సుపుష్పైరాకీర్ణం – వాక్ సిద్ధి, కవిత్వామృత ప్రవాహం మరియు పరమపద లీనత్వం

🌻🍀🍁🌻🍀🍁🌻🍀🍁🌻🍀🍁🌻🍀🍁🌻
శ్లోకం:
సుపుష్పైరాకీర్ణం కుసుమధనుషో మందిరమహో
పురో ధ్యాయన్ ధ్యాయన్ జపతి యది భక్తస్తవ మనుమ్।
సగంధర్వశ్రేణీపతిరివ కవిత్వామృతనదీ
నదీనః పర్యంతే పరమపదలీనః ప్రభవతి ।। ౧౭।।
భావము:
అహో! ఆశ్చర్యం… ఓ తల్లీ! మన్మథుని నివాస స్థానమైనట్టి, సుగంధ పుష్పములతో నిండిన నీ దివ్య స్వరూపాన్ని తన హృదయంలో లేదా తన ఎదుట నిలుపుకుని, ఏ భక్తుడైతే నిరంతరం ధ్యానిస్తూ నీ మంత్రాన్ని జపిస్తాడో… అతడు గంధర్వ రాజు వలె అద్భుతమైన కవితా శక్తిని పొందుతాడు. అతని వాక్కునుండి కవిత్వం అమృతనదిలా ప్రవహిస్తుంది. అతడు సముద్రునివలె గంభీరుడై చివరలో పరమపదమైన మోక్షంలో లీనమైపోతాడు.
🌴 ఘనసార వ్యాఖ్యా: 🌴
అహో! ఆశ్చర్యం ‘సుపుష్పైః ఆకీర్ణం’ శ్రేష్టమైన, సుగంధభరితమైన పుష్పములచే నిండినట్టియు, కుసుమధనుషః పూలవిల్లు కలిగిన మన్మథునియొక్క నివాసము ఎదుట మళ్ళీ మళ్ళీ ధ్యానిస్తూ (ఏకాగ్రతతో) భక్తుడు నీ మంత్రాన్ని (పంచదశి లేదా షోడశి మంత్రం) జపించినట్లయితే; అతడు (ఆ భక్తుడు) గంధర్వ సమూహములకు ప్రభువు వలె, కవిత్వమనే అమృత నదిలా ప్రవహించువాడై నదులకు ప్రభువైన గాంభీరమైన సముద్రునివలె చివరలో జీవితాంతమున పరబ్రహ్మపదమునందు లీనమైనవాడుగా మోక్షం పొందినవాడు అగుచున్నాడు.
అహో! ఆశ్చర్యం సుపుష్ప + ఆకీర్ణం సు – సూయతే జాయతే అపత్యమ్ – పుట్టునది. సంతానము. శ్రేష్టమైన, వాసనాత్మకమైన సంతానరూపముగా వికసించుచున్న (విస్తరించుచున్న) నిత్యరజస్వలా రూపమైన సృష్ట్యారంభ (విశ్వోత్పత్తి) సామర్థ్యముగల, కుసుమధనుషః పూలవిల్లు కలిగిన మన్మథునియొక్క, ‘కుసుమ ’ అంటే రజస్సు. ఇది గుణ విశేషము. ఇది చలనమునకు, కోరికలకు, ఉత్సాహమునకు, కర్మలకు, అహంకారానికి సంబంధించిన గుణము. దీని ప్రభావం వల్ల జీవులు కర్మలు చేస్తూ, వాటి ఫలాలను అనుభవిస్తూ ఉంటారు.
ఈ రజస్సు ప్రధానంగా క్రియ, చలనం, సృష్టికి కారణ(ద్రవ్యము) గుణము. విశ్వరజస్సు అంటే విశ్వాన్ని చలింపజేసే, కోరికలను రేకెత్తించే, కర్మలకు ప్రేరేపించే ప్రాథమిక శక్తి లేదా గుణం దీనిని ధనుస్సుగా పట్టుకున్న వాడి మందిరం నివాసమైన, ఈ మందిరము అమ్మవారి స్వరూపం యోని త్రికోణము. పురః ఎదుట (మానసికముగా) నీ దివ్య స్వరూపాన్ని తన హృదయంలో నిలుపుకుని, ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఇక్కడ ద్విరుక్తముగా చెప్పడము ఎందుకు అంటే నిరంతరము ధ్యానిస్తూ అని చెప్పడమే. ఏ భక్తుడైతే నిరంతరము ధ్యానిస్తూ నీ మంత్రాన్ని జపిస్తాడో… ఇలా అమ్మవారిని ధ్యానించడం ద్వారా, సాధకుడు తనలోని సామాన్య కోరికలను ఉదాత్తమైన సృజనాత్మక శక్తిగా మార్చుకుంటాడు.
‘కవిత్వామృత నదీ’ (వాక్ సిద్ధి) అమ్మ అనుగ్రహం కలిగిన వెంటనే వచ్చే మొదటి శక్తి ‘వాక్ సిద్ధి ‘. సరస్వతీ కటాక్షం కలుగుతుంది. ఇతడు సామాన్య కవి కాదు, ‘గంధర్వపతి ‘ లాగా అద్భుతమైన, ఆనందాన్నిచ్చే కవిత్వం చెప్పగల సమర్థుడవుతాడు. పాండిత్యం అతనికి నదీప్రవాహంలా అప్రయత్నంగా వస్తుంది. నది – వాక్ నిత్య ప్రవాహ రూపమైనవి . కవి అంటే పరమాత్మ. ఆనందమే స్వరూపాముగా కలవాడు. ఆనందామృతము నిత్యముగా అనుభవిస్తున్న వాడౌతాడు. ఎలా అంటే ‘గంధర్వపతి’ లాగా. గంధర్వడు అంటే వేదవేత్త. గంధర్వపతి’ లాగా వేదవేత్తలకు పతియైన వాడు బ్రహ్మ. వివిదిషా సన్న్యాసుల పరమగతియైన బ్రహ్మవంటి వాడుగా అవుతాడు.
అంటే పరబ్రహ్మ తత్త్వాన్ని సాక్షాత్కరించుకున్న ఆత్మనిష్ఠలో స్థిరంగా ఉండే జీవన్ముక్తుడైన విద్వత్ సన్న్యాసి. ‘నదీనః పరమపదలీనః’ ఇక్కడ “నదీనః” సముద్రుడు నదులన్నీ ప్రవహించి చివరకు సముద్రంలో కలిసి తమ పేరును, రూపాన్ని ఎలా కోల్పోతాయో… అలాగే, సాధకుడు కూడా ఆత్మానందము అనే సముద్రంలో మునిగి, చివరకు తన ‘ నేను’ అనే అహంకారాన్ని వదిలి ఆ పరమపదంలో కాలీ చైతన్యములో ఐక్యమైపోతాడు.
🌻🍀🍁🌻🍀🍁🌻🍀🍁🌻🍀🍁🌻
