సమాచారం మరియు సేకరణ

వ్యాస పౌర్ణమి – గురు పౌర్ణమి

blank

రేపు: 10/07/2025, గురువారం
ఆషాఢ శుద్ధ పౌర్ణమి – వ్యాస పౌర్ణమి

శ్రీ గురుభ్యో నమః

సనాతన ధర్మంలో గురువు యొక్క మహిమ

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||

వ్యాస పౌర్ణమి యొక్క విశిష్టత

వ్యాస భగవానుడి పేరు మీద ఆషాఢ శుక్ల పౌర్ణమిని ‘వ్యాస పౌర్ణమి’ అని, ఆ రోజున చేసే పూజను ‘వ్యాస పూజ’ అని అంటారు. యథార్థంగా ఈ రోజు ‘గురు పౌర్ణమి’ కంటే ‘వ్యాస పౌర్ణమి’ అనే పేరు సరియైనది. ఎందుకంటే, మానవ జాతి ఉద్ధరణ కోసం అపార జ్ఞానాన్ని అందించిన వ్యాస మహర్షికి కృతజ్ఞతలు తెలపడం ప్రతి మానవుని కర్తవ్యం. కృతజ్ఞత చెప్పకపోతే అంతకంటే కృతఘ్నత ఇంకేముంటుంది?

వ్యాసుడి జన్మదినమైన ఆషాఢ శుక్ల పౌర్ణమిని ఈ కృతజ్ఞతా రోజుగా నిర్ణయించారు. కలియుగంలో వ్యాసుడు అవతారం స్వీకరించిన ఈ పవిత్ర దినాన, మానవజాతి అంతా ఒక శ్లోకంతో ఆయనను స్మరిస్తుంది:

నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పద్మ నేత్ర!
ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః యేన త్వయా భారత తైలపూర్ణ !!

గురు పౌర్ణమి – వ్యాసుని ఆరాధన

వ్యాస పౌర్ణమి కాలక్రమేణా గురు పౌర్ణమిగా రూపాంతరం చెందింది. వ్యాసుడిని మొదటి గురువుగా భావించి నమస్కరిస్తారు. మన కళ్ల ముందు సజీవంగా ఉన్న గురువును సమీపించి, “అయ్యా! మీలో వ్యాసుని దర్శిస్తున్నాను” అని నమస్కారం చేస్తాం. అందుకే ఈ రోజును గురు పౌర్ణమి అని కూడా అంటారు. కానీ, యథార్థంగా ఈ పూజ వ్యాస మహర్షికే సమర్పితం.

వ్యాసుని పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది. ఈ కథ దానికి ఒక ఉదాహరణ:

పురాణ కథనం

పూర్వం వారణాసిలో వేదనిధి, వేదవతి అనే బీద బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. ఆధ్యాత్మిక చింతన, భక్తి, జ్ఞానంతో జీవించిన ఈ దంపతులకు సంతానం లేదు. ఎన్ని నోములు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది.

ఒక రోజు, వ్యాస భగవానుడు రహస్యంగా గంగానదికి స్నానానికి వస్తారని తెలుసుకున్న వేదనిధి, ఆయనను దర్శించాలని నిశ్చయించుకున్నాడు. వేయి కళ్లతో వ్యాసుని కోసం వెతికాడు. ఒక రోజు, భిక్షువు రూపంలో దండం, కమండలం ధరించిన వ్యక్తిని చూసిన వేదనిధి, వెంటనే ఆయన పాదాలపై పడి నమస్కరించాడు.

“మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాస భగవానులని గ్రహించాను. మిమ్మల్ని శరణు వేడుతున్నాను,” అని వేదనిధి విన్నవించాడు. వ్యాసుడు ఆప్యాయంగా వేదనిధిని లేవనెత్తి, “ఏమి కావాలో కోరుకో!” అన్నారు.

వేదనిధి, “రేపు నా తండ్రి పితృకార్యం ఉంది. దానికి తమరు అతిథిగా మా ఇంటికి తప్పక రావాలి,” అని వేడుకున్నాడు. వ్యాసుడు అంగీకరించారు.

మరునాడు వ్యాస భగవానుడు వారి ఇంటికి వచ్చారు. వేదనిధి, వేదవతి దంపతులు ఆయనను సాదరంగా ఆహ్వానించి, అతిథి సత్కారాలు చేశారు. శ్రాద్ధ విధులను విధివిధానంగా నిర్వహించి, వ్యాసునికి సాష్టాంగ నమస్కారం చేశారు. వారి ఆతిథ్యానికి సంతుష్టుడైన వ్యాసుడు, “ఏ వరం కావాలో కోరుకోండి!” అన్నారు.

“స్వామీ! ఎన్ని నోములు చేసినా సంతానం లేదు. ఆ వరాన్ని ప్రసాదించండి,” అని వేదనిధి, వేదవతి వేడుకున్నారు. వ్యాసుడు, “త్వరలోనే తేజోవంతులైన, ఐశ్వర్యవంతులైన పదిమంది పుత్రులు జన్మిస్తారు,” అని ఆశీర్వదించారు.

వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి, వేదవతి దంపతులకు సంతాన యోగం లభించింది. సుఖసంతోషాలతో జీవించి, చివరకు విష్ణు సాయుజ్యాన్ని పొందారు.

గురు పౌర్ణమి ఆచారం

సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం ఉంది. పూర్వకాలంలో శిష్యులు గురువులను ప్రసన్నం చేసుకుని, వారి నుంచి విద్య, జ్ఞానం నేర్చుకునేవారు. ఆశ్రమంలో గురువుతో కలిసి నివసించేవారు.

ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు. ఈ రోజున గురువులను పూజించి, గౌరవిస్తారు. పురాణాల ప్రకారం, ఈ రోజునే వ్యాస మహర్షి జన్మించారు. ఆయన జన్మదినానని మహాపర్వ దినంగా తరతరాలుగా జరుపుకుంటున్నారు.

ఈ రోజున వ్యాస మహర్షిని, గురు భగవానుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గురు పౌర్ణమి, చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. ఈ కాలంలో యతులు ఒక చోట స్థిరంగా ఉండి జ్ఞాన బోధ చేస్తారు. తొలి పౌర్ణమి అయిన గురు పౌర్ణమి, తపస్సంపన్నులను సమీపించి, జ్ఞానాన్ని సంగ్రహించే ఆచారానికి ఆధారం.

శుభాశీస్సులు

వ్యాస పౌర్ణమి రోజున వ్యాస మహర్షిని ప్రార్థిస్తే, ఆయన అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్పుతారు.

శ్రీ గురుభ్యో నమః
జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః

వాసు ముక్తినూతలపాటి

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
సమాచారం మరియు సేకరణ హిందూమతం

విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం

ఆత్మీయ హిందూ బంధువులకు నమస్కారం రేపు ఉదయం విజయవాడలో జరగబోయే హైందవ శంఖారావం కార్యక్రమానికి విచ్చేయుచున్న హిందూ బంధువుల కొరకు ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ, శ్రీ
blank
మహా కుంభమేళా సమాచారం మరియు సేకరణ

ప్రయాగ రాజ్ లో తెలుగు పురోహితులు

కుంభ మేళా లో ప్రయాగ్ రాజ్ కు వెళ్ళే తెలుగు వాళ్ళకి అద్భుతమైన అవకాశం. విజయవాడ కు చెందిన తెలుగు బ్రాహ్మణ పురోహితులు బృందం ప్రయాగ రాజ్