కర్మ, తల్లిదండ్రుల ఆశీర్వాదం & భక్తి మార్గాలు – శివసిద్ధి & జపంలో జీవితం ధన్యం

🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹
కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది. ఎంత గట్టిగా కొడితే తిరిగి అంతే గట్టిగా మన వైపు వస్తుంది. బంతి దెబ్బ నుండి తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం తప్పించుకోలేం! పామరుడు అయినా పండితుడు అయినా సరే తాను చేసిన ప్రతీ కర్మకు ఇప్పుడో మరెప్పుడో ఫలం అనుభవించాలి. కనుక కర్మ చేసినపుడు మంచిదా? చెడ్డదా? అని ఆలోచించి చేయాలి. మనకు లాభం వస్తుంది కదా అని ఏది పడితే అది చేసేస్తే కర్మ కూడా తన పని తాను చక్కగా చేసుకుపోతుంది. కనుక విచక్షణతో కర్మలను ఆచరించాలి. దేవుణ్ణి మనసు నిండుగా నింపుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి నిజముగా ప్రేమించినవాడే కర్మకు భయపడి ఉంటాడు. ఎందుకంటే వారు చేసిన పనికి దేవుడు క్షమించినా కర్మ వదిలిపెట్టదు అని వారికి బాగుగా తెలుసు కనుక.. అయితే దేవుడంటే లెక్క చేయని వారికి అది అంత సులువైన పని కాదు!. వాళ్ళు తమ బుద్ధులను మార్చుకుని దేవునివైపు తిరిగితే తప్ప వాళ్ళను రక్షించడం సృష్టి కర్త వలన కూడా కాదు!.
🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹
🍁 పెద్దల ఆశీర్వాదo విలువ 🍁
మీరు ఏదో ఒక పెద్ద పని కోసం బయటకు పోయి నప్పుడల్లా పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటారు. ఎందుకంటే మనకు వారి ఆశీర్వాదం లభిస్తే ఆ పని విజయవంతమవు తుంది. చాలా మంది ఇది అబద్ధం అనుకుంటారు. మరియు ఇదంతా పనికిరాని పని అని వారు భావిస్తారు. మనం కూడా వారిలో ఒకరు అoదుకే, ఈ రోజు మనం పెద్దల ఆశీర్వాదం ఎంత ప్రయోజనకరంగా మరియు ఫలవంత మైనదో తెలియజేసే కథను తెలుసుకుందాం.
పూర్వం సదాచార వేద పండితుడు ఒకడుండే వాడు. సరస్వతి కటాక్షమే కానీ లక్ష్మీ కటాక్షం లేనివాడు. అతనికి ఒక్కడే కుమారుడు. పండితుడికి వాక్సుద్ధి కలవాడిగా పేరొందినవాడు. అవసాన దశలో కొడుకుని పిలిచి, నాయనా! నేను నీకంటూ ఏ అస్తిపాస్తులు కూడపెట్టలేదు. కానీ నేను ఇంతవరకు నా జీవిత పర్యంతం ఆర్జించింది ఒక్కటే.
జీవితాంతం నా పని యెడల ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలన కాబట్టి, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయ వంతంగా ఉంటావు. నువ్వు ఏది పట్టినా అది బంగారం అవుతుంది *నాయనా! “, అని చెప్పి ప్రాణాలు వదిలాడు. తండ్రికి చేయవలసిన ఖర్మలన్నీచేశాడు. చేతిలో చిల్లి గవ్వ లేదు.
విచారంతో సముద్ర తీరం చేరి ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఊరికే కూర్చోక చేతితో దోసిలి నిండా ఇసుకను తీసుకొని క్రిందకు పోస్తున్నాడు. ఒకసారి పోసాడు. రెండో సారి పోసేటప్పుడు తండ్రి ఆశీర్వాదము గుర్తుకొచ్చింది. “పట్టిందల్లా బంగారం అవుతుంది” ఈ ఇసుక బంగారం అయితే ఎంత బాగుంటుంది అని ఇసుకను క్రిందికి పోసి చూసాడు. మూడో సారి ఇసుకను చేతిలోనికి తీసుకొని తలపకెత్తే చుట్టూ సైనికులు తమ ఆయుధాలు గురి పెట్టి నిల్చొని వున్నారు. ప్రక్కన రాజు గారు వున్నారు.
ఆయన తీవ్రంగా ఏం చేస్తున్నావు? ఏం వెతుకు తున్నావని అడిగారు. దానికి తండ్రి మరణం, తన దుస్తితి వివరించాడు. అప్పుడు సైనికులు దూరంగా తొలగారు.
రాజు గారు అన్నారు, మా నాన్న గారు కూడా ఇలానే ఆశీర్వదించి నాకు ఒక బహుమతిగా ఒక ఉంగరo ఇచ్చారు. అది రెండు రోజుల క్రితం ఇక్కడే ఎక్కడో పడి పోయింది. రెండు రోజులుగా వెతుకు తున్నాం. నీవు అవిషయం తెలుసు కొని వెతుకు తున్నావని మా సైనికులు అనుకొన్నారు అని చెప్పగానే చేతిలోని ఇసుక చటాలని క్రిందికి వదిలి లేచాడు. తండ్రి వాక్భలం.ఆ ఇసుక లొనే రాజుగారి ఉంగరం దొరినది.
రాజుగారి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.వెంటనే మూడు సoచుల బంగారు నాణాలు కానుకగా ఇచ్చారు. దానితో బంగారు నగల వ్యాపారం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి ఆ రాజ్యoలోని గొప్ప వ్యాపారస్తుల జాబితాలోకి చేరిపోయాడు.
👉తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవo.🍁 👉సారాంశం.
మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ.
🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹
నవవిధ భక్తి మార్గాలు
భగవంతుడిని భక్తులు సేవించి తరించడానికి
శ్రవణం
కీర్తనం
స్మరణం
పాదసేవనం
అర్చనం
వందనం
దాస్యం
సఖ్యం
ఆత్మనివేదనం
వంటి తొమ్మిది భక్తి మార్గాలు చెప్పారు.
వీటిలో ఏ ఒక్క మార్గాన్ని అనుసరించినా ఆ భక్తుడి జీవితం ధన్యం అవుతుందంటారు పెద్దలు.
ఈ తొమ్మిది మార్గాల్లో ఒక్కొక్కరూ ఒక్కొక్క మార్గాన్ని అనుసరించి చరిత్రలో నిలిచిపోయిన భక్తులు ఎందరో ఉన్నారు.
1 శ్రవణం
భగవంతుడి గుణగణాలు, నామాలు, కథలు వినడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకుని భగవంతుడికి దగ్గర కావడం. ఈ మార్గానికి పరీక్షిత్ మహారాజుఉదాహరణ. కథా శ్రవణాన్ని యోగంలా అనుష్ఠించి దాని ద్వారా ముక్తిని పొందాడు.
2 కీర్తనం
కీర్తనంలో ఉండే గానధర్మం వల్ల మనస్సు సహజంగా భగవంతుడివైపు ఆకర్షితమవుతుంది. భగవత్సంకీర్తనలో ప్రథమాచార్యుడిగా కీర్తి గాంచిన నారదుడు ఇందుకు ఉదాహరణ.
3 స్మరణం
భగవంతుణ్ని ధ్యానించడమే స్మరణ భక్తి. నిరంతరం నారాయణ నామస్మరణతో తరించి ఎన్నో అడ్డంకులను అవలీలగా ఎదుర్కొన్న ప్రహ్లాదుడు ఇందుకు గొప్ప ఉదాహరణ.
4 పాదసేవనం
భగవంతుడి పాదాల్ని, గురువుల పాదాల్ని సేవించడమే పాద సేవన భక్తి. అన్నయ్యే అన్నీ అనే ఉద్దేశంతో లక్ష్మణుడు రాముడికి పాదసేవనం చేసి తరలించాడు
5 అర్చనం
తులసి, పుష్ప మాలలతో భగవంతుణ్ని పూజించడం అర్చన. దీనికి ఉదాహరణ మథురానగరంలో కంసుడి పరిచారిక అయిన కుబ్జ. రకరకాల సువాసనలతో లేపనాలు తయారుచేయడం ఆమె పని. కృష్ణుడికి ప్రేమతో తన దగ్గరున్న లేపనాలు అందిస్తుందామె. ఆ లేపనాలు పూసుకున్న కృష్ణుడు ఆమె పాదాలపై తనపాదాలు మోపి గడ్డాన్ని స్పృశించగానే కురూపిగా ఉన్న కబ్జ సురూపగా మారిపోతుంది. పృధు చక్రవర్తిని కూడా ఇందుకు ఉదాహరణగా చెబుతారు.
6 వందనం
భక్తి, శ్రద్ధలతో భగవంతుడికి నమస్కరించడం వందనభక్తి. దీనికి ఉదాహరణ అక్రూరుడు. బలరామకృష్ణుల్ని రథం మీద మథురకు తీసుకెళ్లడానికి వచ్చిన అక్రూరుడు.. బృందావనంలో శ్రీకృష్ణ, బలరాముల్ని సమీపించి వినయంతో వందనం చేసి భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు.
7 దాస్యం
సర్వకాల సర్వావస్థల్లో భగవంతుడి సేవ చేస్తూ అదే భావనతో జీవించడమే దాస్యం. శ్రీ కృష్ణుడి చరణ సేవా భాగ్యాన్ని కోరుతూ ‘నీకు దాస్యంబు చేయని జన్మమేలా’ అని రుక్మిణి భక్తిని ప్రదర్శించింది. గరుత్మంతుడు, ఆంజనేయులది కూడా దాస్యభక్తే.
8 సఖ్యం
భగవంతుణ్ని స్నేహితుడిగా భావించి ఆయన గుణగణాల్ని అలవర్చుకోవడమే సఖ్య భక్తి. దీనికి అర్జునుడు మంచి ఉదాహరణ. సఖ్యం ద్వారా సన్మార్గంలో నడవడమే కాదు విజయం దిశగా అడుగులు వేయొచ్చని నిరూపించాడు అర్జునుడు.
9 ఆత్మనివేదనం
మనోవాక్కాయ కర్మలతో భగవంతుడికి తననుతాను అర్పించుకోవడం ఆత్మనివేదన భక్తి. బలి చక్రవర్తి ఇందుకు ఉదాహరణ. వచ్చినదెవరో తెలుసినప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తనని తాను అర్పించుకుని ఆత్మనివేదనం చేసుకున్నాడు బలిచక్రవర్తి.
ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాల్లో ఏం అనుసరించినా మోక్షం పొందొచ్చని భక్తుల విశ్వాసం.
మనం భగవంతుని జన్మరాహిత్యం కోసమే పూజించాలని పెద్దలు చెబుతారు. కాని దాన్ని మనం ముక్తి అనే పదంతో వాడుతుంటాం..
🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹
పరమపదం ‘శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు!’ అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది ‘శవ’మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం.
శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం.
అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.
శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే…
శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడే ధన్యుడు..
పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను ‘నీవెవరు?’ అని అడిగినప్పుడు- ‘చిదానంద రూపం శివోహం శివోహం’- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు.
అదే ‘శివసిద్ధి’.
అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు.
పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.
శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు.
జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివ సాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.
🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹
మనం మన కోరికలను తీర్చుకోవడం కోసం, దుఃఖములను, పాపములను పోగొట్టుకోవడం కోసం గుడికి పోవడం, తీర్థయాత్రలు చేయడం, పుణ్య నదులలో స్నానం చేయడం వంటివి చేస్తుంటాం.
అయితే ఇవన్నీ మంచివే, చేయవల్సినవే. కానీ వీటి అసలు అర్థం కోరికలు తీర్చుకోవడము కోసమో, పాపాలు పోగొట్టుకోవడం కోసమో మాత్రం కాదు!
ఇవన్ని హృదయ పరివర్తన రావడానికే తప్ప మరొకటి కాదు!!
కాకరకాయను తీసుకెళ్ళి పుణ్యనదులలో ముంచితే దాని చేదు పోతుందా!!? ప్రతినిత్యం అనేక పాపములను చేస్తూ, మనసులో ఉన్న అసుర గుణాలును తొలగించుకోక గుడులు చుట్టూ తిరుగుతూ, పూజలు, పుష్కరాలు చేసేస్తే ఆ పాపాలన్నీ పోతాయా!? దేవుడు అనుగ్రహిస్తాడా!??
ఇవి కాదు, హృదయంలో పరివర్తన ముఖ్యం. ఆ పరివర్తన రానిదే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ప్రయోజనం ఏమీ లేదు..
🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹
జపతో నాస్తి పాతకమ్
మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం।
యజ్ఞానాం జపయజ్ఞోస్మిః స్థావరాణాం హిమాలయః॥
“మహర్షులలో భృగు మహర్షి, వేదాల్లో ఏకాక్షరమగు ప్రణవం, యజ్ఞాల్లో జప యజ్ఞం (మానస యజ్ఞం), స్థిరంగా ఉండేవాని లోపల హిమవత్ పర్వతాన్ని నేనే అవుతున్నాను” అని విభూతి యోగంలో భగవానుడు చెప్పాడు.
ఏదేనా భగవన్నామాన్ని లేక పవిత్రమైన మంత్రాన్ని మళ్లీ మళ్లీ స్మరించడమే ‘జపం’.
అది యోగంలోని ముఖ్యాంశాల్లో ఒకటి.
జీవుడికి అది ఆధ్యాత్మికాహారం. మనిషిని దేవుడితో సమానంగా మార్చే స్పర్శవేది. భగవత్ సాక్షాత్కార మార్గంలో మిక్కిలి ప్రయాసతో సాగే సాధకులకు ఊతకర్ర.
“జపత్తేనైవదేవతా దర్శనం కరోతి, కలేనాన్యేషాం భవతి” అని ఉపనిషత్ వాక్యం.
‘భగవన్నామ జపం వల్లనే దేవతా దర్శనం కలుగును. కలియుగంలో ఇంకో మార్గం లేనే లేదు’ అని దీని అర్థం.
ఒక నిర్దుష్టమైన మంత్రంతో.. సంబంధిత దేవతను స్మరిస్తూ సరైన రీతిలో జపించాలి. అప్పుడు ఏర్పడిన శబ్ద తరంగాల ప్రకంపనాలు అత్యున్నత దశలో ఆ దేవతారూపాన్ని సృజించగలవు. మనం జపించే నామానికి, మంత్రానికి, మంత్రాధి దేవతకునూ భేదము లేదు.
‘రామ’నామాన్ని జిహ్వపై నిరంతరం జపిస్తే.. ఆత్మారాముని అనుభవ పూర్వకంగా దర్శించగలం.
నిష్కామ జపం చేసినవారి హృదయంలో భగవంతుడు జ్ఞానదీపం వెలిగించి, అజ్ఞానమనే చీకటిని తొలగిస్తాడు.
వాచికం, ఉపాంశు, మానసం అని జపం మూడు విధాలుగా ఉంటుంది.
వాచికం వైఖరీ రూపం. ఇది స్థూలం. ఉపాంశు దీనికన్నా సూక్ష్మం. శక్తిమంతం కూడా.
మానస జపం ఈ రెండింటికన్నా ఎక్కువ.
వాచిక జపంలో ఇష్టదేవత యొక్క కల్యాణ రూపాన్ని, మంగళకర గుణాల్ని స్మరించాలి.
ఉపాంశు జపంలో పెదవులు, నాలుక కదులుతాయిగానీ.. శబ్దం ఇతరులకు వినబడదు. మానస జపం చాలా ఉత్తమం.
ఇందులో ఇష్టదేవతా నామాన్ని లేక మంత్రాన్ని మనస్సునందే జపిస్తూ ఉంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఆనందం అనే సుగంధం గుభాళిస్తుంది. తన్మయత్వం ప్రాప్తిస్తుంది. ఇది ఆ దేవత అనుగ్రహానికి శుభ సూచనగా గుర్తించాలి.
ఈ జప యజ్ఞాన్ని నిష్కామంగా ఆచరిస్తే చిత్తశుద్ధికలిగి జ్ఞాననిష్ఠ లభిస్తుంది. ఇంద్రియచాపల్యం, మనశ్చాంచల్యం పోతాయి. కాల్చే శక్తి అగ్నికి సహజ స్వభావిక లక్షణమైనట్లుగా.. జపం సాధకుని పాపాలను పూర్తిగా దహించి ఇష్టదేవత తోడి పరమానందభరితమైన సంయోగాన్ని ప్రసాదిస్తుంది.
జపానికి పవిత్రత, హృదయ పూర్వకభావము, ఏకాగ్రచిత్తం మాత్రమే ముఖ్యంగానీ, జప సంఖ్య ముఖ్యం కాదు.
“కృషితో నాస్తి దుర్భిక్షం,
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి,
నాస్తి జగరతో భయమ్”
కృషి (వ్యవసాయం) చేసేవానికి కరువులేదు. జపము చేసేవానికి పాపం అంటదు. మౌనధారికి కలహాలు ఉండవు. జాగ్రత్తతో ఉండేవారికి భయం ఉండదని దీని భావం.
“స్తోత్రకోటి సమోజపః”
అనగా కోటి స్తోత్రాలకు సమమైనది జపం. జపం వల్ల ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. సమస్త ప్రాయశ్చిత్తాలలో నామ జపమే శ్రేష్ఠమైనది.
🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹
జీవితంలో వీలైనంత మేర అన్నదానము చేయండి .👍
