నరక చతుర్దశి & దీపావళి పండుగ ధనలక్ష్మి పూజ దీపావళి

‘నరకలోక విముక్తి కలిగించే నరక చతుర్దశి’
ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాము. నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. మన పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి. మన సంప్రదాయ పండుగల్లో ఒక రాక్షసుడి మరణాన్ని ఆనందంగా జరుపుకోవడమే నరక చతుర్దశి విశిష్టత.
పండుగలకు, ఖగోళ సంఘటనలకు సంబంధం కూడా ఉంది. నరకాసుర వధ చతుర్దశి నాడు (ఆశ్వయుజ బహుళం) ఆకాశంలో రాసుల స్థితిని సూచించేది. తుల రాశి తూర్పు క్షితిజం మీద ఉదయిస్తుంటే, పడమటి క్షితిజం మీద మేష రాశి అస్తమిస్తుంది.
నరకుడు భూదేవి కుమారుడు. మేషం సహజంగా మంచిదే అయినా మూర్ఖత్వమూర్తి. కాబట్టి అతడి పాలన అంధకారమయం. ఆ రోజునే మేష రాశి సూర్యాస్తమయ సమయంలో ఉదయిస్తుంది, అది అస్తమించే వరకు చీకటే.
మేష రాశి అస్తమించే వేళకు తుల రాశి తూర్పు దిక్కున వస్తుంది. స్వాతి నక్షత్రానికి అధిష్ఠాన దేవత వాయువు. దాన్ని అధిష్ఠించి నరకునిపైకి కృష్ణుడు, సూర్యుడు, సత్యభామ, చంద్రుడు బయలుదేరారు. నరకుడు చనిపోగానే ఆకాశపు అంచులపై దీపచ్చాయల్లో కన్య రాశి (కన్యల గుండు) నరకుని బంధాల నుంచి విడివడి, తమకు విముక్తి కలిగించిన సూర్యుడు-కృష్ణుణ్ని నాయకునిగా చేసుకుంది. ఇలాంటి స్థితి నరక చతుర్దశి, దీపావళి రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో లేదు.
నరక భావాలు అంటే దుర్భావాలను కృష్ణ భక్తి అనే చక్రాయుధంతో ఖండింపజేసి, జీవుడు భగవద్దర్శన ప్రాప్తితో ఆనందించాలి అనేది ఇందులోని అంతరార్థం. నరకాసుర వధ స్త్రీ స్వాతంత్ర్యానికి నిదర్శనం.
దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం, దీపదానం, యమ తర్పణం వల్ల నరక బాధలు ఉండవని చెప్తారు. నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వుల నూనెలో లక్ష్మీ, మంచి నీటిలో గంగాదేవి కొలువుంటారని శాస్త్రాలు వివరిస్తున్నాయి.
సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో దీపాలను వెలిగించి, నరకలోక వాసులకు పుణ్యలోక ప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని చెప్తారు.
‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశి నాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో, వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.
ఆ రోజు లేదా మర్నాడు తెల్లవారకముందే అభ్యంగన స్నానం చేయరాదనే నిషేధం ఉంది. అయితే, ఆశ్వయుజ బహుళ చతుర్దశికి అమావాస్య లేదు. పైగా ఈ రోజున అభ్యంగన స్నానం విధిగా చేయాలని వ్రత చూడామణి స్పష్టం చేస్తుంది. స్నానం చేస్తుండగా తల చుట్టూ దీపం తిప్పడం, టపాసులు కాల్చడం ముఖ్య ఆచారం.
తన వధకు ముందు శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడని తెలుసుకున్న నరకాసురుడు పరమాత్ముని క్షమాభిక్ష కోరాడు. అందుకు పరంధాముడు మన్నించి, నరకుడు చనిపోయిన దినం నాడు స్నానం చేసే వారికి పాప విముక్తి కలుగుతుందని వరం ప్రసాదించాడు.
శుభమస్తు 🙏 శ్రీ సద్గురు పీఠం సమస్త లోకా సుఖినో భవంతు
