సురక్షిత పరిధి – జీవితం వెలుగు చూస్తేనే!

✍️ ఆనందసాయి స్వామి
మూడు పూటలా తింటూ, శరీరాన్ని సుఖపెడుతూ, ఒళ్లు వంచకుండా కాలం గడిపే భద్రజీవులకు…
సృజనాత్మకమైన, విభిన్నమైన ఆలోచనలు ఎంత చెప్పినా రాకపోవచ్చు.
సురక్షితమైన పరిధి అంటే ఏమిటో చాలామందికి తెలియదు.
తెలియకుండానే అందులోనే ఉండిపోతారు.
అక్కడే బతుకుతుంటారు.
బయట ప్రపంచం ఉందన్న భయంతో, ఆ పరిధిని దాటి ముందుకెళ్లలేరు.
వేగంగా ఆలోచించగలిగినా, ఆచరణలోకి రాలేరు.
పాముకి పుట్ట ఎంత సురక్షితం?
పిట్టకి గూడు ఎంత భద్రము?
అలాగే మనుషులకూ ఆ కంఫర్ట్ జోన్ ఒక గుహలా మారిపోతుంది.
అదే వారికి స్వర్గమై, సవాళ్ల దారి నరకమవుతుంది.
కానీ…
జీవితంలో ఎదగాలంటే, సాధించాలంటే – ఆ భద్రమైన పరిధి నుంచి బయటపడాల్సిందే.
బయటపడి పోరాటానికి సిద్ధమవ్వాలి.
బాధను ఎదుర్కోవాలి. బాధ్యతను భుజాల మీద ఎత్తుకోవాలి.
కొలిమిలా మండాలి.
కొత్త ఆలోచనలకు ప్రాణం పోసి, తానే బంగారంలా మెరయాలి.
శ్రీరాముడు సీతాన్వేషణలోకి దిగినప్పుడు
వానాకాలం ఎదురైంది… సముద్రం అడ్డుపడింది…
కానీ భద్రమైన గుహలో కూర్చోలేదు.
హనుమంతుణ్ని ఎంపిక చేశాడు.
సేనను నడిపించాడు.
లంకను దాటి విజయం సాధించాడు.
భద్రతల కోసమే బతికే జీవితం – నిజమైన మనిషి జీవితం కాదు.
అభివృద్ధి అనే దారి… నలుగురు తమ కంఫర్ట్ జోన్ వదిలినదే గనుక మొదలైంది.
భద్రలోకం ఆరోగ్యాన్ని ఇవ్వొచ్చు.
ఆస్తులు నిలబెట్టొచ్చు.
కానీ…
జీవితానుభవాలను ఇవ్వదు.
సాధనల పరిపక్వతను ఇవ్వదు.
కంఫర్ట్ జోన్ ఒక వల.
ఆ వల తాళ్లు తెంచుకొని బయలుదేరాలి.
అందులోనే ఉన్నామన్న స్పష్టత రావడం మొదటి విజయం.
అదే మొదటి అడుగు!
విశ్రాంతి అవసరం.
కానీ జీవితం మొత్తం విశ్రాంతి అయిపోకూడదు.
సురక్షితంగా బతకాలనుకునే ప్రతి ప్రాణీ ఒక్కరోజు బయటకే రావాల్సిందే.
గర్భగుహలో భద్రమన్న భావన…
జన్మ తరువాత భూమిమీద ఎదురయ్యే పోరాటాలన్నింటినీ మర్చిపోవడం కాదు.
ప్రతి మనిషీ –
లోపలకీ, బయటకీ – యుద్ధంలా సాగుతుంది అతని జీవితం.
దూరం ప్రయాణించాలంటే, భద్రతల బంధనాలను తెంచుకోవాల్సిందే.
ఈ సత్యాన్ని గ్రహించినవాడు –
పాము కుబుసాన్ని విడిచినట్లూ,
గద్ద తన ముక్కు పగలగొట్టి పునర్జన్మ పొందినట్లూ
తనను తానే మలచుకుంటాడు.
కొత్త ఆత్మవిశ్వాసంతో, దృఢతతో, దూకుడుతో
జీవితం అనే పర్వతాన్ని ఎక్కతాడు.
