీ శక్తి కొలదీ వితరణ చేయండి..
సర్వం..
శ్రీ దత్త కృప..
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699)
