జరిగేవి జరిగిపోతుంటాయి – కర్మ, ప్రార్థన, విధి సత్యం

జరిగేవి జరిగిపోతుంటాయి”
✍️
ఒక దొంగ దొంగతనానికి వెళ్లే ముందు దేవుణ్ణి ఇలా ప్రార్థించాడు:
“ఓ దేవుడా… నేను దొంగతనానికి పోతున్నాను.
పోలీసులకు దొరకకుండా, దొంగతనం చేసి రావడానికి దీవించు స్వామి.”
దొంగ దొంగతనం చేస్తుండగానే పోలీసులకు పట్టుబడ్డాడు.
అప్పుడతను మళ్ళీ దేవుణ్ణి కోరాడు:
“ఓ దేవుడా… పోలీసులకు దొరికితే దొరికాను,
కానీ లాఠీ దెబ్బలు పడకుండా నన్ను కాపాడాలి!”
కానీ పోలీసులు అతన్ని బేగంపేట దారిలో చావబాదారు!
మళ్ళీ దొంగ మనసులో ప్రార్థించాడు:
“సరే దేవుడా… కొట్టారు, కొట్టారు.
కానీ శిక్ష మాత్రం పడకుండా చేయి!”
కానీ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
మళ్ళీ దొంగ దేవుణ్ణి ఇలా అడిగాడు:
“ఓ దేవా… శిక్ష వేసినా పర్వాలేదు.
కానీ జరిమానా మాత్రం వేయకూడదు.
అసలే డబ్బులు లేవు… వుంటే నేను దొంగతనం ఎందుకు చేస్తాను?”
జడ్జి అరవయ్యేలా పదివేల రూపాయల జరిమానా కూడా విధించాడు!
**👉 మరి దేవుణ్ణి ఎంతసార్లు ప్రార్థించినా…
జరిగేవి మాత్రం జరిగిపోతూనే ఉన్నాయి.**
మనకు కావాలని, మన లాభం కోసం చేసే తప్పు పనిని
దేవుడు కాపాడడు.
ఎందుకంటే —
విధికి దాని ధర్మం ఉంది.
విధి కంటే పైగా ఎవ్వరూ లేరు.
**తప్పు చేస్తే —
కర్మఫలం తప్పదు.**
దొంగతనం అంటే,
ఒకరు కష్టపడి సంపాదించిన వస్తువులను తస్కరించడం.
అది ధర్మకార్యం కాదు.
ఆ వస్తువులు పోయినప్పుడు యజమాని ఎదుర్కొనే హృదయవేదన దేవుడికి బాగా తెలుసు.
అందుకే మన కర్మలను బట్టి మనకు న్యాయం లభిస్తుంది.
దేవుడికి అన్నీ తెలుసు.
ఎవరికి ఏ ఫలితం ఇవ్వాలో కూడా తెలుసు.
మనం ఏమి కోరుకుంటున్నామన్నది కాదు —
మనం ఏమి చేస్తున్నాం అన్నదే ముఖ్యము.
మనం ప్రార్థిస్తాం — అది సరి.
కానీ దేవునికి ప్రార్థన వెనుక ఉన్న ఉద్దేశం కూడా తెలుసు.
చీమకు ఆహారం పెట్టేవాడికి
మన కర్మలు తెలియకుండా పోవు.
స్వార్ధం లేకుండా చేసిన పని — పుణ్యం.
ఫలితం ఆశించి చేసిన పని — కర్మఫలం ఇస్తుంది.
అది తప్పదు.
మన పని, మన బాధ్యత, మన ధర్మం
భగవంతునికి అర్పిస్తూ
ఫలితాన్ని ఆశించకుండా చేస్తే —
అదే యోగం.
అదుకోసం హిమాలయాలకెళ్లాల్సిన అవసరం లేదు,
ఋషుల్లా తపస్సు చేయాల్సిన పనీ లేదు.
నిష్కామ కర్మే — యోగం.
