నేడు సోమావతీ అమావాస్య / అమాసోమవార వ్రతం

పంచాంగాల్లో, కేలండర్లలో కనిపించే ఈ అమాసోమవార వ్రతం గురించి నేటితరంలో చాలామందికి తెలీదు. కొన్ని తిథులు, వారాలు కలిసి వచ్చినప్పుడు శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. అందుకే అమావాస్య తిథి ఉండే సోమవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
సాధారణంగా వ్రతాలన్నీ దైవకేంద్రంగానే కొనసాగుతాయి. అయితే రావి చెట్టును పూజించడం ఈ అమాసోమవార వ్రతం అకాలమృత్యువుని నివారిస్తుందని. దీర్ఘాయును కలిగిస్తుందని వ్రతఫలంలో ఉంది. రావిచెట్టును ఎందుకు పూజించాలో తెలియజేసే శ్లోకం ఇది.
మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణురూపిణే అగ్రత శ్శివరూపాయ వృక్షరాజాయతే నమః॥
అశ్వత్థ వృక్షం త్రిమూర్తి అంశాత్మకంగా పూజనీయ మౌతుంది. పై శ్లోకాన్ని పఠిస్తూ అశ్వత్థ వృక్షానికి 108 ప్రదక్షిణలు చేసి, చివరిగా పండ్లు పాలు నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా 108 సోమవార అమావాస్యలు ఈ అమాసోమవార వ్రతం చేసి ఉద్యాపన చేయాలని వ్రత విధానం సూచిస్తోంది.
సోమావతి అమావాస్య / అమాసోమవార వ్రతం
సోమవారం రోజున అమావాస్య వస్తే దానిని “సోమావతీ అమావాస్యగా” పేర్కొంటారు.
“పంచాంగాల్లో అమాసోమవార వ్రతం” అని పేర్కొంటారు…
శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు.
మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్నది ఏమిటో తెలుసుకుందాము…
దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే! తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు.
అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది.
సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు.
ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించివేసుకుంది.
సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు.
ప్రమథగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడిచేశాడు.
అక్కడ యజ్ఞానికి వచ్చినవారందరినీ చావచితకబాదాడు.
శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు, చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు.
అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగినశాస్తిని అనుభవించాడు, నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు.
తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు, చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది.
రాబోయే సోమవారంనాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ.
ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే ఆరోగ్యవంతుడవుతాడని అభయమిచ్చాడు.
శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి, తన బాధల నుంచి విముక్తుడయ్యాడు.
అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని “సోమవతి అమావాస్య” పేరుతో పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది.
ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు.
సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు పితృ దేవతల ఆరాధన పితృదేవతలకు తర్పణం వదలడం ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతుష్టులవుతారు.
పూర్వీకుల ఆశీర్వాదం వల్ల కుటుంబంలో ఐశ్వర్యం, సంతోషం పెరుగుతాయి.
నేటి రోజున మర్రి చెట్టును పూజించి, నీళ్లు పోయండి.
ఇది మీ భాదలను తొలగిస్తుంది, ఈ రోజు తప్పనిసరిగా దానం చేయాలి,
ఈ రోజు పేదలకు దానం చేయడం వల్ల శని, చంద్ర దోషాలు తొలగిపోతాయి, దీనితో పాటు, పిత్ర దోషం నుండి కూడా విముక్తి లభిస్తుంది.
ఈ రోజున నీరు, గొడుగు, పాదరక్షలు, ఆహారం, నల్లని వస్త్రాలతో నిండిన కాడ దానం చేయడం ఉత్తమం.
సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు.
శివునికి పంచామృతాలతోనూ, శుద్ధ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు.
ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం.
ఈ పూజ పంచారామాలలో కానీ, రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట.
అభిషేకం చేయించలేని పక్షంలో కనీసం ఒక దీపమైనా శివాలయంలో వెలిగించాలని పెద్దలంటారు. ఏదీ కుదరకపోతే కనీసం శివపంచాక్షరి జపం అయినా చేయాలి అని చెబుతున్నారు.
- సోమావతీ అమావాస్య రోజున పేదపిల్లలకు అన్నదానం చేయాలి, ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం.
- ఈ సోమావతీ వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి.
- శని మంత్రాన్ని పఠించి, శ్రీ మన్నారాయణ మూర్తిని అర్చించాలి.
- గంగా నది, త్రివేణీ సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతీ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే, ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు, బాధలు తొలగుతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది.
- వేదవ్యాస మహర్షి చెప్పినదాని ప్రకారం సోమావతీ అమావాస్య నాడు పేదపిల్లలకు అన్నదానం చేసి, పుణ్యనదుల్లో స్నానం ఆచరించినవారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుని, పార్వతీ పరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి, మౌనం పాటించాలి…
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ 🙏
ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
